రాష్ట్రంలో గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఈ మత్తు పదార్థాలు, ప్రస్తుతం గ్రామాలకూ పాకాయి. యువత నుంచి ఇప్పుడు పిల్లలనూ ఈ ముఠాలు తమ వినియోగదారులుగా మార్చుకుంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాకు చెందిన బాలబాలికలే టార్గెట్‌గా సాగుతున్న డ్రగ్స్, గంజాయి ముఠా అరాచకాలు యాధృచ్చికంగా వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10 మంది బాల బాలికలను ట్రాప్ చేసి, వారికి గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు అలవాటు చేసి, ఆ తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లి రేవ్ పార్టీల్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో ఓ బాలిక తల్లిదండ్రులు 20 రోజుల క్రితం తమ కుమార్తె పరిస్థితిని గమనించి, కరీంనగర్‌లోని స్వధార్ స్వచ్ఛంధ సంస్థలో చేర్పించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల తెలుగు వార్తా దినా పత్రికలలో సంచలనం రేపుతోంది. రోజుల తరబడి మత్తులో ముంచెత్తే ఈ మహమ్మారి యువతను లక్ష్యంగా చేసుకుంటుంది. పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలామంది ఈ అలవాటుకు బానిసవుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే చేయిదాటే ప్రమాదం ఉంది.
ఇలా బానసలు అవుతారు..
కొందరు విద్యార్థులు, యువకులు ఈ మత్తుకు అలవాటుపడతారు. వారు అక్కడితో ఆగకుండా పక్కవారిని చెడగొట్టేందుకు ఆ మత్తులో ఉండే ఆనందాన్ని రెట్టింపు చేసి చెబుతారు. అదేదో కొత్తగా, ఆనందంగా ఉంటుందనే నెపంతో గంజాయి అలవాటుకు బానిసవుతున్నారు యువకులు. మద్యంతో వచ్చే మత్తుకంటే రెండిరతలు ఎక్కువగా ఉంటుందని, అదో కొత్త కిక్కు అంటూ కొత్తవారిని అటువైపు తీసుకెళ్తుంటారు బానిసలు. గంజాయి సేవిస్తే అదనపు మత్తు ఉంటుందనే భావన యువకుల్లో ఉంది. అదే భావనతో వారు బానిసలయ్యే ప్రమాదం ఉంది.
ఇవి గుర్తించాలి..
గంజాయికి అలవాటుపడిన విద్యార్థులు, యువకులు మిగతావారితో పోలిస్తే కాస్త ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు, ప్రేమ ఇతర విషయాల్లో కలత చెందినప్పుడు యువకులు దీనివైపు మొగ్గుచూపుతారు. అలాంటివారి ప్రవర్తన ఇంట్లోనూ వేరే విధంగా ఉంటుంది. ఒంటరిగా ఉండడం, తాను ఉండే గదికి లోపలి నుంచి గొలుసుపెట్టుకుని గంటల తరబడి ఉండడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం, నేరుగా కళ్లలోకి చూడకుండా పక్కలకు చూస్తూ మాట్లాడడంలాంటివి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఇవీ లక్షణాలు…
గంజాయి తాగేవారి కళ్లు మిగతావారికి భిన్నంగా, కాస్త ఎరుపు రంగులో ఉంటాయి. వీరు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మాట్లాడేటప్పుడు కాస్త తడపడుతూ ఉంటారు. శుభ్రతపై మక్కువపోయి, మాసిన దుస్తులతో తిరుగుతుంటారు. కనీసం గడ్డం కూడా చేయించుకోరు.. ఎందుకని అడిగితే అదే ఫ్యాషన్ అంటూ సాకులు చెబుతుంటారు. గతంతో పోలిస్తే పాకెట్ మనీ ఎక్కువ కావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తడి చేస్తుంటారు.
మాదకద్రవ్యాల మత్తులో
యువత మునిగి తేలుతోంది…
సమాజంలో చెడు వ్యసనాలను ప్రోత్సహించేవారు ఎక్కువవుతున్నారు. సాఫ్ట్ డ్రిరక్తో ప్రారంభమైన మత్తు పానీయాలు గంజాయి, డ్రగ్స్ వరకు ఎగబాకుతున్నాయి. మద్యం సేవించడం అలవాటు లేనివారిని చిన్నచూపు చూసే విధంగా సమాజంలో చెడు అలవాట్లు పెచ్చుమీరిపోతున్నాయి. దుర్వ్యసనాల బారిన పడుతూ యుక్త వయసులోనే అనారోగ్యానికి గురౌతున్నారు. శరీర అంతర్భాగం తూట్లు తూట్లుగా మారిపోవడంతో జీవచ్ఛవాల్లా కనిపిస్తున్నారు.
తల్లిదండ్రుల బాధ్యత ముఖ్యమైనది
పిల్లల నడవడిక, వారి అలవాట్లు, స్నేహాలు, చదువు మొదలైన వాటిని దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే మొదట కళాశాల, తర్వాత ఇంట్లో యువత ఎక్కువ గడిపేది. ప్రస్తుతం ఒకే ఇంట్లో భార్యా, భర్తలు ఇద్దరూ జాబ్‌లు చేస్తున్నారు. దీంతో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతోంది. అందువల్ల పిల్లలపై పర్యవేక్షణ కరువవుతోంది. ఒక్కోసారి ఒంటరిగా ఫీలై స్నేహాలు చేస్తున్నారు. అవి మంచి స్నేహాలైతే పర్వాలేదు. కానీ, చెడు సావాసాలైతే ప్రమాదమే. అందుకే తల్లిదండ్రులే పిల్లలను కాపాడుకోవాలి.
ఇవీ పాటించండి…
మాదక ద్రవ్యాలు కిక్ నిస్తున్నాయి కాబట్టి వాటిని సేవిస్తున్నారు. ఆ కిక్ కోసమే ఆరోగ్యం పాడుచేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారని కొందరు వాదిస్తారు. కానీ వాస్తవానికి వాటి కంటే కిక్ నిచ్చే విషయాలు ప్రపంచంలోఎన్నో ఉన్నాయి. ఒక గంటసేపు కదలకుండా ఒకచోట కూర్చుని , ఒక విషయంపై శ్ష్ద్ధ పెట్టి తదేకంగా ధ్యానం చేస్తే వచ్చే కిక్ ఎన్ని మాదక ద్రవ్యాలు తీసుకున్నా రాదు. అలాగే ఒక మంచి పని చేసినప్పుడు, సాటి మనిషికి ఉపకారం చేసినప్పుడు, ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్లకు కడుపునిండా అన్నం పెట్టినప్పుడు వచ్చే కిక్ ఎంతో బాగుంటుంది. చదివుతో ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడూ ఆ కిక్ వేరుగా ఉంటుంది. ఇటువంటి విషయాలను ప్రతీ విద్యార్ధికి అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు చిన్నతనం నుంచి చెప్పగలగాలి.
-డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి,
స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్, సైకాలజిస్ట్
ఫ్యామిలీ కౌన్సెలర్
సెల్: 9703935321




