జగదేవ్‌పూర్(సిద్ధిపేట), మే 21(ప్రజాతంత్ర విలేఖరి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం రాయవరంలో అప్పుల బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జగదేవ్‌పూర్ ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రాయవరం గ్రామానికి చెందిన డబ్బేట మల్లేశం(56) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న రెండెకరాల పొలంతో కలిపి మరో ఎకరం పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయ కొనసాగిస్తున్నాడు.
గత ఏడాది పత్తి, మొక్కజొన్న పంటలు వేసి నష్టపోయాడు. ఈ ఏడాది కూడా పత్తి, మొక్కజొన్నతో పాటు కొంతమేర వరి కూడా సాగు చేశారు. పంటలకు పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలయ్యాడు. దీనికితోడు మల్లేశం పెద్ద కుమారుడు భాస్కర్ గత సంవత్సరం ఆనారోగ్యంతో మృతి చెందాడు. భాస్కర్ చికిత్స కోసం అధిక మొత్తంలోనే డబ్బులు ఖర్చయ్యాయనీ, అటు వ్యవసాయం సాగుకు చేసిన అప్పులు, ఇటు కొడుకు భాస్కర్ చికిత్స కోసం చేసిన అప్పులు మల్లేశంకు భారంగా మారాయన్నాడు. అప్పుల బాధ, కొడుకు మృతి చెందిన బాధను తట్టుకోలేక శనివారం తన వ్యవసాయ పొలం వద్ద పురుగులమందు సేవించి ఇంటికి రాగా ఇంట్లో ఉన్న ఆయన కుమారుడు కర్ణాకర్ గుర్తించి 108 అంబులెన్స్ వాహనం ద్వారా ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మల్లేశంకు సుమారు 6 లక్షల రూపాయల వరకు అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం తరపున ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు.