Take a fresh look at your lifestyle.

స్థూలకాయం పలు రోగాలకు మూలం

భారత్‌లో కొరోనా మహమ్మారి లాక్‌డౌన్‌ ‌క్రమశిక్షణల నియమనిబంధనలతో దేశవాసులు ఇండ్లలోనే స్వీయ నిర్బంధాలు కావలసి వచ్చింది. ఊహించని మహమ్మారి విపత్తుతో మానవాళి మానసిక, శారీరక ఆరోగ్యాలను కోల్పోవలసిన అనివార్యత వెన్నాడింది. శారీరక కదలికలకు సంకెళ్ళు పడడం, అసాధారణ అనారోగ్య ఆహార పదార్థాలను హద్దులు మీరి తీసుకోవడంతో పిల్లలు, పెద్దల్లో స్థూలకాయ సమస్యలు ఎదురై జీవనశైలి రుగ్మతల పాలయ్యారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇంటిలో టివీల ముందు కూర్చోవడం, ఆన్‌లైన్‌ ‌తరగతులకు హాజరుకావడం, అత్యవసర ఆధునిక ప్రాసెస్డ్ ‌పుడ్స్‌ను అతిగా మింగేయడం మనకు అలవాటై పోయింది. బిస్కెట్లు, కేకులు, బ్రెడ్స్, ‌చాక్లెట్లు, చిప్స్, ‌జంక్‌ ‌ఫుడ్స్ ‌లాంటివి తినడం సర్వసాధారణమైంది. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాల్లో కరోనా లాక్‌డౌన్లు, కర్ఫ్యూ క్రమశిక్షణలతో శరీర బరువు ఒక్కొక్కరు కనీసం 1-20 కిలోల వరకు పెరగడంతో స్థూలకాయ సమస్యలు బయట పడుతున్నాయి. ఈ-ఆరోగ్య యాప్‌ల వేదికగా బరువు తగ్గడం, కొవ్వును కరిగించడం, డయట్‌ ‌మేనేజ్‌మెంట్‌, ‌పిల్లల్లో స్థూలకాయ సమస్యల గురించి జనుల సలహాలు తీసుకోవడం 550 శాతం వరకు పెరగడం గమనించారు.
కొరోనా అకాలంలో శారీరక కదలికలు తగ్గడం, తిండి పెరగడం, మానసిక ఒత్తిడిని అనుభవించడం లాంటి సమస్యల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడంతో బరువు అసాధారణంగా పెరగడం, ఒబేసిటీ సమస్యలు ఎదురు కావడం నేటికీ కనిపిస్తోంది. జిమ్‌లు, స్విమ్మింగ్‌ ‌పూల్స్, ‌క్రీడా మైదానాలు అందుబాటులో లేకపోవడమే కాకుండా జోమోటో, స్విగ్గీ ఈ-కంపెనీలు ఆహార పదార్థాలను ఇంటికి సులభంగా సరఫరా చేయడంతో స్థూలకాయ రుగ్మతలు ఊపందుకున్నాయి. 2018లో జోమోటో సరఫరా ఆర్డర్లు 30.6 మిలియన్లు ఉండగా, 2020లో అమాంతం 403 మిలియన్లకు పెరగడం గమనించారు. 2/3 టయర్‌ ‌నగరాల్లో కూడా బిర్యానీలు, బట్టర్‌ ‌నాన్స్, ‌దోసాలు, చాకొలేట్‌ ‌కేకులు, గులాబ్‌ ‌జమ్‌ ‌లాంటి ఆహార పదార్థాల ఆర్డర్లు లాక్‌డౌన్‌లో విపరీతంగా పెరగడం గమనించారు. మ్యాగీ నూడుల్స్, ‌బిస్కెట్లు, నమ్కీన్‌ల అమ్మకాలు అధిక శాతం పెరగడంతో స్థూలకాయ రుగ్మత ఏర్పడింది. మానసిక ఒత్తిడిని జయించడానికి ప్రజలు తినుబండారాలను విచక్షణారహితంగా వాడడం తప్పనిసరి కావడం జరిగింది. మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరగడంతో ఆహారపు అలవాట్లు దెబ్బతినడమే కాకుండా టివీలు, సెల్‌ఫోన్లతో గంటల తరబడి అతి సంసారాలు చేయడం కూడా జీవక్రియకు సంబంధించిన వ్యాధులు బయట పడడానికి కారణమని గమనించారు.
మానసిక ఒత్తిడిలో విడుదల అయ్యే కార్టిసోల్‌ ‌హార్మోన్‌తో కోవ్వులు కరిగే ప్రక్రియ మందగించడం జరుగుతున్నది. కొరోనా కాలంలో దాదాపు 70 శాతం ప్రజలు వ్యాయామానికి దూరం అయ్యారు. శారీరక వ్యాయామం లేకపోవడంతో బరువు పెరగడం, కండర ద్రవ్యరాశులు తగ్గడంతో కీళ్ళు, కండర సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. తొలి లాక్‌డౌన్‌లో 40 శాతం జనాభా బరువు పెరగడం జరిగింది. ప్రపంచదేశాలతో పోల్చితే భారతీయుల్లో మానసిక ఒత్తిడి 40 శాతం పెరిగింది. ఒత్తిడికి, బరువు పెరగడానికి అనులోమ సంబంధం ఉంటుందని మనకు తెలుసు. రోజుకు 2 గంటలకు పైగా టివీ ముందు కూర్చున్న వారిలో 23 శాతం మందిలో స్థూలకాయ సమస్య ఖాయమని విశ్లేషించారు.
స్థూలకాయులు బరువు తగ్గడానికి అశాస్త్రీయ విధానాలను పాటించి వ్యాధినిరోధకశక్తిని తగ్గించుకోరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్య శారీరక వ్యాయామంతో పాటు ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకర సంతులిత పోషకాహారాన్ని తీసుకోవలసి ఉంటుంది. బయటి ఆహారాన్ని తగ్గించడం, సింపుల్‌ ‌ఫుడ్‌ ‌తీసుకోవడం, నీటిని తాగడం, పండ్లు తినడం ఉత్తమమని భావించాలి. ముఖ్యంగా పిల్లల ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించాలి. ఉపాద్యాయులు, తల్లితండ్రులు, సభ్య సమాజం కూడా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొరోనా నిర్భంధాల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కారణం కారాదు. సూర్యరశ్మి తాకడం, ప్రాసెస్డ్ ‌ఫుడ్‌ను నిషేధించడం, పూర్వపు జీవనశైలిని అలవర్చుకోవడం తప్పనిసరి అని తెలుసుకోవాలి. స్థూలకాయ సమస్య భారత్‌ను అనాదిగా పీడిస్తున్నది. కొరోనా పూర్వమే 135 మిలియన్ల భారతీయులు స్థూలకాయంతో సతమతం అవుతున్నారని తేలింది. కోవిడ్‌-19 ‌విజృంభనతో బరువు పెరగడంతో మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ళ సమస్యలు, కాన్సర్‌ ‌లాంటి తీవ్ర అనారోగ్యాలు కలుగుతాయి. ‘స్థూలకాయం ఓ నిశ్శబ్ద వ్యాధి (ఒబేసిటీ ఈజ్‌ ఏ ‌సైలెంట్‌ ‌కిల్లర్‌)’ అని గుర్తుంచుకుందాం. ‘హెల్తీ అండ్‌ ‌స్లిమ్‌’‌గా జీవనయానం చేద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యమని, స్థూలకాయమే సకల రోగాలకు కారణమని సదాలోచనలతో ఆరోగ్యంగా మసులుకుందాం.

– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి, కరీంనగర్‌,9949700037

Leave a Reply