తాజాగా కర్నాటక హైకోర్టు తీర్పు
తన భర్త తనపై వైవాహిక అత్యాచారానికి పాలపడుతున్నాడని భార్య పిటీషన్ దాఖలు చేయగా పరిశీలించిన కర్ణాటక కోర్టు వైవాహిక అత్యాచారం విషయంలో ప్రభుత్వం అనుసరించే విధానాన్ని తప్పు పట్టింది. మహిళల పట్ల పురుషులు క్రూర మృగంలా ప్రవర్తించడానికి వివాహం అనేది లైసెన్స్ కాదని స్పష్టం చేసింది. ఏ వివాహ వ్యవస్థ కూడా పురుషులకు ప్రత్యేక హక్కులు లేదా క్రూరమైన మృగంలా మారడానికి లైసెన్స్ ఇవ్వకూడదు.. అది శిక్షార్హమైంది.. అతడు భర్త అయినప్పటికీ శిక్షార్హుడే’అని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంటూ బలవంత పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు భర్తపై అత్యాచారం కేసు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది.దానితో పాటు మహిళలను పురుషులతో సమానంగా చూసే చట్టాలను చేయాలని శాసనకర్తలకు సూచించింది.
స్త్రీ సమ్మతి లేకుండా బలప్రయోగం ద్వారా ఆమెను ఎవరు లొంగదీసుకున్నా, బలాత్కారం చేసినా అది రేప్ కిందకే వస్తుంది. రేప్ అనేది శిక్షార్హమైన నేరం.అయితే భార్యాభర్తలు విషయంలో భర్త భార్య యొక్క సమ్మతి లేకుండా లైంగిక దాడి చేసినా అది నేరం కాదు అంటూ మన దేశంతో పాటు కొన్ని దేశాల్లో దానికి శిక్షార్హ నేరం కాదని మినహాయింపు ఇచ్చేసాయి. అది వైవాహిక అత్యాచారం మాత్రమే అంటూ దానిని ముద్దుగా దానిని మారిటల్ రేప్ అని నామకరణం కూడా చేశారు.అంటే వివాహితురాలు కాని స్త్రీ విషయంలో లైంగిక దాడి రేప్ గా పేర్కొన్నది వివాహితురాలి విషయానికి వచ్చేసరికి అది శిక్షార్హం కాని మారిటల్ రేప్ గా రూపాంతరం చెందింది.దీని ప్రకారం సంబంధాన్ని బట్టి మనతో పాటు కొన్ని దేశాల్లో నేరం మారిపోతోందని చెప్పవచ్చు.ఈ మినహాయింపు వలన వివాహమైన స్త్రీలు ఇష్టం లేని సమయంలో భర్త వైపు నుంచి శృంగారాన్ని నిరాకరించే హక్కును కోల్పోయారు.ఈ చట్టానికి మూలం చూస్తే
బ్రిటిష్ కాలానికి చెందిన, 1860 నుంచి మన దేశంలో ఉనికిలో ఉన్న ఐపీసీ సెక్షన్ 375లో సెక్స్ రేప్‌గా పరిగణించడంలో కొన్ని మినహాయింపులు కల్పించారు.దాని ప్రకారం భార్య వయసు 15 ఏళ్ల లోపుంటే ఆమె అంగీకరించినా, అంగీకరించక పోయినా శృంగారంలో పాల్గొంటే నేరమవుతుంది. ఒకవేళ భార్య వయసు 15 ఏళ్లకు పైబడి 18 ఏళ్ల లోపుంటే అప్పడు ఆమె అంగీకారం లేకుండా భర్త శృంగారంలో పాల్గొన్నా అది నేరం కాదు.ఈ స్ధితిలో భర్త వైవాహిక అత్యాచారం చేస్తే భార్య పిర్యాదు చేసినా ఒరిగేది ఏదీ ఉండదు ఎందుకంటే చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యను బలవంతంగా అనుభవిస్తే భర్తను దోషి అనడానికి వీలు లేకుండా చేసింది ఈ చట్టం. ఎందుకంటే పెళ్లికి అంగీకరించడం ద్వారా ఆమె తనకు తాను భర్తకు సమర్పించుకుంది. దీని నుంచి ఆమె వెనక్కి మళ్లడానికి వీల్లేదు’ అని ఈ చట్టం అభిప్రాయం. ఆంగ్లేయుల పాలనలో ఉన్న చాలాదేశాల్లానే మనం కూడా బ్రిటిష్ వారి ‘కామన్ లా’ నుంచి దీన్ని స్వీకరించాం. ఇప్పటికీ కొనసాగిస్తున్నాం.భార్య శారీరక మానసిక పరిస్ధితి బాగా లేని సమయంలో కానీ గర్భవతిగా లేదా నెలసరి సమయాలలో భార్య సమ్మతించక పోయినప్పటి భర్త బలవంతంగా సంభోగం జరిపితే దానిని రేప్ గానే చూడాలి.అయితే మన దేశంలో పితృస్వామ్య ఆధిపత్య ధోరణి భావజాలం వల్లనే భార్యపై భర్తకు సర్వహక్కులుంటాయనేది నిరూపించి దానిని వైవాహిక అత్యాచారం అంటూ అది నేరం కాదని నిరూపించారు.స్త్రీ కూడా ఒక మనిషే ఆమెకు కూడా మనోభావాలు ఉంటాయి అనే దానిని పూర్తిగా విస్మరించారు.
