Take a fresh look at your lifestyle.

శ్రీ‌శైలంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు

  • మహాసరస్వతి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి
  • కాలి నడకన చేరుకుంటున్న కన్నడ భక్తులు

నంద్యాల, మార్చి 21 : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయం  లో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడవరోజు మంగళవారం మహాసరస్వతి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. నందివాహనం పై ఆసీనులై ఆదిదంపతులు ప్రత్యేక పూజలందుకోనున్నారు. శ్రీస్వామి అమ్మవార్లకు క్షేత్ర పురవీధుల్లో ప్రభోత్సవం జరుగనుంది. సాయంత్రం క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు శివదీక్ష శిబిరాలలో వీరశైవులచే వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం చేయనున్నారు. భక్తుల రద్ది కారణంగా స్వామివారి స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నామని… భక్తులందరికీ అలంకార దర్శనం కల్పిస్తున్నామని ఈఓ లవన్న పేర్కొన్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఆదివారం శాస్తోక్త్రగా ఆరంభమయ్యాయి. ముందుగా ఈవో ఎస్‌ ‌లవన్న దంపతులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

అర్చక వేదపండితులతో కలిసి స్వామివారి యాగశాల ప్రవేశం చేయడంతో ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. గణపతిపూజ అఖండ దీపరాదన, కళశస్థాపన, వేదస్వస్థి, రుత్విగ్వరణం, పుణ్యహ్వచనం, చండీశ్వర పూజ, రుద్రపారాయణం, రుద్ర కళశస్థాపన, కంకణపూజ, కంకణధారణ చేశారు. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రెండో రోజు మహాదుర్గ అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. మహాదుర్గ అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారు, శ్రీ స్వామి వారికి వేదపండితులు శాస్తోక్త్రగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకొని స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. స్వామివారి గర్బాలయ, ఆర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పది రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

మరోవైపు ఈ వేడుకలను చూసేందుకు వేల మంది కన్నడ భక్తులు కాలినడకన నల్లమల అడవి గుండా తరలివస్తున్నారు. కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా దేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. అందుకే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం వెంకటాపురం నుంచి దట్టమైన అటవీప్రాంతం నుంచి సుమారు 40 కిలోటర్ల మేర నడుచుకుంటూ వస్తారు. వీరికి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చూసుకుంటోంది. మార్గమధ్యలో మంచినీరు, వైద్య సౌకర్యాలు కల్పించడం, అటవీ మార్గంలో రాళ్లు రప్పలు లేకుండా చూడడం, ట్రాక్టర్లతో నీళ్లు చల్లించడం, అన్నదానం వంటి ఏర్పాట్లను చేశామని ఈవో ఎస్‌.‌లవన్న తెలిపారు. మరోవైపు దాతలు కూడా మజ్జిగ, పండ్లు పంచడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు.

Leave a Reply