Take a fresh look at your lifestyle.

గణతంత్ర విలువలను పాటిస్తున్నామా.. !

రాజ్యాంగాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు  హైజాక్‌ ‌చేస్తోందని ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ ‌రిజిజు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగానూ..ఆందోళన కలిగించేవిగానూ ఉన్నాయి. నిజానికి రాజ్యాంగాన్ని హైజాక్‌ ‌చేసి తమ ఇష్టాను సారంగా పాలన సాగిస్తున్న నేతలు ఇలా మాట్లాడడం సరికాదు. ప్రభుత్వాలు విఫలం అయినప్పుడు.. తప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు..ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో మన ప్రజాస్వామ్యం మనగలుగుతోంది. సుప్రీమ్‌ అప్పు‌డప్పడు కొరడా ఝళిపిస్తేనే పాలన ఇలా ఉంటే..ఇక ఎవరూ పట్టించు కోరనుకుంటే..ఎలా ఉంటుందు ఊహించుకోలేం. స్వాతంత్య్ర సముపార్జన తరవాత మనం అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించుకున్నాం. రాజ్యంగం అమల్లోకి వచ్చి 73 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన రాజ్యాంగాన్ని గుర్తించి..నాటినుంచి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే గణతంత్ర విలువలను మనం పాటిస్తున్నామా అన్న చర్చ ఎప్పుడూ జరగడం లేదు.

నిత్యం అంబేడ్కర్‌ ‌పేరును తలచుకోవడం.. ఆయనకు పెద్దపెద్ద విగ్రహాలు పెట్టడం తప్ప ఆయన ప్రవచించిన ఆశయాలను అమలు చేయడంలో నేతలంతా విఫలం అవుతున్నారు. పాలకులే రాజ్యాంగాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అధికారమే తప్ప ప్రజలు, ప్రజాసేవ అభివృద్థి కనబడడం లేదు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నర్‌ ‌వ్యవస్థ ఇలా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బదులు స్వార్థ రాజకీయాల ఊబిలో పడిపోయాయి. వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. పాలకులు తీరు వ్యవస్థలను నానాటికి దిగజారుస్తున్నాయి. అలాగే దేశంలో ప్రజాస్వామ్యం అని గొప్పులు చెప్పుకుంటూ గణతంత్రాలు జరుపుకుంటున్న వేళ మనలను మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి.స్వీయ లిఖిత ప్రజామోదిత  రాజ్యంగాన్ని అమలు చేసుకుంటున్న వేళ ధనరాజకీయాలు ఎంతవరకు సమంజసమో అన్నది  పాలకులుగా రాజకీయ పార్టీల నేతలు మననం చేసుకోవాలి. అందరికీ సమన్యాయం అందుతుందా అన్నది చూడాలి.

రాజకీయ దృక్కోణంలో కాకుండా అభివృద్ది కోణంలో పాలన సాగాలి. ఐదేళ్లు అధికారంలోకి రాగానే మరో ఐదేళ్లు గద్దెపై ఉండడమెలా అన్న ఆలోచన చేయడం వల్లనే భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత కూడా ఇంకా దారిద్య్ర, నిరక్షరాస్యత, వసతుల కొరత, ఆహారధాన్యాల కొరతతో అలమటిస్తోంది. ఇదంతా పాలకుల దృష్టి లోపంగా చూడాలి. ఈ 75 ఏళ్ల వైఫల్యాలపై పాలకులు ఆత్మపరిశీలన చేసుకునే సమయ మిదే. రాజకీయాలను పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచన చేసి ముందుకు సాగాల్సిన సమయమిది. గణతంత్ర వేడుకల వేళ మనమంతా ప్రతిన తీసుకుని ముందుకు సాగాలి. అధికారం కోసం అడ్డమైన గడ్డి తినమనే ఆలోచనతో సాగాలి.
గతంలో ఎన్నడూలేని విధంగా ఇటీవలి కాలంలో ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా కొనసాగు తోంది. వోటుకు  రూ.5వేల నుంచి పదివేల వరకు చెల్లించడం చూస్తుంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు..ఎలా రాబడతార్న ఆలోచన ప్రజలు చేయాలి. గణతంత్ర దినోత్సవం జరుపు కోబోతున్న తరుణంలో మనం మన ఎన్నికల విధానాన్ని సక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ధన ప్రభావం ఉన్నంత కాలం ప్రజలకు మేలు జరుగదు.

