
ప్రతీ వారాంతంలో వొచ్చే ఆదివారాల కన్నా నేటి ఆదివారానికి ప్రత్యేకత ఉంది. నిరంకుశ నవాబు పాలననుండి తెలంగాణ ప్రాంతం విముక్తి లభించిన రోజుకూడా ఈ ఆదివారమే వొచ్చింది. పరపీడన నుండి స్వేచ్ఛ లభించిన ఈ రోజున యావత్ తెలంగాణ ప్రజలు వాస్తవంగా సంబరాలు జరుపుకోవాల్సిన దినం. కాని, గడచిన ఏడున్నర దశాబ్ధాలుగా అలాంటిదేమీ ఇక్కడ జరుగలేదు. ఆనాటి పోరాటంలో పాలుపంచుకున్న కొందరు మాత్రం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అక్కడక్కడ గత పదిజిల్లాల తెలంగాణ పటాన్ని ఎగురవేయడం ద్వారా ఉత్సవాన్ని జరిపామన్న సంతృప్తిపడేవారు. ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ కోసం నిరంతరం శ్రమించిన భూపతి కృష్ణమూర్తి ఈ విషయంలో గుర్తుకు వొస్తాడు. నిజామ్ నుండి ఈ ప్రాంతానికి విముక్తి లభించిన సెప్టెంబర్ 17న జిల్లా కేంద్రంలో పదిజిల్లాల పటంతో కూడుకున్న తెల్లటి పతాకాన్ని ఆయన జీవితాంతం వరకు ప్రతీఏట తప్పకుండా ఎగుర వేసేవాడు. ప్రత్యేక తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడాన్ని చూడకుండానే స్వర్గస్తులయ్యారు. సెప్టెంబర్ 17 పైన చాలా కాలంగా చర్చోపచర్చలు జరుగడమన్నది ఇక్కడ ఆనవాయితీగా మారింది. తెలంగాణ ప్రజలు నిజామ్ సర్కార్‌తో వీరోచిత పోరాటం చేసి, ఈ ప్రాంత విముక్తి పొందిన రోజును మరో స్వాతంత్య్ర పోరాటంగా గుర్తించి ఉత్సవాన్ని జరుపాలంటూ సీమాంధ్ర పాలనలో నిలదీసిన తెలంగాణప్రాంత నాయకులు, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకున్న తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయారు.
ఈ విషయంలో గత దశాబ్ధ కాలంగా అధికారపార్టీకీ విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంటూనే ఉంది. దేశానికి స్వాతంత్య్రం వొచ్చిన పదమూడు నెలల తర్వాత గాని తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చలేదు. ఈ పదమూడు నెలల కాలంలో నిజామ్ ప్రైవేటు సైన్యం రజాకార్ల వల్ల ఎంతటి హింసకు గురైనారన్నది చరిత్రనే సాక్ష్యంగా నిలుస్తుంది. ఆ ఆకాలంలో ప్రతీ ఊరు, ప్రతీ ఇల్లు ఒక విధంగా యుద్ద వాతావరణాన్ని తలపించింది. ప్రజల తిరుగబాటు, స్యేచ్ఛా భారత యూనియన్ సైన్యం చర్యల నేపథ్యంలో నిజాం తలవంచక తప్పలేదు. ఆసిఫ్‌జా పాలన అంతమైన సెప్టెంబర్ 17వ తేదీని ఘనంగా నిర్వహించుకునే విషయంలో రాజకీయ పార్టీల మధ్య బేదాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. కొందరు దాన్ని విమోచన దినమని, మరికొందరు విముక్తి దినమని, ఇంకొందరు విలీన దినమంటూ ఎవరికి తోచిన పేరుతో వారు ఈ ప్రత్యేక దినానికి పేరు పెట్టి తమ పరిధిలోనే వేడుక జరుపుకోవడం జరుగుతూ వొస్తున్నది. స్వాతంత్య్ర దినోత్సవంలాగా ఈ రోజున ప్రభుత్వపరంగా ఎందుకు నిర్వహించరని సీమాంధ్రపాలకులను నిలదీసిన, తెలంగాణ వాదులు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారికంగా వేడుక జరుపకపోవడంపట్ల విపక్షాలు గత దశాబ్ధకాలంగా విమర్శిస్తూనే ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం ఆవిర్భావం పైన ఎవరికి ఎంత ఆసక్తి ఉందోగాని రాజకీయ పార్టీలు మాత్రం తెలంగాణ ప్రాంత విముక్తిపట్ల ఎక్కడలేని ప్రేమను కనబరుస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ కోసం ఈ పార్టీలు ఏమేరకు పాటుపడ్డాయన్నది జగమెరిగిన సత్యం. కేంద్రంలో భారతీయ జనతాపార్టీకి కూడా రెండవసారి అధికారంలోకి వొచ్చిన మూడేళ్ళకుగాని ఈ విషయం జ్ఞాపకం రాలేదు. తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాలన్న ఆకాంక్షే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమన్న వాదన లేకపోలేదు.
గత సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా కేంద్రం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధానిలో భారీ బహిరంగ సభను నిర్వహించ బోతోంది. ఈ సభకు ముఖ్య అతిధిగా కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా విచ్చేస్తుండడం మరింత ప్రాధాన్యతను కలిగించే అంశం. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో అధికార పార్టీతో సహా ఇతర పార్టీలకు కూడా చురుకుపుట్టింది. దీంతో తెలంగాణ ఏర్పడినప్పటి నుండీ ఈ విషయంపైన పెదవి విప్పని అధికార బిఆర్‌ఎస్ కూడా ఈసారి కొత్త నినాదంతో ఈ రోజు కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ పార్టీగా మారిన బిఆర్‌ఎస్ సమైక్యతా దినంగా దీనికి నామకరణం చేసింది. జాతీయపార్టీగా ఎదగాలనుకుంటున్న పార్టీగా జాతీయ సమైక్యతా నినాదాన్ని ఎంచుకుంది. ఉమ్మడి ఏపీలో ఎక్కువ కాలం పాలన చేసిన కాంగ్రెస్ ఏనాడు సెప్టెంబర్ 17 మీద దృష్టి సారించిందిలేదు. తెలంగాణవాదులు ఈ విషయంలో తగాదా పడినప్పటికీ ఆ ప్రత్యేక దినాన్ని గుర్తించడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టపడలేదు. కాని, ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ సెప్టెంబర్ 17న భారీస్థాయిలో బహిరంగ సమావేశాన్ని నిర్వహించబోతున్నది. సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటుగా ఆ పార్టీకి చెందిన అతిరధ మహారథులంతా ఈ సభలో పాలుపంచుకోబోతున్నారు. విజయభేరి పేరున నిర్వహించే ఈ సభ సందర్భంగా భారీ ర్యాలీని కాంగ్రెస్ తలపెట్టింది. విమోచనమో, విలీనమో, విముక్తో ఎటూ తేల్చుకోలేకపోతున్న ఈ పార్టీలన్నిటికీ రానున్న ఎన్నికల శంఖారావానికి ఈ ఆదివారం మాత్రం కలిసి వొచ్చింది.




