సర్కార్‌ ‌బడుల అభివృద్ధి లక్ష్యంగా… కేసీఆర్‌ ‌నాయకత్వంలో విద్యా యజ్ఞం

రూ. 3,497 కోట్ల ఖర్చుతో 9,123 పాఠశాల అభివృద్ధి
అసెంబ్లీ వేదికగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

ప్రజాత్కంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 11 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో విద్యాయజ్ఞం మొదలైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ విద్యాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ బడి రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలి. సీఎం ఆకాంక్ష, విద్యాయజ్ఞం నెరవేరేలా అందరూ కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. తాము చదువుకున్న స్కూళ్లకు కొంతయినా ఇచ్చి బాగుచేసేందుకు పిల్లలు ముందుకు రావాలని, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ బడుల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఈ స్కూళ్లను మన ఊరు-మన బడి పథకం కింద అభివృద్ధి చేస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మన ఊరు- మన బడి పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఈ ఒక్క ఏడాదే కొత్తగా 3 లక్షల మంది చేరారని సబిత తెలిపారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వడం, యూనిఫామ్‌ ఇవ్వడంతో పాటు నాణ్యమైన విద్యను అందించడంతో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుందన్నారు.

 

ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు విశ్వాసం పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ ‌సూచనలతో స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. మన ఊరు-మన బడి పథకం కింద అన్ని పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశపెడుతున్నామని చెప్పారు. 26 వేల స్కూళ్లలో 22 లక్షల మంది చదువుతున్నారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. అత్యధికంగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను మొదటగా ఈ పథకం కింద తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మొదటి విడతలో 9,123 పాఠశాలలను 3,497 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఒక్క విడతలోనే 60 శాతం మంది విద్యార్థులు కవర్‌ అవుతున్నారు. ప్రధానంగా టాయిలెట్స్‌పై దృష్టి సారించాం. టాయిలెట్స్‌లో రన్నింగ్‌ ‌వాటర్‌ ‌సదుపాయం కల్పించబోతున్నాం.

 

విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టాయిలెట్ల నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పారు. ‘స్కూళ్లలోని విద్యుత్‌ ‌సమస్యలను కూడా పరిష్కరించబోతున్నాం. ప్రతి తరగతి గదిలో మంచి లైటింగ్‌ ‌వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి పాఠశాలకు మిషన్‌ ‌భగీరథ జలాలను తరలించి, నీటినిల్వకు ట్యాంక్‌ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి క్లాసులో అధునాతన ఫర్నీచర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. సైన్స్, ‌కంప్యూటర్‌ ‌ల్యాబ్‌లతో పాటు లైబ్రరీలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. అన్ని పాఠశాలలకు పెయింటింగ్‌ ‌వేయించడంతో పాటు, విరిగిపోయిన కిటీకిలు, తలుపులు తొలగించి కొత్తవి అమర్చబోతున్నామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌, ‌జిల్లా మంత్రి ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page