- రూపొందిండానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం
- అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో ప్రధాని మోదీ
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 23 : సరళమైన పద్ధతిలో, భారతీయ భాషల్లో చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూ దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో రెండు రోజుల పాటు జరిగే ‘అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సు 2023’ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ…తమ ప్రభుత్వం సరళమైన పద్ధతిలో మరియు భారతీయ భాషలలో గరిష్ట స్థాయిలో చట్టాలను రూపొందించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని చెప్పారు. చట్టాలను రచించడానికి ఉపయోగించే భాష న్యాయ పక్రియలో, న్యాయాన్ని నిర్ధారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం చట్టాన్ని రెండు విధాలుగా రూపొందించాలని ఆలోచిస్తుదని, అందులో ఒక డ్రాఫ్ట్ న్యావాదులకు అలవాటైన భాషలో ఉంటుందని అన్నారు.
రెండవ డ్రాఫ్ట్ దేశంలోని సామాన్యులు అర్థం చేసుకోగలిగే విధంగా…చట్టాన్ని తన స్వంతంగా పరిగణించే విధంగా ఉంటుందని తెలిపారు. ఇక న్యాయవాదుల మధ్య సోదరభావాన్ని కొనియాడుతూ, న్యాయవ్యవస్థ మరియు న్యాయవాదులు చాలా కాలంగా భారతదేశ న్యాయ వ్యవస్థకు రక్షకులుగా ఉన్నారని, ఆ విధంగా భారత స్వాతంత్య్ర సాధనలో అవి కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారు న్యాయవాదులని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. భారతదేశం అనేక చారిత్రాత్మక క్షణాలను చూసిన తరుణంలో ఈ సదస్సు జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ…ఇది మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి కొత్త దిశను, శక్తిని ఇస్తుందని అన్నారు. జి20 సమ్మిట్, చంద్రయాన్ మిషన్ విజయవంతంపై ప్రధాని ప్రజ్తావిస్తూ..2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ కృషి చేస్తున్నందున, దానికి బలమైన, నిష్పక్షపాత న్యాయ వ్యవస్థ పునాది అవసరం అని ఆయన అన్నారు. భారతదేశంపై ప్రపంచానికి పెరుగుతున్న విశ్వాసంలో నిష్పక్షపాత న్యాయం పెద్ద పాత్రను కలిగి ఉందని ప్రధాని మోదీ అన్నారు.