
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్…మొబైల్:9440595494
ఆధునిక సమాచార సాంకేతిక విప్లవం సమస్త మానవ జీవన విధానాన్ని సుదూర మార్పులకు గురిచేసిన వేళ, విద్యా రంగం కూడా తన సరిహద్దులను సరికొత్తగా నిర్వచించుకుంటోంది. ఒకప్పుడు నాలుగు గోడల తరగతి గది, నల్లబల్ల, చేతిలోని పుస్తకానికే పరిమితమైన అభ్యసన ప్రక్రియ నేడు డిజిటల్ తెరలపై నవ వసంతాన్ని సంతరించుకుంది. ప్రపంచం నలుమూలల నుంచి జ్ఞానాన్ని ఆర్జించే అవకాశాలు అందుబాటులోకి వచ్చిన ఈ కంప్యూటర్ యుగంలో, మాతృభాషా బోధనను ఆధునీకరించి విద్యార్థులకు సులభతరం చేయడం అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది.
ఈ నూతన సవాలును స్వీకరించి, సంప్రదాయ భాషా సేవకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి అపూర్వ విజయాన్ని సాధించారు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్ గొల్లపల్లి గణేష్. ధర్మపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా బోధకుడిగా సేవలందిస్తున్న ఆయన రూపొందించిన “తెలంగాణబడి” (telanganabadi.in) వెబ్సైట్ నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోని వేలాది మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒక అక్షర నిధిగా, డిజిటల్ విద్యా దిక్సూచిగా విరాజిల్లుతోంది.
తెలుగు భాషలోని సంక్లిష్టమైన వ్యాకరణాంశాలు, సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు మరియు ప్రాచీన పద్యాలను నవీన తరానికి అర్థమయ్యేలా బోధించడం ఉపాధ్యాయులకు నిరంతరం ఒక పెద్ద సవాలుగానే ఉంటూ వస్తోంది. ఈ అవసరాన్ని ముందే పసిగట్టిన డాక్టర్ గణేష్, విద్యార్థులలో అభ్యాసనం పట్ల ఆసక్తిని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకున్నారు. శారీరక వైకల్యం ఎదురైనప్పటికీ, దానిని ఏనాడూ తన కార్యాచరణకు అవరోధంగా భావించక, “సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు” అని నిరూపించారు. పాఠశాల పనివేళలు పూర్తయిన అనంతరం కూడా రాత్రింబవళ్లు శ్రమించి, కంప్యూటర్ పరిజ్ఞానంపై ఉన్న పట్టుతో స్వయంగా వెబ్ డిజైనింగ్ నేర్చుకొని ఈ వినూత్న డిజిటల్ వేదికకు ప్రాణం పోశారు.
తెలంగాణ రాష్ట్ర పాఠ్యపుస్తకాల రూపకల్పన సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్దేశించిన నూతన విద్యా ప్రమాణాలకు అనుగుణంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న సమగ్ర తెలుగు పాఠ్యాంశాలను ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. ప్రతి పాఠానికి సరళమైన వ్యాఖ్యానం, పద్యాలకు పాదభంగాలు లేకుండా భావాలు, కవుల కాలప్రామాణిక పరిచయాలు, కఠిన పదాలకు అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు మరియు వ్యాకరణ విశేషాలను విపులంగా విశ్లేషించారు. అమూర్తమైన విషయాలను సముచితమైన చిత్రాలు, రంగుల గ్రాఫిక్స్, యానిమేషన్లు మరియు వీడియో పాఠాల రూపంలో మలచి విద్యార్థుల ముందుంచడం ఈ వెబ్సైట్ ప్రధాన బలం. దీనివల్ల కఠినమైన భాషాంశాలు కూడా సుబోధకంగా మారి, విద్యార్థులలో స్వయంకల్పిత అధ్యయన శక్తి పెరుగుతోంది.
కేవలం కంటెంట్ అందించడమే కాకుండా, ఇంటరాక్టివ్ విద్యా విధానాన్ని ఈ వెబ్సైట్లో ప్రవేశపెట్టడం అత్యంత ప్రశంసనీయమైన అంశం. విద్యార్థులు పాఠం చదివిన వెంటనే తమ అవగాహనా మట్టాన్ని పరీక్షించుకునేందుకు వీలుగా అధ్యాయాల వారీగా అన్-లైన్ క్విజ్‌లను పొందుపరిచారు. జవాబు సమర్పించిన మరుక్షణమే ఫలితం, మార్కులు, సరైన వివరణలు తెలిసేలా వ్యవస్థను రూపొందించడం వల్ల విద్యార్థులు తమ లోపాలను తామే సరిదిద్దుకో గలుగు తున్నారు. వార్షిక పరీక్షలు, ప్రీ-ఫైనల్, యూనిట్ పరీక్షలతో పాటు ఎస్ఏ-1, ఎస్ఏ-2 ప్రాతిపదికన నమూనా ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచడం పరీక్షల భయాన్ని పోగొడుతోంది. దీనికి తోడు రామాయణ, మహాభారత ఘట్టాలు, ప్రాచీన-ఆధునిక తెలుగు మహాకవుల జీవిత విశేషాలు, సాహిత్య విమర్శా గ్రంథాల సమాచారాన్ని చేర్చడంతో తెలంగాణ బడి వెబ్సైట్ ఒక సమగ్ర విజ్ఞాన సర్వస్వంగా భాసిల్లుతోంది.

డిజిటల్ తరగతుల నిర్వహణలో స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లను వినియోగిస్తున్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ వెబ్సైట్ ఒక ఆపద్బాంధవుడిగా మారింది. పాఠ్యాంశాల ప్రదర్శనకు కావలసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, వ్యాకరణ పట్టికలు, బోధనా అభ్యాసనా సామగ్రి (TLM) ఉచితంగా లభిస్తుండటంతో బోధనా విధానం మరింత ప్రభావవంతంగా మారింది. ఈ మొత్తం సమాచారాన్ని పైసా రుసుము లేకుండా ఉచితంగా అందించడం డాక్టర్ గణేష్ యొక్క నిష్కామ సేవానిరతికి, సామాజిక బాధ్యతకు ప్రత్యక్ష నిదర్శనం. ఆయన చేస్తున్న ఈ అక్షర యజ్ఞాన్ని రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సులోచనతో పాటు అనేకమంది ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి ఇది ఒక నమూనా అని కొనియాడారు.
డాక్టర్ గొల్లపల్లి గణేష్ ఉపాధ్యాయ వృత్తికే పరిమితం కాకుండా సామాజిక వికాసంలోనూ తనదైన ముద్ర వేశారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో నిరుపేద విద్యార్థులను గుర్తించి, సామాజిక మాధ్యమాల ద్వారా మిత్రుల సహకారాన్ని కూడగట్టి ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగులు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన తీవ్ర క్లిష్టసమయంలోనూ జ్వరపీడిత కుటుంబాలకు స్వయంగా నిత్యావసరాలు, ఔషధాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని భాషా వికాసానికి, సామాజిక శ్రేయస్సుకు సాధనంగా మలచుకున్న డాక్టర్ గణేష్ సేవలు నవసమాజ నిర్మాణంలో నేటి తరం ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేసే అక్షర చైతన్యమూర్తిగా చిరస్థాయిగా నిలిచిపోతాయి.





