సిమ్లాలో మరోమారు భేటీ కావాలని విపక్షాల నిర్ణయం
పరస్పరం విమర్శలు చేసుకున్న నేతలు
పాట్నా, జూన్ 23 : 2024 సార్వత్రిక సమరంలో పాలక బీజేపీని మట్టికరిపించే లక్ష్యంతో బిహార్ సీఎం నితీష్ కుమార్ నివాసంలో జరిగిన విపక్షాల భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో త్వరలో సిమ్లాలో మరోసారి భేటీ కావాలని విపక్ష నేతలు నిర్ణయించారు. బీజేపీని ధీటుగా నిలువరించేందుకు విపక్ష నేతలు కలిసికట్టుగా పనిచేయాలని ఈ భేటీలో ఏకాభిప్రాయం వ్యక్తమైనా అందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు ఓ అంగీకారానికి రాలేక పోయారు. సమావేశంలో విపక్షాల్లో కొన్ని పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం దుమారం రేపింది. బిహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బెంగాల్‌లో కాంగ్రెస్ తీరును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టగా, టీఎంసీని దొంగల పార్టీగా కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి అభివర్ణించారు. మనలో మనం విభేదాలతో వీధికెక్కితే అంతిమంగా బీజేపీకి లబ్ది చేకూరుతుందని మమతా బెనర్జీ పేర్కొన్నట్టు సమాచారం.
దిల్లీ ఆర్డినెన్స్ విషయంలో పార్టీలన్నీ తమకు మద్దతు ఇవ్వాలని దిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ కోరగా, ఆర్టికల్ 370పై కేజీవ్రాల్ వైఖరిని ఒమర్ అబ్ధుల్లా తప్పుపట్టారు. కాగా, కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించాలని ఈ సమావేశంలో పలు పార్టీలు అభిప్రాయపడ్డాయని తెలిసింది. విపక్ష కూటమికి ఓ సమన్వయకర్తను నియమించాలనే అంశంపైనా ఈ భేటీలో చర్చ జరిగిందని సమాచారం. ఇక బిహార్ సీఎం నితీష్‌కుమార్‌పై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. నితీష్ దేశ ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తాను నిజాలు మాట్లాడతాననే తనను విపక్షాల సమావేశానికి పిలవలేదని అన్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన నేతలు (యూబీటీ) ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ సహా పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు.




