కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9కు ‘‘చెన్నమనేని రాజేశ్వర్ రావు’’ పేరు
నేడు శత జయంతి సందర్భంగా ఆయన కృషిని స్మరించుకున్న సీఎం కేసీఅర్
ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), వారు చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ… సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల పరిథిలో సాగునీరును తాగునీరును అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 9(మల్కపేట రిజర్వాయర్‌తో పాటు దాని పరిధిలోని కాల్వలకు మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ దాకా) కు…‘‘చెన్నమనేని రాజేశ్వర్ రావు’’ పేరు పెడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి సామాజిక సేవలను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…‘‘స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ మొదటి తరం రాజకీయ వేత్తగా, నిరంతరం ప్రజల కోసం పోరాడిన గొప్పనేత చెన్నమనేని రాజేశ్వర్ రావు. తెలంగాణ రైతాంగం కోసం ఆనాటి కాలంలోనే వరద కాల్వ కోసం ఎత్తిపోతల పథకాల కోసం పోరాడిన చరిత్ర ఆయనది. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల నుంచి అత్యంత ప్రజాదరణ కలిగిన నేత. పలు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రాంత ప్రజల సాగునీరు తాగునీరు కష్టాలను తీర్చడానికి ఎత్తి పోతల పథకం కోసం చెన్నమనేని రాజేశ్వర్ రావు ఎన్నో పోరాటాలు చేశారు. నాటి వారి ఆకాంక్షలను ప్రతిఫలించే విధంగా స్వరాష్ట్రంలో సాగునీరు ప్రాజెక్టులను ఎత్తిపోతల పథకాలను నిర్మించుకున్నాం. తెలంగాణ రైతాంగం నేడు దేశం గర్వించే స్థాయిలో పంటలు పండిస్తున్నారు. వారు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ప్రాంత ప్రజలకు కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన ప్యాకేజీ 9 ద్వారా సాగునీరు అందుతున్నది. మిడ్ మానేర్(ఎస్ఆర్ఆర్) నుంచి ఎత్తిపోతల ద్వారా అప్పర్ మానేర్ దాకా నీటి సరఫరా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో…నాటి వారి కృషిని గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ, మల్కపేట రిజర్వాయర్‌కు దాని పరధిలోని ఎత్తిపోతల పథకానికి మొత్తంగా ప్యాకేజీ 9కు ‘‘ చెన్నమనేని రాజేశ్వర్ రావు’’ పెట్టడం జరిగింది.’’ అని తెలిపారు. సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది.




