సింగరేణికి నష్టం రాకుండా చూస్తా…

  • తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత
  • కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం
  • సింగరేణికి కొత్త గనులు కేటాయించాలన్న డిప్యూటీ సిఎం భట్టి
  • త్వరలోనే అఖిల పక్షంతో ప్రధానిని కలుస్తానని వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21 : సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లకుండా చూస్తానని, తెలంగాణ బిడ్డగా అది తన బాధ్యత అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ…డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పిన అంశాలను పరిశీలిస్తామని, సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నష్టం రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఆదాయం కోసమే బొగ్గుగనుల వేలం వేయడం లేదని, సుప్రీమ్‌ కోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టామని కిషన్‌ రెడ్డి చెప్పారు. ఒడిశాలోని నైని బ్లాక్‌లో సింగరేణికి లాభం వొచ్చే విధంగా ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేస్తామని అన్నారు.

దీనిపై త్వరలోనే ఒడిస్సా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడతామని కిషన్‌ రెడ్డి తెలిపారు. సింగరేణి కాలరీస్‌లో కేంద్ర ప్రభుత్వానికి 49శాతం వాటా ఉందని చెప్పారు. సింగరేణిని కాపాడుకునే బాధ్యత కేంద్రంపైనా ఉందని చెప్పారు. గత ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణి నష్టాల్లోకి వెళ్లిందని అన్నారు. కమర్షియల్‌ మైన్‌ యాక్షన్‌ పారదర్శకంగా జరుగుతుందని, బిడ్డర్స్‌ కు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. పదేండ్ల క్రితం పరిశ్రమలకు పవర్‌ హాలీడే ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, కొత్త పాలసీ వల్ల నిరంతరం విద్యుత్‌ సరఫరా అవుతోందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అవకాశం ఇస్తే అఖిల పక్షంగా వచ్చి ప్రధానిని కలుస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

10వ బొగ్గు వేలం పక్రియను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. సింగరేణికి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్‌ ప్రకారం సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మల్లు భట్టి విక్రమార్క వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దిల్లీ నుంచి కాకుండా మొట్టమొదటి సారి కమర్షియల్‌ బొగ్గు గనుల వేలం పక్రియ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారని తెలిపారు. కిషన్‌ రెడ్డికి తెలంగాణ పరిస్థితులు బాగా తెలుసన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణకి ఆయువు పట్టు, కొంగుబంగారం అన్నారు. సింగరేణి బొగ్గు వల్లే మన రాష్ట్రంలో థర్మల్‌ ప్లాంట్స్‌ నడుస్తున్నాయన్నారు. 130 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్‌లు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

త్రైపాక్షిక ఒప్పందాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. 1400 వందల మిలియన్‌ టన్నులు బొగ్గును తియ్యడానికి అవకాశం ఇంకా ఉందని తెలిపారు. 2015లో కొత్త చట్టం వల్ల సింగరేణి తనకు ఉన్న అర్హతలను కోల్పోయిందని తెలిపారు. సత్తుపల్లి, కోయగూడ, మరో రెండు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని కేంద్రం వద్ద ప్రతిపాదన ఉందన్నారు. సింగరేణి ప్రభుత్వ సంస్థ, కేంద్రం సింగరేణికి సహకారం ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గతంలో ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి కోల్‌ బ్లాక్‌ కు వెళ్లాయన్నారు. రిజర్వేషన్లు పక్కన పెట్టి ప్రైవేటీకరణ దిశగా వేలం పాట నడవడం వల్ల సింగరేణికి నష్టం వాటిల్లిందన్నారు.

2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రిజర్వేషన్‌ కోటాలో బొగ్గు బ్లాక్‌ లు కేటాయించాలని కోరారు. రిజర్వేషన్ల అంశంలో కిషన్‌ రెడ్డి చొరవ చూపాలని అన్నారు. కిషన్‌ రెడ్డి అవకాశం ఇస్తే అఖిల పక్షంగా వొచ్చి ప్రధానిని కలుస్తామని తెలిపారు. సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి సంస్థ బతకాలి అంటే కొత్త గనులు కేటాయించడం ఎంతో అవసరముందుని తెలిపారు. సత్తుపల్లి, కొయగూడ బ్లాక్‌ ల పాత లీజు రద్దు చేసి..వాటిని సింగరేణికి కేటాయించాలి కోరుతున్నామన్నారు. సింగరేణి భవిషత్‌ కోసం మరో 0.5 పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సింగరేణి సంస్థను కాపాడేందుకు చట్టంలో మార్పులు చేయాలని కోరుతున్నామని భట్టి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *