గొడ్లు కాయడం కూడా సెన్సేషనే

  • బర్రెలు కాసే వీడియోతో ‘బర్రెలక్క’గా శిరీష ఫేమస్‌
  • యువత ప్రోత్సాహంతో కొల్లాపూర్‌ ‌నుంచి పోటీ
  • ఎవరి వోట్లను చీలుస్తుందోనని పోటీలో ఉన్న సీనియర్‌ ‌నాయకుల్లో భయం
మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 23 : ‘‌చదువుకోకపోతే గొడ్లు కాచుకోవాల్సిందే’ లాంటి మాటలు  దాదాపు ప్రతీ ఇంట్లో  వింటూనే ఉంటాం. చదువుకోకుండా ఆడుకుంటున్న తమ పిల్లలను గదమాయించే క్రమంలో తల్లిదండ్రులు అనే మాటలు ఇవి. కాని గొడ్లుకాచుకోవటం కూడా సెన్సేషన్‌ ‌క్రియేట్‌ ‌చేస్తుందన్నది ఇటీవల రుజువైంది. అది కేవలం ఒక ప్రాంతమో లేక ఒక జిల్లాకో పరిమితం కాలేదు, ప్రపంచంలోని తెలుగువారందరినీ ఈ వార్త ఎంతో ఆకర్షించింది. ఈ వార్తను ప్రమోట్‌ ‌చేసిన ఒక యూట్యూబ్‌ ‌ఛానల్‌కు మిలియ• •లకొద్ది వ్వూ వర్స్ ఉన్నారంటే ఈ విషయాన్ని అంత సులభంగా తీసుకునే అవకాశం లేదు. ఇంతకూ ఆ యూట్యూబ్‌ ‌ఛానల్‌ ఏం‌టా అన్న అసక్తి కలుగుతుంది కదా! అదే బర్రెలక్క ఛానల్‌. ‌బర్రెలక్క క్రియేషన్‌ ‌ఛానల్‌ అన్నమాట. వినటానికి కాస్తా ఎదోలా ఉన్నా అది ముమ్మాటికీ నిజం. ఇంతకూ ఈ ఛానల్‌ ‌క్రియేట్‌ ‌చేసింది ఎవరన్న ప్రశ్న కూడా ఉదయించక పోదు. ఒక మహిళా నిరుద్యోగి క్రియేషన్‌ అది. ఉస్మానియా ఓపెన్‌ ‌యూనివర్శిటీలో బి.కాం చదివింది. అప్పటి నుండీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నది. గ్రూప్‌ 1, ‌గ్రూప్‌ 2 ‌పోటీ పరీక్షలకు సిద్ధమైంది. అయితే ఏముంది..పేపర్‌ ‌లీక్‌లు, కోర్టు కేసులు, పరీక్షల వాయిదాల పర్వం. అమెను కుంగదీసింది.

నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్‌ ‌గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం వారిది. కుటుంబాన్ని పట్టించుకోని తండ్రి. తనతో పాటు తల్లి, ఇద్దరు తమ్ముళ్ళ జీవనం కోసం ఆ కుటుంబం చిన్నపాటి ఫాస్ట్‌ఫుడ్‌ ‌సెంటర్‌ ‌నడుపుకుంటున్నది. ఎంతో కష్టపడి చదువుకున్న చదువుకు విలువ లేకుండా పోయిందన్న బాధ ఒక వైపు, తాను కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోలేక పోతున్నానన్న తపన కర్నె శిరీష అలియాస్‌ ‌బర్రెలక్కలో మొదలైంది. వాళ్ళమ్మ సహకారంతో నాలుగు బర్రెలు(గేదెలు) కొన్నది. వాటి నుండి వొస్తున్న ఆరు లీటర్ల పాలను అమ్మడం ద్వారా తాను కూడా కుటుంబానికి ఆర్థికంగా సహాయపడుతున్నానన్న తృప్తి మిగిలింది. అయితే నిరుద్యోగులు ఉద్యోగాలు రాలేదని నిరాశపడవద్దని, ఇలా బర్రెలు కాచుకుని ఆత్మగౌరవంతో బతకవచ్చని చెప్పేందుకు బర్రెలతో కూడిన వీడియోను సోషల్‌ ‌మీడియాలో పెట్టింది. ఇంకేముంది దానికి వేలాది మంది నుండి రెస్పాన్స్ ‌వొచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగులంతా ఆమె నిర్ణయాన్ని మెచ్చుకోవటం ప్రారంభించారు. అప్పటి నుండి ఆమె అసలు పేరు పక్కకు పెట్టి బర్రెలక్కగా మారింది. అంతవరకు ఆగితే బాగుండు. ఆ వీడియోలో ఆమె నిరుద్యోగుల విషయంలో మాట్లాడిన తీరు పలువురు యువకులను ఆకర్షించింది. ప్రస్తుత ఎన్నికల్లో పాల్గొనమంటూ అనేక మంది ప్రోత్సహించడంతో ఆ దిశగా ఆమె అడుగులు వేసింది. దీంతో ఆమెకు వొస్తున్న మద్దతుకు బిజెపి, బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ అభ్యర్ధుల్లో దడ పుట్టింది. వారిలో భయం ఏమేరకు చేరిందంటే  తమ్ముడితో కలిసి ఇంటింటికీ ప్రచారం చేస్తున్న క్రమంలో వారిపై దాడివరకు వెళ్ళింది. అబల కదా ఏం చేస్తుంది..ఏడ్చేసింది. అయినా ఏమాత్రం వెనక్కు తగ్గేదిలేదంటున్నది కర్నె శిరీష అలియాస్‌ ‌బర్రెలక్క.

