మరోసారి అవకాశం ఇవ్వండి
శ్రీనాడు నేతన్నల బలవన్మరణాలు చూసి ఏడ్పు వొచ్చేది
శ్రీఅందుకే అధికారంలోకి వొచ్చిన వెంటనే
వారిపై ప్రత్యేక దృష్టిపెట్టి కొంతమేర ఉపాధి కల్పించాం
శ్రీధరణిని బంగాళాఖాతంలో పడేస్తామంటున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండండి
సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
సిరిసిల్ల మరింత అభివృద్ధికి మరొక అవకాశం ఇవ్వండి : మంత్రి కేటీఆర్
సిరిసిల్ల, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : కేవలం తొమ్మిది సంవత్సరాల పాలనతో దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. శాసన సభ ఎన్నిక) ప్రచారంలో భాగంగా మంగళవారం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో బిఆర్‌ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…తొమ్మిది సంవత్సరాల పాలనలో మొండి పట్టుదలతో అనేక పథకాలను రూపొందించి, వాటిని విజయవంతంగా అమలు చేశామని, తెలంగాణను సస్య శ్యామలంగా మార్చామని అన్నారు.

తన 70ఏళ్ల జీవితంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వందకు పైగా పర్యటనలు చేశామని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. సమైక్య రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీడుగా మారిందని, నేడు సస్యశ్యామలంగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు నేడు జలధారగా మారి, ఎండాకాలంలో సైతం మత్తడి దూకుతుందని, కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా సస్యశ్యామలంగా మారిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీడు భూములన్ని సస్యశ్యామలంగా మారాయని, ఫలితంగా ప్రతియేటా 3 కోట్ల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి కరువై అనేక మంది చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డ సంఘటనలు చూసి తాను ఎన్నోసార్లు కన్నీటి పర్యంతమయ్యానని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ కాలంలో ఒకనాటి రాత్రి జయశంకర్ సార్‌తో అర్ధరాత్రి సిరిసిల్ల మీదుగా ప్రయాణించినప్పడు గోడల మీద నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడొద్దని రాసి ఉన్న రాతలను కన్నీటి పర్యంతమయిన సంఘటనను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అందుకే అధికారంలోకి రాగానే వారందరిని కాపాడటానికి తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, చేనేత కార్మికులందరికి ఉపాధి కల్పించడానికి వీలుగా బతుకమ్మ చీరలు, ముస్లింలకు దుస్తులు, క్రిస్టియన్లకు దుస్తులను తయారి చేయించి పంపిణి చేయిస్తున్నామని కేసీఆర్ అన్నారు. సిరిసిల్లను షోలాపూర్ మాదిరిగా కెటిఆర్ అబివృద్ధి చేస్తున్నారని, చేనేత కార్మికుల అవసరాలను పూర్తిగా తీరుస్తారని అన్నారు. సిరిసిల్లలో మరమగ్గాల ద్వారా చేనేత కార్మికుల జీవితాలను మెరుగు పరిచామని, వారి సంక్షేమం కోసం కెటిఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని,రైతు, బిసి బంధు, కల్యాణలక్ష్మి, షాదిముబారక్, ఆసరా పెన్షన్లు అందజేస్తున్నామని, వీటిన్నింటిపై కొందరు వ్యక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతుల భూములకు గ్యారంటీ లభించిందని, అదే విధంగా రైతుల సమస్యలు సరళంగా పరిష్కరించబడుతున్నాయని అన్నారు. ఈ ధరణిని తీసివేసి బంగాళాఖాతంలో పడేస్తామని కాంగ్రెస్ పార్టి వారు అంటున్నారని, దీనితో రైతులకు గతంలో మాదిరిగానే ఇబ్బందులు ఏర్పడుతాయని గ్రహించాలని కోరారు. రాష్ట్రంలో ఇస్తున్న 24 గంటల విద్యుత్ సరఫరాను ఆపివేసి మూడు గంటలు ఇస్తామని విపక్షాలు అంటున్నాయని, రైతుల ఈ విషయాన్ని తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా మత ఘర్షణలు అనేకం జరిగేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిని తర్వాత తమ పాలనలో మతకల్లోలాలు మటుమాయమయ్యాయని, ఇటీవల మిలాదున్నబి, గణేశ నిమజ్జనాలు ఒకే రోజున రావడంతో ముస్లిం మత పెద్దలు అలోచించి, మిలాదున్నబిని వాయిదా వేశారని, మతసామరస్యానికి ఇది చక్కటి ఉదాహరణ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రి కెటిఆర్ హయాంలో రాజన్న సిరిసిల్ల శరవేగంగా అభివృద్ధి చెందిందని, అదే స్పూర్తితో జిల్లాను మరింత అభివృద్ది చేయడానికి కెటిఆర్‌ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా ఆయన
కోరారు.





