వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్న రెరా డైరెక్టర్ శివబాలకృష్ణ
వంద ఎకరాల భూపత్రాలు..డబ్బుల కట్టల స్వాధీనం…కేసు నమోదు
శివబాలకృష్ణను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టిన ఏసీబీ…
ఫిబ్రవరి 8 వరకు రిమాండ్…చంచల్‌గూడ జైలుకు తరలింపు
స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 25 : అక్రమాలతో ఎదిగిన అధికారి సంపాదన వెలుగులోకి వొస్తుంది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగైదు వందల కోట్లు ఆస్తులు వెనకేసుకున్నట్టు అవినీతి నిరోధక శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. 30 గంటలకు జరుపుతున్న సోదాలు, విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే సంపద వెలుగు చూస్తుంది. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రేరా డైరెక్టర్‌గా ఉంటూ అక్రమ సంపాదనతో ఎదిగిన శివబాలకృష్ణ ఇంట్లో భారీగా ఆస్తులు బయట పడుతున్నాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 400 కోట్లకుపైగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నగలు, నగదు ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నానక్‌రామ్‌గూడలోని బాలకృష్ణ ఇంట్లో రూ. 84 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో విల్లాలు, ప్లాట్లు నగర శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ ల్యాండ్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ అధికారులకు దొరికాయి. దాదాపు 100 ఎకరాల ల్యాండ్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాల భూములు ఉన్నట్టు పత్రాలు లభ్యమయ్యాయి. ఇవన్నీ కూడా బినావిూల పేర్లతో ఉన్నాయి. మొత్తం 20 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు..2 కిలోలకుపైగా బంగారు ఆభరణాలు, భారీగా వెండి వెలికి తీశారు. 80కి పైగా అత్యంత ఖరీదైన వాచ్‌లు గుర్తించారు. పెద్ద మొత్తంలో ఐఫోన్ల సీజ్ చేశారు. జనాలను అడ్డదిడ్డంగా తొక్కేసి వొచ్చినదంతా మెక్కేసి అక్రమార్జనకు అలవాటు పడిన శివబాలకృష్ణ ఇన్నాళ్లకు చిక్కాడని ఆయన బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైసా లేనిదే ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకదని…పని చేయాలంటే లంచం ముట్టచెప్పాల్సిందేనంటున్నారు. అలా ఆయన బాధితులు వేల సంఖ్యల్లో ఉన్నరని సమాచారం. శివ బాలకృష్ణ భారీగా అక్రమ కట్టడాలకి కూడా అనుమతులు ఇచ్చినట్టు ఆరోపణలు వొస్తున్నాయి. అందుకే అవినీతి నిరోధక శాఖాధికారులు వారిపై కూడా దృష్టి పెట్టారట. ఆయన హయాంలో అనుమతులు పొందిన కట్టడాలు సేకరిస్తున్నారు. రూల్స్ వ్యతిరేకంగా ఉంటే వాటికి ఎలా అనుమతులు వొచ్చి ఉంటాయనే దిశగా కేసును విచారణ చేపట్టనున్నారు.
శివబాలకృష్ణను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టిన ఏసీబీ…స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు వెల్లడి
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్ఎండీ మాజీ డైరెక్టర్, రేరా కార్యదర్శి శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను నాంపలి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆయనకు ఫిబ్రవరి 8 వరకు జ్యుడిషియల్ రిమాండ: విధించింది. దాంతో అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం బాలకృష్ణ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా నగదు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న క్రమంలో బాలకృష్ణ ఇంట్లో పట్టుబడ్డ ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. గురువారం ఏబీసీ అధికారులు విూడియాతో మాట్లాడుతూ…బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి వివరాలను తెలియజేశారు. బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో సోదాలు చేశామని తెలిపారు. నిందితుడు బాలకృష్ణపై 13 (1) (బీ) , 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాలకృష్ణ ఇంటితో పాటు, బంధువులు, సహచురుల ఇళ్లల్లో సోదాలు చేశామన్నారు. బాలకృష్ణ ఇంట్లో 99.60 లక్షలు నగదు సీజ్ చేశామమని.. బంగారం 1988 గ్రాములు, సిల్వర్ 6 కేజీలు సీజ్ చేసినట్లు చెప్పారు. 8.26 కోట్లు రూపాయలు విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూలో ఇంకా ఎక్కువ ఉంటుందని తెలిపారు. మిగిలిన బీనావిూలపై విచారణ చేయాల్సి ఉందని ఏసీబీ అధికారులు వెల్లడిరచారు.




