సామూహిక స్వప్నాన్ని సాకారం చేసిన కెసిఆర్‌

ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే మలుపు తిరిగింది. కాగా ఏకంగా అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణకు దారితీసింది. ఎవరూ ఊహించని విధంగా మెదక్‌జిల్లా సిద్దిపేట నియోజకవర్గం చింత మడక ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటునకు దారితీసే విధంగా కెసిఆర్‌ ఆనాడు నిర్ణయం ఆలోచనను పరిశీలిస్తే… అది 2001 జనవరి నుంచి మార్చి నెలల్లో తెలంగాణ ఉద్యమానికి పూర్తిస్థాయి సన్నాహాలు జరుగుతున్న సమయం.

డిప్యూటి స్పీకర్‌గా పనిచేస్తున్న కె.చంద్రశేఖర్‌రావు కవులు, కళాకారులు, మేధావులతో చర్చిస్తున్నట్లు, ఆడియో క్యాసెట్లు రూపొందిస్తున్నట్లు అప్పుడే వార్తలు వస్తున్నాయి. తెలంగాణ వాదులకు ఒక పక్క సంతోషం, మరోపక్క సందేహాలు, క్యాబినెట్‌ ‌ర్యాంకుతో ఉన్న చంద్రశేఖర్‌రావు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎదిరించి బయటకు వస్తారా? తెలంగాణ అంటారా? చెన్నారెడ్డి లాగే చేస్తారా? సందేహాలు. జూబ్లిహిల్స్ ‌నందీనగర్‌లో నూతన గృహప్రవేశం చేసి 610 జిఓ గురించి ప్రస్తావించడం సంచలనమైంది. కెసిఆర్‌ ఇక బయటకు వచ్చేది ఖాయం, జై తెలంగాణ అనేది ఖాయం అని పక్కాగా తేలిపోయింది. అంతకు ముందు మార్చి నెలలో పార్టీ రిజిస్ట్రేషన్‌కు ముందు డిప్యూటీ స్పీకర్‌ ‌హోదాలో ఒక రోజు నారా యాణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కెసిఆర్‌ ‌తిరుపతికి బయలుదేరుతున్నారు. అర్జెంట్‌గా బీబీనగర్‌ ‌వెళ్లల్సిన నేను రన్నింగ్‌లో ఎసి కోచ్‌ ఎక్కాల్సి వచ్చింది. కోచ్‌లో నిలబడ్డ కొందరు గన్‌మెన్‌లతో వాకబు చేయగా కెసిఆర్‌ ‌తిరుపతి వెళుతున్నారు అన్న విషయం తెలిసింది. అప్పటికే విద్యుత్‌ ‌సమస్యలపై లేఖలు రాసి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎదిరించిన కెసిఆర్‌ను కలువడానికి ప్రయత్నించగా సార్‌ ‌ఫ్యామిలితో ఉన్నారు. ఇప్పుడు కుదరదు అనడంతో నిరాశచెందాను. కెసిఆర్‌ ‌ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలోకి వస్తారని తెలిసాక ఒక సుధీర్ఘ ఉత్తరం రాసి ఆయనకు మద్దతు తెలుపుతూ రిజిష్టర్‌ ‌పోస్టులో పంపాను.

