ఆకాశమంతా మబ్బుల అలలే
తెరలు తెరలుగా!
నలుపు,తెలుపు మేఘాల కెరటాలే
దొంతరలు దొంతరులుగా!
పిల్ల మందమారుతం గిరగిరా
ఆకులను ఆడేస్తుంటే!
జంఘామారుతం బరాబరా
చెట్లను ఊపిస్తుంటే!
నీటికొంగల బారులు త్రిశూలంలా మారి
వలస పక్షులు తీరులు బల్లెంలా చేరి!
వెళ్లి మబ్బుల్ని గుచ్చాయేమో
ఎగిరే మేఘాలని అదిలించాయేమో!
నీటిచుక్కలుగా మబ్బులు వీడిపోతే
వానచినుకుల్లా మేఘాలు రాలిపోయాయి!
గుబులెక్కిన వనమంతా తలకునీళ్లొసుకుంటే
కైపెక్కిన గువ్వపిట్ట తడియారపెట్టుకుంది!
వీడిన వంసంతాన్ని తలుస్తూ
విచారంతో కోయిలమ్మ మూగబోతే!
విచ్చేసిన వర్షాన్ని చవిచూస్తూ
విరహంతో నెమలమ్మ నాట్యం చేస్తోంది!
జుర్రుకున్న తేనెలను చప్పరిస్తూ
తుమ్మెదలు సోలిపోతే!
జారుకున్న పరువాలను దాచుకుంటూ
పువ్వులన్నీ తెప్పరిల్లాయి!
అందరిదీ అదే కాలం
ఒక్కోతీరుగా, మరో రీతిగా
మీసం మెలివేస్తూ ముందుకురికింది!
నా మాయకు జోడీ లేనే లేదని!
– ఉషారం
9553875577




