తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని పోరాడిన సాహితీకారుడు, తెలుగు భాషా ప్రవీణులు, తెలంగాణ వైతాళికులు దేవులపల్లి రామానుజ రావు గారు 25-8-1917లో వరంగల్ జిల్లాలో దేశాయిపేటలో అండాలమ్మ వెంకటాచలపతి దంపతులకు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య దేశాయిపేట లోను, ఉన్నత విద్య హనుమకొండలోను, నిజాం కళాశాల నుండి డిగ్రీ పట్టాను పొందాడు.తెలుగు భాషలో పాండిత్యం సంపాదించి చిత్తశుద్ధితో తెలుగు భాషా సేవలో నిమగ్నమై తన జీవితాన్ని భాషా వికాసం కొరకు ధారపోసిన మహనీయుడు. జవహర్ లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్ చంద్ గారి పుస్తకాలు, గాంధీ గారి హరిజన్ పత్రిక, తనలో చైతన్యాన్ని కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తను డిగ్రీ చదువుతున్న రోజుల్లో నిజాం కళాశాలలో విద్యార్థి సంఘం వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సరోజినీ దేవి ఉపన్యాసం తనను ఎంతగానో ఆకట్టుకుంది. మంత్రముగ్ధున్ని చేసింది.
సివి రామన్ గారికి నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంగా తను హైదరాబాద్ వచ్చి తెలుగులో ఉపన్యసించడం, సత్యమూర్తి గారి ఉపన్యాసాలు వీరికి భాషపైన మమకారాన్ని పెంచాయి.భాషా సేవ చేయాలనే దృక్పథాన్ని కలిగించాయి. దేవులపల్లి వారు నాగపూర్ లో (••దీ) న్యాయ శాస్త్రం అభ్యసిస్తున్న కాలం1942లో క్విట్ ఇండియా తీర్మానానికి వెళ్తున్న సందర్భంలో గాంధీ గారిని సేవాగ్రం రైల్వే స్టేషన్లో కలిసి సంభాషించడంతో దేశభక్తి ఇంకా పెరిగిపోయింది. జాతీయ ఉద్యమ నాయకులతో సంబంధం చైతన్యాన్ని పెంచింది. రాయప్రోలు సుబ్బారావు, గారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, మందుముల నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు గార్ల సన్నిహిత్యం ఉండేది. తెలుగులో సాహిత్య పత్రికలు లేని లోటు తీర్చాలని ఉద్దేశంతో శోభ అనే మాసపత్రికను స్థాపించి సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. సురవరం వారి గోల్కొండ పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. గ్రంథాలయ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారు. వరంగల్లో ఉన్న శబ్దాను శాసన గ్రంథాలయానికి కార్యదర్శిగా పనిచేశారు.
పూర్వకాలంలో ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఉర్దూ భాషలోనే జరిగేవి ఉర్దూ భాషకే ప్రాధాన్యత ఉండేది.తెలంగాణ సారస్వత పరిషత్తు ఏర్పాటు చేసి కార్యవర్గ సభ్యులుగాను అధ్యక్షులుగాను పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం,తెలుగు అకాడమీ స్థాపనలో వీరి పాత్ర కీలకం. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీన పరచుకునే ప్రయత్నాన్ని ప్రతిఘటించి విజయం సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనేట్ సభ్యుడిగా సేవలందించారు. రాజకీయ రంగంలో ప్రవేశించి రెండు సంవత్సరాల కాలం పార్లమెంటు సభ్యుడుగా పనిచేసే చేశారు. ఆ కాలంలో పరీక్షలన్నీ కూడాను ఉర్దూ భాషలోనే నిర్వహించేవారు. తెలుగు సారస్వత పరిషత్తు ద్వారా పోరాడి విద్యార్థులకు తెలుగు భాషలో పరీక్షలను రాసే అవకాశాన్ని కల్పించారు. తెలుగు భాష సంస్కృతి కోసం తన జీవిత కాలాన్ని ధారపోసిన మహనీయుడు దేవులపల్లి.
‘‘ఎంత వారినైనా ఎదిరించితివిగాని
పదవిగోరి తలవంచలేదు
సాయపడుటే గాని సాయమ్ము గోరలేదు
కవులపాలి కల్పకమ్ము’’ అన్నారు.
దాశరధి గారు.
తన రచనలలో తెలంగాణ మట్టి పరిమళం గుభాళిస్తూనే ఉంటుంది. పచ్చ తోరణాలు, సారస్వత నవనీతం, నా రేడియో ప్రసంగాలు, తెలుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం, ఉపన్యాసతోరణం, వేగుచుక్కలు, తెలుగు సాహితీ, తెలంగాణలో జాతీయ ఉద్యమాలు, బంకించంద్ర చటర్జీ జీవితం, హైదరాబాదులో స్వాతంత్రోద్యమం మొదలైన రచనలు, మరియు లెక్కలేనన్ని వ్యాసాలు రాశారు. మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ సాంస్కృతిక భావజాలాన్ని తెలుసుకోవడానికి వీరు రాసిన వ్యాసాలు ఎంతగానో ఉపకరించాయి. సాహిత్యపరమైన విశేషాలను సాహితీవేత్తలతో తనకున్న అనుబంధాన్ని వర్ణిస్తూ వేరువేరు భాషల ప్రభావం తెలుగు భాష పై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో వర్ణిస్తూ ‘‘యేబది సంవత్సరాల జ్ఞాపకాలు’’ అనే పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు. 1990లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించారు. దూరదృష్టి గల సృజన శీలురు.
తెలుగు సాహిత్య పరిశోధకులకు సాహితీ వెత్తలకు వీరి గ్రంధాలు మార్గదర్శకాలు. ప్రముఖ పాత్రికేయుడుగా, పత్రిక సంపాదకులుగా, ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతగా, సాహిత్య అకాడమీ స్థాపకులుగా తెలంగాణ సారస్వతా పరిషత్ స్థాపకులుగా ఎనలేని సేవలందించిన దేవులపల్లి వారు 8-6-1993న తుది శ్వాస విడిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీరి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాక తెలంగాణ సారస్వత పరిషత్తు లో ఉన్న ఆడిటోరియానికి డాక్టర్ దేవులపల్లి రామానుజారావు కళామందిరం అనే నామకరణం చేసి వారి సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. భావితరాలకు వీరి జీవితం వెలుగు బాట. వీరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తెలుగు భాషా వికాసానికి అందరూ కృషి చేయాలి.
కొమ్మాల సంధ్య, తెలుగు అధ్యా పకురాలు, సమ్మక్క సారక్క తాడ్వాయి, ములుగు జిల్లా
9154068272.




