ముగ్గరు విద్యార్థులు అక్కడిక్కడే దుర్మరణం
చెన్నై,మార్చి1: స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులపైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలురు మరణించారు. వారి మృతికి కారణమైన నిందితుడ్ని కాలేజీ స్టూడెంట్‌గా పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాణియంబాడి ప్రాంతానికి చెందిన రఫీక్, అన్నాద మ్ములైన విజయ్, సూర్య కలిసి మంగళవారం ఉదయం సైకిళ్లపై స్కూల్‌కు వెళ్తున్నారు. హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్డుపై సైకిళ్లు తొక్కుతూ వెళ్తున్న వారిపైకి ఒక ఎస్‌యూవీ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు బాలురు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 13 ఏళ్ల లోపున్న ముగ్గురు స్కూల్ విద్యార్థులపైకి కారును దూకించిన డ్రైవర్‌ను కాలేజీ స్టూడెంట్‌గా గుర్తించారు.
తన స్నేహితులతో కలిసి ఏలగిరి కొండకు విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా అతడు డ్రైవ్ చేస్తున్న కారు అదుపుతప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడైన కాలేజీ స్టూడెంట్ ఆ సమయంలో మద్యం సేవించి లేడని పోలీసులు చెప్పారు. ర్యాష్, నిర్లక్ష్యం డ్రైవింగ్ వల్ల ముగ్గురు పిల్లల మరణానికి కారణమైన నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు కారు దూసుకెళ్లడంతో మరణించిన ముగ్గురు స్కూల్ విద్యార్థుల కుటుంబాలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. నిర్లక్ష్యపు కారు ప్రమాదాన్ని ఆయన ఖండించారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.