డ్రాగన్ కంట్రీ చైనా కంత్రీ ప్లాన్ చేస్తోంది. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి పూనుకుంటుంది. ఇది విజయవంతం అయితే అగ్రరాజ్యం అమెరికాపై పైచేయి సాధించినట్టు అవుతుందని చైనా అనుకున్నది. అయితే, నాసిరకం వస్తువులకు కేరాఫ్ అడ్రస్ అయిన డ్రాగన్ కంట్రీ ఈ మిషన్‌లో సక్సెస్ అవుతుందా… అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తిటియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణంలో ఏమాత్రం తేడా వచ్చినా ఊహించని ఉపద్రవం తప్పదనీ ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్న డ్రాగన్ కంట్రీ దానికోసం ఏం చేయడానికైనా రెడీ అంటోంది. రీసెంట్‌గా అంతరిక్ష ఆక్రమణకు రంగం సిద్ధం చేసుకుంది. మరికొన్ని సంవత్సరాల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పక్కనపెట్టే అవకాశం ఉండడంతో ఆ స్థానాన్ని ఆక్రమించడం కోసం తియాగాంగ్ స్పేస్ స్టేషన్ ను రెడీ చేస్తోంది. 2045 నాటికి ఖగోళ శక్తుల్లో ఒక్కటిగా నిలవాలనీ ఉవ్విళ్లూరుతోంది.
అంతరిక్ష పరిశోధనల్లో చైనా ఫెయిల్యూర్ స్టోరీలు చాలానే ఉన్నాయి. 1970లో అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపిన చైనా… అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ తర్వాత అంరిక్షంలోకి అడుగుపెట్టిన దేశంగా నిలిచింది. ఇక గత 10ఏళ్లలో బీజింగ్ నుండి 200 రాకెట్లును ప్రయోగించింది. ఇప్పటికే మానవ రహిత వాహనాన్ని చంద్రుడిపైకి పంపడంలోనూ విజయం సాధించింది. తియాంగాంగ్ మిషన్‌లో భాగంగా తాజాగా పంపిన షెన్‌ఝూ-14తో కలిపితే మొత్తం 14 మంది వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. అంతరిక్షంలో చైనా చేపట్టిన స్పేస్ సెంటర్ పేరు టియాంగాంగ్. దీనికి సంబంధించిన తొలి మాడ్యూల్‌ను 2021 ఏప్రిల్‌లో అంతరిక్షంలోకి చేర్చింది. దీనికి మరిన్ని మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు.. అక్కడ సైన్స్ ల్యాబ్‌లను కూడా నిర్మించనుంది. వచ్చే ఏడాది స్పేస్ టెలిస్కోప్ ఝంటియాన్‌ను కూడా అంతరిక్షంలోకి చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇక తియాంగాంగ్‌లో సొంతంగా విద్యుత్తు, ప్రొపెల్షన్, లైఫ్ సపోర్టింగ్ వ్యవస్థలతో పాటు వ్యోమగాములు నివసించేందుకు క్వార్టర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
2030 నాటికి చంద్రుడిపైకి చైనా వ్యోమగాములు అడుగుపెట్టేలా ఏర్పాట్లు చేసుకొంటోంది. 2022లో తియాంగాంగ్ నిర్మాణం పూర్తిచేయడం, 2025 నాటికి గ్రహశకలాల నమూనాల సేకరణ, 2030 నాటికి మార్స్‌పై నుంచి నమూనాలను భూమికి చేర్చడం, గురు గ్రహంపైకి మానవరహిత వాహనం పంపడం, చంద్రుడి పైకి చైనా వ్యోమగాములు పంపడం, 2035 నాటికి పునర్వినియోగ రాకెట్ల తయారీ, 2040 నాటికి అణుశక్తితో పనిచేసే స్పేస్ షటిల్ తయారీ, 2045 నాటికి కీలక అంతరిక్ష శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ షినూవా పేర్కొంది. మరోపక్క ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కూడా చంద్రుడిపైకి యాత్రలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికా కూడా మరోసారి చంద్రుడిపై యాత్రకు సిద్ధమవుతుండగా భారత్, జపాన్, దక్షీణ కొరియా, రష్యా, యూఏఈ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్ 2030 నాటికి స్పేస్ స్టేషన్ నిర్మించాలని భావిస్తోంది.
ఇదంతా ఒకెత్తయితే చైనా అంతరిక్ష ప్రయోగాల్లో భద్రతను లైట్ తీసుకుంటుందనే విమర్శలు ఎక్కువే. చాలా సందర్భాల్లో డ్రాగన్ ప్రయోగాలు విఫలమై రాకెట్లు, వాటి శకలాలు జనావాసాలపై పడి బీభత్సం సృష్టించిన సందర్భాలూ ఎన్నో గతేడాది అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం ప్రయోగించిన లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్ పని చూర్తయ్యాక దాని శకలాలు నియంత్రణ కోల్పోయి భూవాతావరణంలోకి దూసుకొచ్చి మాల్దీవుల సమీపంలో కుప్పకూలాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా చైనాకు చెందిన గుర్తుతెలియని రాకెట్ శిథిలాలు మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో పడినట్టు వార్తలొచ్చాయి. గతంలో సైతం లాంగ్‌మార్చ్ బీ శ్రేణి రాకెట్‌తో చైనా ప్రయోగించినప్పుడు దాని శకలాలు ఐవరీ కోస్ట్‌లోని జనావాసాలపై పడి బీభత్సం సృష్టించాయి. ఇటు చైనాలోని జిచాంగ్ వేదికపై భారీగా రాకెట్ ప్రయోగాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో చుట్టుపక్కల గ్రామాలను హెచ్చరించి ఖాళీ చేయించడం సర్వ సాధారణమైపోయింది. అమెరికా, ఇతర దేశాల రాకెట్ బూస్టర్లు సాధారణంగా సముద్రంలో కూలతాయి. కానీ, చైనా రాకెట్ బూస్టర్లు భూభాగాలపై పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇవన్నీ బయట ప్రపంచానికి తెలిసినవి మాత్రమే. కానీ చైనా చాలా ప్రయోగాల్లో పూర్తిగా విఫలమైందన్నది అమెరికా ఏజెన్సీలు చెబుతున్న మాట. సరిగ్గా ఇలాంటి అంచనాలతోనే డ్రాగన్ కంట్రీ స్పేస్ స్టేషన్ నిర్మాణం ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. చైనా 2045లోగా అనుకున్నది సాధిస్తే.. ఆ తర్వాత డ్రాగన్ తీరు ఎలాంటి ఉపద్రవాలను మోసుకొస్తుందో అన్న భయాలే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో డ్రాగన్ కంట్రీ అంతరిక్ష ప్రయోగాలపై ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు ఓ కన్నేసి ఉంచారు. ఎంతయినా కంట్రీ కంట్రీ కదా..మన దేశమూ అప్రమత్తంగా ఉండాల్సిందే.
వంగ మహేందర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
9963155523