వివాహం అయిన వెంటనే స్త్రీ తన శరీరంపై హక్కు కోల్పోవలసిందేనా?
మన రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్–14 అందరికీ సమాన రక్షణ కల్పించాలని పేర్కొంది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 లింగ పరంగా వివక్షత చూపకూడదు అని చెబుతుంది. అదే 21వ ఆర్టికల్ అయితే ప్రతీ ఒక్కరికీ గౌరవంగా బతికే హక్కును కలిపిస్తుంది.దీనిని బట్టి వైవాహిక అత్యాచారం విషయంలో ప్రభుత్వం కల్పించిన ఈ మినహాయింపు అనేది రాజ్యాంగ ఉల్లంఘన చేసినట్లే కాదా?
పైగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక చారిత్రక తీర్పును కూడా ఇచ్చింది.దీనిని బట్టి ఏకాంతాన్ని కోరుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకోవడం (ఆర్టికల్–21) కిందకు వస్తుంది. కాబట్టి ఏకాంతంగా ఉండాలని భావించిన భార్యను భర్త బలవంతంగా సంభోగం చేస్తే… బాధిత మహిళకు ఆర్టికల్– 21 కల్పించిన హక్కులను కూడా ఉల్లఘించినట్లే అవుతుంది.రాజ్యాంగ పరంగా ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ సాంఘిక కట్టుబాట్ల మూలంగా మన దేశంలో మహిళల్లో చాలా మంది వైవాహిక అత్యాచారాన్ని మౌనంగా భరిస్తున్నారు తప్ప భర్త దౌర్జన్యాన్ని బయట పెట్టడం లేదు.ఎందుకంటే భర్త కోరికలను భార్య తిరస్కరించరాదంటూ సమాజంలో పాతుకుపోయిన నమ్మకమే ప్రధాన కారణం. భారత్ లో 31 శాతం మంది వివాహితలు అంటే కనీసం ముగ్గురిలో ఒకరు… తమ భర్తల కారణంగా శారీరక, మానసిక హింసలకు గురవుతున్నట్లుగా ఒక సర్వేలో తెలిసింది.అయినా వీరందరూ మౌనంగా భరిస్తున్నారు. దీనివలన వీటి విషయంలో విషయంలో కేసులు నమోదు కావడం లేదు.కేసుల లెక్కలు బట్టి చూస్తే మన దేశంలో వైవాహిక అత్యాచారాలు అత్యల్పం అని తేలుతుంది. ప్రభుత్వాలు ఈ గణాంకాలే చుపిస్తున్నాయి.అయితే మన సాంప్రదాయ సమాజంలో భర్త లైంగిక దాడి చేశాడు అనే ఫిర్యాదుతో భర్త నేరాన్ని నిరూపించే ప్రయత్నాన్ని ఆమె కుటుంబ సభ్యులు కూడా వెనక్కి తగ్గమని వత్తిడి చేస్తారు.తోటి మహిళలు కూడా పిర్యాదు చేయడాన్ని నిరుత్సాహపరుస్తారు.అంతే కాదు చాలా వాటిని కుటుంబ పెద్దల సమక్షంలో సద్దుమణిగేలా ప్రయత్నిస్తారు. ఈ స్ధితిలో చాలా మంది మహిళలు మౌన రోధనతో మృగ ప్రాయమైన లైంగిక దాడిని భరిస్తున్నారు. . వ్యసనపరులైన భర్తలు కలిగిన మహిళలు విషయంలోనే ఈ తరహా దాడులు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చును.ప్రధానంగా నిరక్షరాస్యులు మరియు కుటుంబ మద్దతు లేని మహిళలు మాత్రం ఈ దాడులను భరించడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నారు.విద్యాధికులైన మహిళలు కూడా పిల్లలు భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మిన్నకుండి పోతున్న సంఘటనలు కూడా అనేకం.సహజంగా మనుష్యులలో 18 సంవత్సరాలు నిండిన తరువాతే మానసిక పరిపక్వత వస్తుంది.అందుకే 18 సంవత్సరాలు నిండిన వారిని మైనారిటీ తీరిన వారీగా గుర్తిస్తున్నారు.దానిని దృష్టిలో ఉంచుకునే జువైనల్ జస్టిస్ చట్టం–2000, బాల్యవివాహ నిషేధ చట్టం –2006, పోస్కో చట్టం–2012.మొదలైనవి 18 ఏళ్లు నిండని అమ్మాయిలను బాలికలుగానే పరిగణిస్తున్నాయి.అటువంటప్పుడు 15–18 ఏళ్ల వయసులో ఉన్న భార్యతో సంభోగం కూడా నేరంగానే పరిగణించకుండా దానికి మినహాయింపు ఎలా ఇస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం లేదు. మహిళ ఒక వస్తువు కాదు. ఆమెకూ కూడా కొన్ని మనోభావాలుంటాయి. అయితే వివాహిత అయిన స్త్రీ దంపత్యంలో తన మనోభావాలును తన సమ్మతిని కూడా పక్కన పెట్టి భర్తకు శరీరాన్ని అప్పగించడం ఎంత వరకు న్యాయం?
