ఉస్మానియాలో మృతి చెందిన వారికి కోవిడ్‌

  • ఇద్దరు జూనియర్‌ డాక్టర్లకూ పాజిటివ్‌…
  • పరీక్షల్లో గుర్తించిన వైద్యులు
  • చనిపోయిన వ్యక్తికి అనేక రోగాలున్నాయి : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కొరోనా వైరస్‌ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. దేశంతోపాటు రాష్ట్రంలోనూ  మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతుంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో మంగళవారం ఉదయానికి గడిచిన గత 24 గంటల్లో 412 మంది కోవిడ్‌ బారిన పడగా.. ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 4,170 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కొరోనా మరణం సంభవించింది. ఉస్మానియా హాస్పిటల్‌లో కోవిడ్‌తో ఇద్దరు రోగులు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు జూనియర్‌ డాక్టర్‌లకు సైతం పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సంబంధిత వ్యాధిలతో ఇద్దరు వ్యక్తులు హాస్పిటల్‌లో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరు రోగులు మరణించారు.. మృతులకు కొరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వైద్యులు నిర్దారించారు. మృతులను 60 ఏళ్ల వ్యక్తితోపాటు 40 ఏళ్ల వ్యక్తిగా తెలిపారు.
ఈ రకంగా ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతుండడంతో రాష్ట్రంలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 55 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే అత్యధికంగా 45 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఎర్రగడ్డ చెస్ట్‌ హాస్పిటల్‌లో 54 పాజిటివ్‌ చేసులు నమోదయ్యాయి.  ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారులు కోవిడ్‌ టెస్ట్‌లను పెంచారు. అయితే రాష్ట్రంలో కొరోనా మరణంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ  స్పందిస్తూ…రాష్ట్రంలో కొరోనాతో ఎవరూ మరణించలేదని, తొలి కోవిడ్‌ మరణం అంటూ వొస్తున్న వార్తలు అవాస్తవమని, ఉస్మానియాలో చనిపోయిన వ్యక్తికి అనేక రోగాలున్నాయని, మరణించిన అనంతరం కోవిడ్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌ వొచ్చిందని తెలిపారు. ఆయన రాష్ట్రంలో కొరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *