జూన్ 25, 1975… ఎమర్జెన్సీ విధించిన దినం సందర్భంగా…
ఆంగ్లేయుల పరిపాలన నుండి విముక్తి పొంది స్వాతంత్య్రం సంపాదించుకుని ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాక, 28ఏళ్లకే సదరు స్వాతంత్య్రాన్ని దేశ ప్రజలు కోల్పోవాల్సి వచ్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక పై ప్రత్యర్థి రాజ్ నారాయణ్ చేసిన న్యాయ పోరాటంలో ఇందిర కోర్టు తీర్పు ద్వారా ఎన్నిక చెల్ల నేరదని తీర్పు వచ్చాక, ఏకపక్షంగా రాష్ట్రపతి ద్వారా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిత మయింది. ఎమెర్జెన్సీ సమయంలో నియంత ఇందిరాగాంధీ తన ప్రత్యర్ధులను జైలుపాలు చేయడంతో పాటు ప్రజాస్వామ్య హక్కులను హరించి వేశారు. రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులు హరించి వేయబడ్డాయి. ప్రచార, ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు అమలయ్యాయి. పత్రికలపై ముందస్తు సెన్సార్ షిప్ ప్రవేశపెట్టారు. ఏ వార్త అయినా సంబంధిత ప్రభుత్వ అధికారి ఆమోదిస్తే తప్ప ప్రచురణకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ఎన్నో ఎన్నో పత్రికలకు నిషేధించారు.. వాటిలో కొన్ని జాగృతి (తెలుగు, హైదరాబాద్), సృజన (తెలుగు, హైదరాబాద్), ప్రజాసమస్యలు (తెలుగు, రాజమండ్రి), మెయిన్ స్ట్రీమ్ (ఇంగ్లీష్, ఢిల్లీ), జవానీ దివాని (హిందీ, ఢిల్లీ), ఆర్గనైజర్ (ఇంగ్లీష్, ఢిల్లీ), సెమినార్ (ఇంగ్లీష్, ఢిల్లీ), సాధన (గుజరాతి, అహ్మదాబాద్), భూమిపుత్ర (హిందీ, బరోడా), లోకవాణి (కన్నడ, బెంగళూరు), పాంచజన్య (హిందీ, లక్నో), ఒపీనియన్ (ఇంగ్లీష్, ముంబై) రాష్ట్ర వార్త (మలయాళం, ఎర్నాకులం), విక్రమ్ (కన్నడ, బెంగళూరు), క్వెస్ట్ (ఇంగ్లీష్, ముంబై) వంటి ఎన్నో పత్రికలు నిషేధానికి గురయ్యాయి. శంకర్ వీక్లీ లాంటి ఏకైక కార్టూన్ పత్రిక సెన్సార్ నిబంధనలతో ఏకీభవించ లేక మూసుకోవలసి వచ్చింది.
పత్రికలపై సెన్సార్ షిప్ ఉండడంతో అన్ని భాషలలోనూ అజ్ఞాత పత్రికలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా చిన్న చిన్న పుస్తకాలు ముద్రించి పంపిణీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వందేమాతరం, ఎక్స్ రే, గర్జన, అంతర్వాణి, ప్రజావాణి, జనవాణి పేర్లతో అజ్ఞాత పత్రికలు ప్రచురించారు. తొలిరోజుల్లో వివిధ పేర్లతో అజ్ఞాత పత్రికలు వెలువడి నప్పటికి చివరివరకు వందేమాతరం, ఎక్స్ రే.లాంటి కొన్ని పత్రికలు కొనసాగాయి. ఆర్ ఎస్ ఎస్ తో సహా అనేక సంస్థలను నిషేధించారు. క్రమశిక్షణ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు, నిఘా మొదలైంది. ఇందిరాగాంధీ, ఆమె పాలనకు వ్యతిరేకంగా ఏ చిన్న వ్యాఖ్య చేసినా అరెస్ట్ చేసి జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ పెత్తనం నడిచింది. నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగాయి. రహదారుల విస్తరణ పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేశారు. ఇలా అంతటా నిర్బంధ విధానాలు కొనసాగాయి. అయితే ఈ పరిణామాలతో సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురైనప్పటికీ, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్ ఎస్ ఎస్ వంటి సంస్థలు ఇందిర నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా అజ్ఞాత ఉద్యమాన్ని నిర్వహించాయి. ప్రభుత్వ అవకతవక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చాయి. అనేక వేల మందిని నిర్బంధించినప్పటికీ దేశవ్యాప్తంగా అజ్ఞాత ఉద్యమం కొనసాగింది.