విచిత్రమేంటే ఆమె ఈ ఎన్నికల్లో ఢీకొనబోతున్నది మామూలు వ్యక్తులను కాదు. రాజకీయాల్లో తల పండిన వారిని. ఇప్పటి వరకు కొల్లాపూర్‌ ‌నియోజకవర్గాన్ని ఏలినవారంతా దిగ్గనాధీరులు. వీరిలో 11 సార్లు వెలమ సామాజిక వర్గాలకు చెందిన వారు, కాగా రెండు సార్లు రెడ్డి సామాజిక వర్గాలకు చెందినవారున్నారు. అలాంటి కొల్లాపూర్‌లో నిత్య జీవనం గడవడమే కష్టంగా ఉన్న నిరుపేద మాల కుటుంబానికి చెందిన ఒక సాధారణ చిన్న వయస్సు ఆడపిల్ల వేళ్ళూనుకున్న పార్టీల అభ్యర్దులతో ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ పడుతున్నది. రాజకీయాల్లో తలపండివ వారు కూడా ఎన్నికలంటేనే వెనక్కి తగ్గుతున్న రోజులివి. ఎంఎల్‌ఏ ‌పోటీ చేయాలంటే కోట్లాది రూపాయలను మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నది తెలియంది కాదు. ప్రచార సాధనాలు, వాహనాలు, కార్యకర్తలు, మంది మార్భలం ఇలా అన్నిటికీ డబ్బే ప్రధానం. అయితే వీటన్నిటికి మించిన ధైర్యం అమెకు స్వంతమైంది. సమాజంలోని నిరుద్యోగ యువకులే అమెకు అండదండగా నిలుస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, లెక్చరర్లు, ప్రోఫెసర్లు, మేధావి వర్గం అంతా ఆమెకు ఎన్నికల్లో దూసుకు పోవాల్సిందిగా ధైర్యాన్నిస్తున్నారు.
ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో మార్పు కావాలనుకుంటున్న ప్రజలకు ఆమె ఒక సాధనంగా మారింది. ఇది తలలు పండిన రాజకీయ నాయకులకు వణుకు, దడ పుట్టిస్తున్నది. రాజకీయాలంటే తెలియని అతి సామాన్య కుటుంబం నుండి వొచ్చిన ఆమెను పోటీనుండి విరమించుకోమని వత్తిడులు రావడమంటేనే ఆమె పవర్‌ ఏం‌టో అర్థమవుతున్నది. ఒక ప్రముఖ పార్టీ పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామన్నట్లు వార్తలు వొస్తున్నాయి.
దాడులు జరుగుతున్నాయి. అయినా ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు. తనతోపాటు ప్రచారంలో ఉన్న తమ్ముడికి, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, పోలీస్‌ ‌ప్రొటెక్షన్‌ ఇవ్వాలంటున్న బర్రెలక్క తన లక్ష్యం నిరుద్యోగులకు న్యాయం చేయడమేనంటుంది. ఆమెకు ఒక లక్ష్యం ఉంది. తాను గెలిస్తే ఏమి చేయాలనుకుంటుందో పెద్ద రాజకీయ పార్టీల్లాగా మెనీఫెస్టోను ప్రకటించింది కూడా. నిరుద్యోగ సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించడమే కాదు. నోటిఫికేషన్‌లు సక్రమంగా వొచ్చే విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తానంటారామె. ఉద్యోగాలు లభించేవరకు నిరుద్యోగులకు ఆర్టికల్‌ 41 ‌ప్రకారం నిరుద్యోగ భృతి అందుకునేలా కృషితో పాటు నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సుల్లో ఉచిత శిక్షణ, పేదలందరికీ ఇండ్ల నిర్మాణం, ప్రతీ గ్రామంలో రోడ్ల నిర్మాణం, ఉచిత విద్య,  వైద్యం అందేలా కృషిచేస్తానంటున్న బర్రెలక్కకు అర్థిక సహాయం అందించేందుకు అసంఖ్యాకులు ముందుకు వొస్తున్నారు. ఎవరికి ఎంత తోస్తే అంత ఆమెకు అందజేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా ఆమెను ప్రోత్సహించేందుకు అర్థిక సహకారం అందించేందుకు సిద్ధపడుతున్నారు. సోషల్‌ ‌మీడియాలో ఆమెకు మద్దతుగా అనేక పాటలు, నినాదాలు కొనసాగుతున్నాయి. ‘‘కదిలే ఒక అడుగు.. యువకులకు నువ్వు వెలుగు.. కదిలింది బర్రెలక్క ..అదిగో లేవరా యువక అంటూ…అలాగే బానిసలాంటి బతుకు వదులుకో..కదలిరా యువత.. పేద బిడ్డ మన బర్రెలక్కకు వోటేద్దాం రా, దొరల పాలన దోపిడి రాజ్యంకు వ్యతిరేకంగా ఇలా మీడియాల్లో ప్రచారం లభిస్తున్నది. కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు, బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డికి బర్రెలక్క ఎవరి వోట్లను చీలుస్తుందోనని తెగ భయపడిపోతున్నారు. ప్రస్తుత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డి తాను పాలు అమ్ముకుని ఇంతటి వాడినయ్యానని చెపుతుంటాడు. అలాగే సూర్యాపేట నుండి నాలుగు సార్లు ఎంఎల్‌గా గెలిచిన కఠిన నిరుపేద ఉప్పల మల్సూర్‌లా ప్రజాబలంతో గెలిచి బర్రెలక్క అలియాస్‌ ‌కర్నె శిరీష ఈల(విజిల్‌ ‌గుర్తు) వేస్తుందా చూడాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *