- ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం
- నేడు అధికారికంగా ప్రకటన
- నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం, డిప్యూటి సిఎం, మంత్రులు, కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఐఎం, సీపీఐ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తదితరులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడ్డం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గురువారం ఆయన అసెంబ్లీలో స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్లకు గడువు బుధవారం సాయంత్రంతో ముగిసిన సమయానికి స్పీకర్ పదవికి ఒక్క గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ మాత్రమే దాఖలయింది.
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి లాయన నామినేషన్ వేశారు. ఇక రేపు సభలో ప్రొటెమ్ స్పీకర్ అధికారికంగా అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించనున్నారు. అయితే బుధవారం ఉదయం అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉండడంతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కెటిఆర్ సహా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు 15న అసెంబ్లీ, మండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం చేయనున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానం 2008లో మొదలయ్యింది. ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఓడిపోయారు.
ఓటమి పాలయినా పార్టీ మారలేదు. నియోజకవర్గాన్నీ మార్చలేదు. వికారాబాద్‌నే అంటిపెట్టుకుని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2018 తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ నియమితులయ్యారు. ఆ తర్వాత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ విజయాన్ని సాధించి స్పీకర్‌గా నియమితులయ్యారు.