తరువాత సంతోషన్నతో ఫోన్‌లో మాట్లాడితే సార్‌ ‌నీ ఉత్తరం చదివారు సంతోషించారు. ఒక్కసారి వచ్చి కలిసిపో అని చెప్పడంతో ఏప్రిల్‌ 26‌వ తేది 2001వ సంవత్సరం మద్యాహ్నం మూడు గంటలకు కెసిఆర్‌ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లగా ఇంటిలిజెన్స్ ఇన్స్‌పెక్టర్‌ ‌వచ్చి ప్రశ్నించడం, అప్పుడు ఒక మంత్రి పిఆర్‌వో గా పని చేస్తున్న నేను డిప్యూటీ స్పీకర్‌కు లెటర్‌ ఇవ్వడానికి అని చెప్పి భయంగా వెళ్లాల్సి వచ్చింది. ఇక అప్పట్లో 24 గంటలూ ఆయన ఇంటిచుట్టూ ఇంటిలిజెన్స్ ‌నిఘా. లోపలికి వెళ్లి ఆయనను గదిలో కలిసినపుడు హరీష్‌రావు, ఇన్నయ్య, దివంగత నిమ్మ నర్సింహారెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి ఉన్నారు. కెసిఆర్‌ ‌తాను ఉద్యమానికి మద్దతు తెలపవలసిందిగా ప్రతిపక్ష నాయకులకు ఫోన్‌ ‌చేసి మాట్లాడుతున్నారు. హరీషన్న ఫోన్లు కలిపి ఇస్సుండగా, మధ్య మధ్యలో జర్నలిస్టులు, కొంత మంది అడ్వకేట్లు చేసిన ఫోన్లు రిసివ్‌ ‌చేసుకుంటూ ఒక స్పష్టమైన నమ్మకంతో, పట్టుదలతో, విజయంపై అత్యంత విశ్వాసంతో చేయవలసిన కార్యాచరణను, ఆచరించాల్సిన పద్ధతులను, ఎత్తుగడలతో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైన సర్వ సైన్యాధ్యక్షుడిగా తన సీట్లో పూర్తి ఉల్లాసంగా గడుపుతూ ప్రతి ఫోన్‌కాల్‌కు సావధానంగా కెసిఆర్‌ ‌సమాధానాలు ఇస్తున్నారు. సాయంత్రం చింతమడక బయలు దేరి పొద్దునే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, హైదరాబాద్‌ ‌వచ్చి నాంపల్లి దర్గాను దర్శించుకుని, అమర వీరుల స్థూపానికి అర్పించి, జల దృశ్యంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమావేశం ఉంటుంది. అక్కడ  కలుద్దాం బ్రదర్‌ అని ఫోన్లు చేసిన వారికి చెబుతున్నారు.

ఏప్రిల్‌ 27 2001 ‌జల దృశ్యం …
కెసిఆర్‌ ‌హైదరాబాద్‌ ‌నాంపల్లి దర్గా దగ్గరికి వచ్చే సరికి జన సందోహం, భారీగా ర్యాలీతో దర్గా నుంచి అమరుల స్థూపం వద్ద దండం పెట్టుకుని జల దృశ్యంకు వచ్చే సరికి జనమే, జనం, స్వచ్చందంగా తరలి వచ్చిన జనం. నల్లకోట్లతో ఉన్న అడ్వకేట్లు, విద్యార్థులు, యువకులు అధికంగా తరలి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థులు కొందరు వచ్చారు. ఆ దృశ్యం రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పే విధంగా ఉన్న విషయం అప్పుడే గోచరించింది. సరిగ్గా అదే సమయానికి అవతల సచివాలయంలో క్యాబినెట్‌ ‌సమావేశం, క్యాబినెట్‌ ‌సమావేశంలో అదే చర్చ. పార్టీకి, డిప్యూటి స్పీకర్‌ ‌పదవికి రాజీనామా చేస్తాడని భావించిన తెలుగుదేశం వర్గాలు, కెసిఆర్‌ ‌శాసన సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడని తెలిసి ఆశ్చర్యపోయారు. నిజంగా ఆనాడు అది సాహసోపేతమైన నిర్ణయం. చంద్రబాబు హయాంలో ఉప ఎన్నికల్లో చంద్రబాబును ఎదిరించి గెలవడం అన్నది అసాధ్యమని అనేక    ఉప ఎన్నికలు నిరూపించాయి. కానీ మూడు పదవులను గడ్డిపోచలుగా భావించి రాజీనామా చేసిన కెసిఆర్‌ ‌తెగువ, ధైర్యానికి సిద్దిపేట ప్రజలపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని వెల్లడించాయి. ఇక అక్కడి నుంచి జరిగిన పలు విషయాలు తెలిసినవే. ఎన్ని అవాంతరాలు వచ్చినా గమ్యాన్ని ముద్దాడతానని, తెలంగాణ తెస్తానని వెల్లడించిన కెసిఆర్‌ ఏనాడు విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రతి మలుపు దగ్గర ఆయనపై అచంచల విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలు కనబరిచారు.  ఎంతోమంది పోరాటం, ఆరాటం, ఒక ఆర్తి, ఎడతెగని దు:ఖం తెలంగాణ స్వరాష్ట్రం. ఒక సామూహిక స్వప్నం తెలంగాణ. సాకారం చేసి చూపించిన సాద్యకారకుడు కెసిఆర్‌. ఏ‌ప్రిల్‌ 27 ‌తెలంగాణ చరిత్రలో ఎప్పటికి చిరస్థాయిగా ఉండిపోతుంది.

సురేష్‌ ‌కాలేరు 9866174474

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page