నిజానికి దేశంలో నల్లధనం, అవినీతి పోవాలంటే రాజకీయ పార్టీల నుంచే ప్రక్షాళన మొదలవ్వాలి. నల్లధనం రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకుని వోటర్లను కొనుగోలు చేయడానికి వాడుతున్నాయి. ఎన్నికలు అయ్యాక తగిన మెజారిటీ సమకూరని సందర్భాలలో ఎమ్మెల్యేలు లేదా ఎంపీల బేరసారాల కోసం ఈ నల్లధనాన్నే వాడుతున్నారు. వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాలలో అత్యధిక భాగం నల్ల డబ్బు రూపంలోనే ఉంటోంది. వ్యాపారులు, నల్లధనం ఉన్న వారు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను మరింత కలుషితం చేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించకుండా ఎన్ని సంస్కరణలు చేసినా ఫలితం ఉండదు. ప్రజలకు అందని నగదు రాజకీయ పార్టీలకు మాత్రం లభిస్తోంది. ఎన్నికల్లో ఆయా పార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వైనం చూస్తున్నాం. అందుకే అంబేడ్కర్‌ ‌మహాశయుడు ఆశించిన రాజ్యాంగం  సరిగా అమలు కావడం లేదు. ఆయన పేరును నిత్యం పఠిస్తూనే…ఆయన ఆశయాలను తుంగలో తొక్కారు.

ఈ దశలో ఇలాగే ముందుకు సాగితే  ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడగలదు. ప్రజలు గణతంత్ర విలువలు తెలుసుకోవాలి. వోటు విలువను తెలుసుకోవాలి. పాలకుల నైజాన్ని గుర్తించాలి. రాజకీయ సంస్కరణలు రావాలి. పాలకుల తీరులో మార్పు రావాలి. ప్రజాధనం వృధా ఖర్చులకు కళ్లెం పడాలి. అప్పుడే ప్రజలకు స్వాతంత్య్ర ఫలం దక్కుతుంది. అప్పుడే భారత్‌ ఉజ్వలంగా వెలుగుతుంది. అంబేడ్కర్‌ ‌కలలు కన్న భారత రాజ్యాంగం వెలుగుతుంది. ఇకపోతే ఎన్నికలు అపహాస్యం అవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. డబ్బుతో వోట్లను కొనుగోలు చేయడం అన్నది చిటికెలో పని అన్న చందంగా మారింది. ప్రజలు కూడా వోటును అమ్ముకోవడం కోసం పోటీ పడుతున్నారు. గ్రామ పంచాయితీ మొదలు అసెంబ్లీ,పార్లమెంట్‌ ఎన్నికల విన్యాసం చూస్తుంటే ప్రజాప్రతినిధులు ఎన్నికలను పక్కా వ్యాపారంగా మార్చేశారు. డబ్బులు పెట్టి వోట్లు కొనుగోలు చేసి, ప్రజలపై సవారీ చేసేలా తయారవుతున్నారు. గెలుపు లక్ష్యంగా విచ్చలవిడిగా డబ్బు, మద్యం ఖర్చు పెడుతున్న తీరు మన ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేసేదిగా తయారయ్యింది. ప్రజలు కూడా డబ్బులు తీసుకుని వోట్లు వేసినంత కాలం పాలకులకు లొంగి ఉండాల్సిందే అన్న నిజాన్ని గుర్తించడం లేదు. అధికారంలోకి  వచ్చింది మొదలు తమ స్వలాభం కోసం తప్ప ప్రజల కోసం పనిచే యడం లేదు. వోటు బ్యాంక్‌ ‌రాజకీయాలను అనుసరిస్తూ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. గణతంత్ర దేశంగా మువ్వన్నెల జెండా ఎగరేస్తున్న వేళ ప్రజలు మరింత చైతన్యం కావాల్సి ఉంది.
-ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply