రెండు తెలుగు రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మారుతున్న రాజకీయ పరిణామాలు అదే సంకేతానిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలపై తెలంగాణలో చాలాకాలంగా చర్చ జరుగుతున్నది. అయితే దీన్ని కొట్టిపరేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రానున్న శాసనసభ ఎన్నికలు నిర్ణీత సమయానికే జరుగుతాయేగాని, ముందస్తుకు వెళ్ళేదిలేదని ఇటీవల జరిగిన టిఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయన తేల్చేశారు. కాని, ఆ పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ తాజాగా చేసిన ప్రకటన అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో ఎడెనిమిది నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని వినోద్‌కుమార్ పేర్కొనడంతో ముందస్తు ఆలోచన ఆ పార్టీలో తొలగిపోలేదన్నది స్పష్టమవుతున్నది. ఈ విషయంలో ప్రతిపక్షాలు మొదటినుండి కామెంట్ చేస్తూనే ఉన్నాయి. కెసిఆర్ ఏనాడు చెప్పింది చేయడని.. ఆయన ముందస్తు ఎన్నికలు లేవని చెబుతూనే అందుకు రంగం సిద్ధం చేసుకుంటాడని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రతిపక్షాలు అప్రమత్తం లేకుండా ఉండాలన్నదే ఆయన ఉద్దేశ్యంగా వారు పేర్కొంటున్నారు. ఆయనకు ముందస్తు ఎన్నికల ఆలోచన లేకపోతే ఇటీవల పాతవారికే టికెట్లిస్తామని ముందస్తుగానే ఎందుకు ప్రకటిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడో సంవత్సరకాలం తర్వాత ఉన్నప్పుడు ముందుగానే ఇలాంటి ప్రకటనచేసి, తన పార్టీలోనే ఆయన గందరగోళం ఎందుకు సృష్టించుకుంటారన్నది వారి వాదన. టిఆర్ఎస్ఎల్పీ సమావేశం కూడా అందులో భాగమేనంటున్నాయి ఆ పక్షాలు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా బిజెపి మాత్రం ఎన్నికలు ఎప్పుడు వొచ్చినా తాము సిద్ధమేనంటున్నాయి. అందుకు సంబంధించిన ప్రణాళికా రచనలో ఆ పార్టీలు ఇప్పటికే మునిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ కొత్త సారధులతో రంగప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా , బిజెపి అయితే అయిదవ విడుత ప్రజా సంగ్రామ యాత్రకు సోమవారం నుండి శ్రీకారం చుట్టింది. వాస్తవంగా ఈ యాత్ర సోమవారం నుండే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆటంక పర్చడంతో ఉన్నత న్యాయస్థానం నుండి ఆ పార్టీ అనుమతిని సంపాదించుకుంది. అయితే షరతులతో కూడిన అనుమతిని రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది.
హైకోర్టు తీర్పు వెలువడేవరకు మధ్యాహ్నం కావడంతో సోమవారం యాత్రను మంగళవారానికి వాయిదా వేసుకోవాల్సి వొచ్చింది. ఈ పాదయాత్రలో బండి సంజయ్ దాదాపు తెలంగాణ ప్రాంతమంతా చుట్టిముట్టినట్లు అవుతుంది. ఇప్పటికాయన నాలుగు విడతలుగా చేసిన పాదయాత్ర మంచి ఫలితాన్ని ఇవ్వడంతో ఆయన అయిదవ పాదయాత్ర చేపట్టారు. మరో పక్క వైఎస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర నిరాటంకగా తెలంగాణ జిల్లాలో జరుగుతున్నది. ఈ పాదయాత్రల సందర్భంగా ఏ ప్రాంతంలోకి ప్రవేశిస్తుందో అక్కడి స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్ర విమర్శనాస్త్రాలను కురిపిస్తున్నది. ఈ రెండు పార్టీలంతగా కాకపోయినా కాంగ్రెస్ పార్టీకూడా మరో పక్కనుండి దూసుకువొస్తున్నది. వెనుకబడిన వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నంతో బిఎస్పి గ్రామీణ ప్రాంతాలనుండి నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమం టిఆర్ఎస్ను ఊపిరి తీసుకోనివ్వడంలేదు. దానికి తోడు టిఆర్ఎస్ మంత్రులు, శాసనసభ్యులు, నాయకులే టార్గెట్ అన్నట్లుగా ఇడి, ఐటి దాడులు జరుగుతుండడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నది. నలుగురు ఎంఎల్ఏల కొనుగోలు వ్యవహారం దాన్ని తిప్పికొట్టే విధంగా ఉందను కున్నప్పటికీ అది ఈ దాడులను నిలవరించలేదన్న విషయం టిఆర్ఎస్ వర్గాలకు అర్థమయింది. దీంతో టిఆర్ఎస్ ఇప్పుడు మరింత అప్రమత్తమవుతున్నది. వీటన్నిటినుండి బయట పడాలంటే ముందస్తు ఒక్కటే ఏకైక మార్గమన్నది ఆ పార్టీ వర్గాల ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా ప్రజల దృష్టి ఇతర పార్టీలవైపు వెళ్ళకుండా చూసుకోవాలన్నదే ఆ పార్టీ ఆలోచన. ఇటీవల జరిగిన టిఆర్ఎస్ఎల్పీ సమావేశంలో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తమ క్యాడర్‌కు అదే బోధించారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని హితబోధించారు.
అంతటితో సరిపోదన్నట్లు ఆయనే రంగంలోకి దిగేందుకు సిద్ధపడ్డారు.. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ నాలుగు నుండి వరుసగా నాలుగు బహిరంగసభలను నిర్వహించాలని నిశ్చయించారు. డిసెంబర్ నాలుగున మహబూబ్‌నగర్‌లో మొదటి సభకాగా, డిసెంబర్ ఏడున జగిత్యాల్లో ఆ తర్వాత మహబూబాబాద్, కరీంనగర్లో ఈ సభల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్యలోనే రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనకూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలు తెలంగాణకు సమకూరుస్తున్నామన్న నిధుల విషయంలో వాస్తవాలేమిటన్నది సభా ముఖంగా తేటతెల్లం చేయాలన్న ఆలోచనకూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే ఇంతవరకు ముందస్తుపై ఆలోచన లేని ఏపిలో కూడా ఇప్పుడు దానిపై చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా జనసేన బిజెపితో జతకట్టడం, టిడిపి జనసేనకు అనుకూలంగా ఉండడం రానున్న ఎన్నికల్లో వైసిపికి ఇబ్బందికరమే. అందుకే పథకాల అమలుపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ, మంత్రులు, ఎంఎల్ఏలు క్షేత్రస్థాయి పర్యటన, అమలు పరుస్తున్న ఆకర్ష్ పథకం లాంటి ప్రక్రియలు అదే సంకేతాన్ని ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది.




