ఓయ్‌! ‌నిన్నే
మానవత్వం కనుమరుగైపోతోంది
అన్నదెవరు?
నాకు కనపడుతోందే
ఆకాశంలో తారలవోలె
మిణుకు మిణుకుమంటూ!

బంధాలకు అర్థంలేకుండా పోతోంది
అన్నదెవరు?
కట్టుకున్నదానికి నచ్చలేదనేగా
కన్నవారిని అనాధలుగా మారుస్తోంది.
అడిగింది తేలేదనేగా
నమ్మివచ్చినదానికి
‘‘వేదన’’ కానుకగా ఇస్తోంది.
ఎదిగి ఇబ్బంది పడకూడదనేగా
ఊహల రెక్కలైనా మొలవని
పసిమొగ్గని చిదిమేస్తోన్నది.
గుండె డబ్బూ డబ్బూ అని
కొట్టుకుంటుంటేనేగా
మనీమాయలో మానవత్వాన్ని
తుంపేసేది.

ఏమిటీ రామరాజ్యం లేదంటావా?
అధికారమదంతో కదంతొక్కుతూ
అహింసను పొత్తాలకెక్కించి
తమ భావదరిద్రపు బీజాలతో
కులాల కుమ్ములాటలు,
ప్రాంతీయ భేదాలు
మొలిపించినంత మాత్రాన
రామరాజ్యం లేదంటే ఎలా?

ఏమిటీ!
పరిస్థితులు చక్కదిద్దేందుకు
మహనీయులు మళ్లీ పుట్టలా?
చాల్లే నీ గొంతెమ్మ కోరిక
అది సాధ్యమయ్యే పనేనా?

ఓ మనిషీ!
అహాన్ని పక్కనపెట్టి
మనోగతాన్నీ,అంతర్మధనాన్నీ
మేలుకొలుపు.
నిజానికీ,నీడకి తేడా పసికట్టి
నిన్ను నీవు గుర్తించు.
మంచిమాటలు ఆచరించి చెప్పు.
సరేనా!
వేమూరి శ్రీనివాస్‌, 99121 28967
                         ‌తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *