కెసిఆర్‌ను గద్దె దించే సమయం ఆసన్నమైంది

పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది
ప్రజా స్వయంపాలన పేరుతో కుటుంబ పాలన చేస్తున్నాడు
కేంద్ర ప్రభుత్వ పథకాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు
ప్రజా సంగ్రామ యాత్రకు రావడం అదృష్టం
తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే
ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బిజెపి చీఫ్‌ ‌జేపీ నడ్డా

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 27 : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని, రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ‌ప్రకాష్‌ ‌నడ్డా అన్నారు. శనివారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌చేపట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హనుమకొండలో జరిగిన ఈ భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ..సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా వరంగల్‌ ‌జిల్లాకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మూడో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రకు టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించిందని, ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించి విజయవంతంగా ముగించామని అన్నారు. కోర్టు అనుమతితో కెసిఆర్‌ ‌నివ్వెరపోయారని, అర్థరాత్రి 12 గంటలకు ముగింపు సభకు అనుమతి లభించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగడం లేదని, కెసిఆర్‌ ‌కుటుంబ పాలన కొనసాగుతున్నదని ఆరోపించారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దుష్ట శక్తని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ను మించి కెసిఆర్‌ ‌పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. కేంద్రంలో నీతివంతమైన పాలన కొనసాగుతుంటే కెసిఆర్‌ ‌పాలన కుట్రపూరితంగా మారిందన్నారు.

దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుంటే కేసీఆర్‌ అట్టి నిధులను దారి మళ్ళించి తన ఖాతాలో వేసుకుంటూ కాలం గడుపుతున్నాడని విమర్శించారు. కేసీఆర్‌ ‌పాలనలో అభివృద్ధి కానరావడం లేదని, తన కుటుంబం మాత్రం అభివృద్ధి వైపు పురోగమిస్తున్నదని తెలిపారు. కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులు పక్కదారి మల్లుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆ బడ్జెట్‌ను అమలు చేస్తూ కమిషన్లు పొందుతున్నాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌కెసిఆర్‌కు ఏటీఎం లాగా తయారైందని ఆరోపించారు. ప్రధాని ఆవాస్‌ ‌యోజన, గ్రామీణ ఆవాస్‌ ‌యోజన తదితర పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పడానికి కేసీఆర్‌ ‌జంకుతున్నాడని విమర్శించారు. మహిళలు, యువకులు, పేదల కోసం నరేంద్ర మోడీ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని తెలిపారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఇంకా కొనసాగడం నీతిమాలిన చర్య అవుతుందని, ఆయనను గద్దె దింపే సమయం ఆసన్నమైందని మరోసారి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎంఐఎంకు భయపడి పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఎంతో కాలం నిలవదన్నారు. ఘన చరిత్ర కలిగిన వరంగల్‌ ‌సెంట్రల్‌ ‌జైలు కూల్చి సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ని నిర్మిస్తానని ప్రకటించిన కేసీఆర్‌ ‌జైలును కూల్చాడు తప్ప హాస్పిటల్‌ ‌మాట ఎత్తడం లేదని ఎద్దేవా చేశాడు. ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బిజెపి పోరాటాన్ని ఆపదని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని ఆంక్షలు, ఎన్ని అవరోధాలు సృష్టించినా ముగింపు సభను విజయవంతంగా జరుపుకోవడం బిజెపి సాధించిన సక్సెస్‌ అని జెపి నడ్డా తెలిపారు. అయితే కేసీఆర్‌ను దించే శక్తి ప్రజల చేతుల్లో ఉందని, ప్రజలు మంచిగా ఆలోచించి కెసిఆర్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వాహకుడు మనోహర్‌ ‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ కమిటీ బోర్డ్ ‌మెంబర్‌ ‌డాక్టర్‌ ‌లక్ష్మణ్‌, ఎం‌పీలు అరవింద్‌, ‌సోయం బాబురావు, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు రఘునందన్‌ ‌రావు, ఈటల రాజేందర్‌, ‌రేవూరి ప్రకాష్‌రెడ్డి, జాతీయ నాయకులు, విజయశాంతి, డీకే అరుణ, ప్రేమేందర్‌ ‌రెడ్డి, జితేందర్‌ ‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *