తొందరపడకండి!

  • ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో బిఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ అత్యవసర భేటీ
  • హాజరైన సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, సిటీ ఎమ్మెల్యేలు
  • దిల్లీకి వెళ్లిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
  • పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు స్పీకర్‌ అపాయిమెంట్‌ కోరిన జగదీష్‌రెడ్డి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 25: అధికారం కోల్పోవడంతో  బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే కారు దిగి హస్తం గూటికి చేరుతుండటంతో…డ్యామేజీ కంట్రోల్‌ కోసం స్వయంగా బిఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌)రంగంలోకి దిగాడు.  పార్టీలో సుదీర్ఘ కాలంగా పని చేయడమే కాకుండా, తనకు అత్యంత నమ్మకస్తులుగా పేరున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌  సంజయ్‌ వంటి వాళ్లు పార్టీని   వీడి కాంగ్రెస్‌లో చేరడటంతో బిఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ అప్రమత్తమయ్యారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో బిఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ మంగళవారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అత్యవసరంగా భేటీ అయినట్లు సమాచారం.

ఈ అత్యవసర భేటీకి ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్‌రావు,  వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్‌, టి.ప్రకాష్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, దండే విఠల్‌ తదితరులు హాజరైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా మరికొందరు కూడా అదే బాటలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండటమే కాకుండా, పార్టీ వీడుతారన్న సమాచారం మేరకు బిఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆరే స్వయంగా రంగంలోకి ఫామ్‌ హౌస్‌లో అత్యవసర భేటీని నిర్వహించినట్లు సమాచారం. ఈ భేటీకి హాజరైన ఎమ్మెల్యేలతో కలిసి లంచ్‌ చేసిన కేసీఆర్‌.. బిఆర్‌ఎస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఎవరూ తొందరపడొద్దని సూచించారని సమాచారం.  కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బిఆర్‌ఎస్‌కు వొచ్చే నష్టమేమీ  లేదని స్పష్టం చేశారని తెలుస్తుంది.

image.png

ఇలాంటి పరిణామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ జరిగాయనీ, అయినా  భయపడలేదని కేసీఆర్‌ గుర్తు చేస్తూ…బుధవారం నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారనీ,  ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్‌ రెడ్డి విఫలమయ్యారని అన్నట్లు సమాచారం. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా దెబ్బతిన్నదనీ, భవిష్యత్తులో మనకు మంచి రోజులు వస్తాయని, ఈ పరిస్థితుల్లో ఎవరూ కూడా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, పార్టీని మారి వెళ్లిన వారిపై అర్హత వేటు పడేలా న్యాయస్థానాలను కూడా ఆశ్రయించినట్లు చెప్పినట్లు తెలుస్తుంది. తొందరపడి పార్టీ వీడితే వొచ్చే బ్కె ఎ)క్షన్‌లో తగు మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందనీ…ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో అంత మంచి అభిప్రాయం లేదనీ, కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారనీ, బ్కె ఎలక్షన్స్‌ వొస్తే కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు గుణ పాఠం చెప్పడం ఖాయమనీ, అనవసరంగా తొందరపడి ఎవరూ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ అత్యవసర భేటీకి హాజరైన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ అన్నట్లు తెలుస్తుంది.

 

అయితే, ఈ భేటీకి హాజరైన ఎమ్మెల్యేలందరూ పార్టీని వీడబోమని చెప్పారనీ, కేసీఆర్‌తో జరిగిన ఈ అత్యవసర భేటీ మంచి వాతావరణంలో జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.  పార్టీకి చెందిన బడాబడా నేతలు పార్టీని వీడటం…ముఖ్యంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీడటాన్ని మాత్రం కేసీఆర్‌ జీర్ణించుకోకపోవడమే కాకుండా, అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోచారం, డాక్టర్‌ సంజయ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకుగానూ కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నీతాన్కె పని చేసిందనీ, అయితే, ప్రస్తుతం దిల్లీ లిక్కర్‌ కేసులో తీహరి జ్కెలులో ఉన్నక్రమంలో కనీసం మానవత్వం లేకుండా, వెనకా ముందు ఆలోచించకుండా పోచారం, సంజయ్‌ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వీడటాన్ని కేసీఆర్‌ సీరియస్‌గా తీసుకోవడానికి కారణంగా తెలుస్తుంది. ఎలాగైనా ఈ ఇద్దరు నేతలపై అనర్హత వేటు వేయించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

 

ఈ మేరకు పోచారం, సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్‌ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అపాయిమెంట్‌ను మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కోరగా…స్పీకర్‌ ఆలోచించి చెబుతానని చెప్పినట్లు బిఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే, ఇప్పటికే పార్టీ వీడిన వారిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించిన  బిఆర్‌ఎస్‌ పార్టీ తాజాగా…పార్టీ వీడిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌పైన కూడా అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయమై కేసీఆర్‌, హరీష్‌రావు, కేటీఆర్‌  న్యాయనిపుణులతో చర్చించారు. హైకోర్టు తీర్పును బట్టి  సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో బిఆర్‌ఎస్‌ అధిష్టానం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో వొదిలిపెట్టొద్దన్న గట్టి లక్ష్యంతో బిఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *