కరీంనగర్ ఎంపీ సీట్ పై కాంగ్రెస్ లో వీడని ఉత్కంఠ
గెలుపు లక్ష్యంగా అధిష్టానం కసరత్తు
కరీంనగర్ (జగిత్యాల), ప్రజాతంత్ర, మార్చి 27: కరీంనగర్ ఎంపీ సీటు కు అభ్యర్థుల ఎంపిక పై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ వీడటం లేదు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్, బిజెపిలు తమ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను ఎంపికలో మీమాంస కొనసాగిస్తుండటంపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కరీంనగర్ లోకసభ నియోజకవర్గ స్థానంలో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ.. బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ప్రస్తుతం అదే పార్టీ నుండి మళ్లీ పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ నుండి గతంలో అదే పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన బోయినపల్లి వినోద్ కుమార్ ప్రస్తుతం రంగంలో ఉన్నారు. మీరు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో ప్రస్తుతం దూసుకుపోతుండగా.. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రం ఎవర్ని ఎంపిక చేయకపోవడం పట్ల సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ లోకసభ నియోజకవర్గంలో 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రస్తుత హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గౌడ్ పోటీ చేసి ఓటమి చెందారు. తదనంతరం ఇటీవల 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తన స్థానాన్ని మార్చుకొని హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన దిక్కుగా ఉన్న అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ పెద్దలు నచ్చచెప్పడంతో తన సీటును పొన్నం ప్రభాకర్ కు త్యాగం చేశారు. ప్రవీణ్ రెడ్డి త్యాగానికి బదులుగా వచ్చే ఎన్నికల్లో సముచిత స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇవ్వడంతోనే పొన్నం ప్రభాకర్ కు తన కంచుకోటైన అసెంబ్లీ సెగ్మెంట్ను అప్పగించాల్సిన పరిస్థితి ఆనాడు ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హామీ మేరకు ఆనాడు హుస్నాబాద్ స్థానాన్ని త్యాగం చేసిన ప్రవీణ్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ సీటును ఇస్తామని పేర్కొన్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు. అప్పటి హామీ మేరకే ప్రవీణ్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ స్థానానికి ఎంపిక చేసే అవకాశం ఉంటుందని ప్రవీణ్ రెడ్డి వర్గీయులు దీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ రెడ్డి ఇదివరకు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు ముల్కనూర్ సహకార సంఘం అధ్యక్షుడిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. కాగా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వెల్మ వర్గానికి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎంపీ అభ్యర్థిగా సీటు కేటాయించలేకపోవడంతో కరీంనగర్ స్థానాన్ని తప్పకుండా వెలమ సామాజిక వర్గానికి చెందిన దివంగత వెలిచాల జలపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్రావుకు ఇవ్వనున్నారనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొట్టి పారేయలేక పోతున్నాయి. వెలిచాల రాజేందర్ రావు తండ్రి వెలిచాల జగపతిరావు గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఈ ప్రాంత వాసులకు సుపరిచితులే. దీంతో పాటు ఆయన కొడుకు రాజేంద్ర రావు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా, సింగిల్ విండో ప్రెసిడెంట్ గా పని చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున కరీంనగర్ లోకసభ స్థానానికి పోటీ చేసి ఓటమి చెందారు. అయినా అప్పుడు ఒక 1.75 లక్షల వోట్లు సాధించి, ఆ పార్టీలో అందరికంటే ఎక్కువగా వోట్లు సాధించిన అభ్యర్థిగా ఘనత సాధించారు. ముందుగా జీవన్ రెడ్డిని కరీంనగర్ బరిలో దింపాలని అనుకున్నప్పటికీ ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ విరమించుకుంది. కుల సమీకరణాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే ఇక అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉందన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా. అయితే కరీంనగర్ ఎంపీ సీటు మాకే అంటూ ఇద్దరు నేతలు ఎంతో ధీమాతో ఉన్నారు. వెలిచాల రాజేందర్రావు, అల్గి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. ఓ బిసి నేత కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కరీంనగర్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకే ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని కొంతమంది అనుకుంటూ ఉండగా.. వెలమ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్రావు కి టికెట్ దక్కే ఛాన్సులు ఉన్నాయని మరి కొంతమంది అంచనా. అంతేకాకుండా కరీంనగర్లో ఇప్పటివరకు పార్లమెంటు ఎన్నికల జరిగిన పలుమార్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతలే అక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. అయితే ఇలా కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం ఇద్దరు ఆశావాహులు పోటీ పడుతుండగా అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఒకరికి సీటు కేటాయిస్తే మిగతా ఆశావాహుల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి ఈ వ్యతిరేకత తగ్గాలంటే వారికి కూడా ఏదో ఒక పదవి ఆఫర్ చేయాల్సిందే. ఈ విషయంలో రేవంత్ ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.





