ప్రకృతి పాడే పరవశ గీతిక
ఉరకలెత్తించే ఉగాది వేడుక
ఇంటింటా ఆనందాల కానుక
సుఖ దుఃఖ సమ్మిళిత నాటిక
అరాచకాల్ని పాతరేసే పాదుక
శ్రీ శుభకృత సుగంధాల వీచిక !
జీవనసారం ఇరిగిపోయి..
పచ్చనాకులు పాలిపోయి..
ఎండుటాకులై ఎగిరిపోయి..
బోసి పోయే కొమ్మ రెమ్మలు..
ఆమని దయచేయడమేగా..
ప్రకృతి నేర్పే బతుకు పాఠాలు !
గుత్తులు గుత్తులుగా మావిళ్లు..
రాలిన చోటే మ్నెలిచే చివుళ్లు..
లేత చిగుర్లను ముద్దాడే కోయిళ్లు..
నిండా తీపి రసపు చెరుకు గడలు..
వేప కొమ్మల్లో నవ్వుల పువ్వులు..
షడ్రుచుల జీవనతత్వ సరాగాలు !
పంటల ప్రసవ విరామానంతరం..
నేలతల్లి మళ్లీ మ్నెలకెత్తే సన్నాహాలు
చలికి వీడ్కోలు పలికి వెచ్చదనానికే..
వృక్ష హరిత కిరీటాల శిరస్సులు
శిశిరానికే పాదాక్రాంతమైన దశలు
ఉగాది పర్వదిన శుభకృత్ లీలలు.. !
చురుకెక్కిన చమురు ధరాఘాతాలు
పుతిన్ బాంబుకు పేలిన గ్యాస్ బండలు
అనాధలైన కర్షకుల వరి కుప్పల తిప్పలు
బస్సు టికెట్లు మందు గోలీల మూల్యాలు
క్షిపణిలా చుక్కలనంటిన సరుకుల ధరలు
ఓటు చుట్టు కీచక రాజకీయాల భ్రమణలు
శ్రీ శుభకృత్ పేల్చాలి అశుభాల మూటలు !
– మధుపాళీ
కాన్‌బెరా, ఆస్ట్రేలియా – 9949700037