18 ఏళ్ల లోపు వివాహం చేస్తే బాల్య వివాహం అంటారు. అటువంటి వివాహంపై ఫిర్యాదు వస్తే శిక్షలు వేస్తున్నారు. అటువంటిది 15 ఏళ్ల పైబడి వయసు ఉన్న భార్యతో భర్త వైవాహిక అత్యాచారం చేస్తే నేరం కాదు అని ఎలా చెబుతున్నారు. ఇది బాల్య వివాహం క్రిందకే లెక్కలోనికి వస్తుంది కదా.ఏమిటి ఈ ద్వంద్వ విధానం.ఇదే విషయమై హైకోర్టు సుప్రీం లలో ఎన్నో పిటీషన్లు దాఖలు అయినప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఈ మధ్య
సుప్రీం కోర్టులో దాఖలైన ఒక పిటీషన్ పై ధర్మాసనం తీర్పు ఇస్తూ గత విధానాన్ని సవరించి 18 లోపు వయసు కలిగిన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది నేరమని తేల్చింది. కానీ 18 తర్వాత జరిగే వైవాహిక అత్యాచారం కూడా నేరమే అని మాత్రం న్యాయ స్ధానం తీర్పు చెప్పలేదు.కారణం అది న్యాయ స్ధానం చేతిలో లేదు కేవలం చట్ట సభల చేతిలోనే ఉంది.అయితే ఢిల్లీ హైకోర్టులో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన వాదనను మాత్రం స్పష్టం చేసింది. భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, మతవిశ్వాసాలకు నిలయం భారత దేశం.అయితే ఇటువంటి దేశంలో భర్త భార్యపై జరిపే లైంగిక దాడిని నేరంగా చేయడం సాధ్యం కాదు. అయితే ఇక్కడ
మహిళల్లో ఆర్థిక స్వావలం భనతక్కువ. అక్షరాస్యత, పేదరికం తదితర సాంఘిక అసమానతలను కూడా అధికమే వీటిని దృష్టిలో పెట్టుకొని చూసినపుడు భారత్‌లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి.మన దేశంలో పెళ్లిని పవిత్ర బంధంగా చూస్తాం. ఒక వివాహిత మహిళ భర్త తనను బలాత్కారం చేశాడని చెప్పొచ్చు.అయితే ఇతరులకు అది బలాత్కారంగా అనిపించకపోవచ్చు. దీన్ని నేరంగా చేయాలనే అంశాన్ని పరిశీలించే ముందు అసలు ‘మారిటల్ రేప్’ అంటే ఏమిటనేది విస్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉంది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తే… భారత్‌లో వివాహ వ్యవస్థ విచ్ఛన్నతకు దారి తీస్తుంది. ఒక వేళ మారిటల్ రేప్‌ను నేరం చేస్తే…489ఏ (గృహ హింస నిరోధక చట్టం) లాగే ఇది కూడా దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉంటాయని, భర్తలను వేధించడానికి భార్యలు దీన్నో సాధనంగా వాడే ఆస్కారం ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.అంతే కాదు ఈ విషయంలో పాశ్చాత్య దేశాలు అవలంబించిన విధానాలను భారత్ గుడ్డిగా అనుసరించబోదని కూడా తెలిపింది. చిత్రం ఏమిటంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా… మారిటల్ రేప్ విషయంలో దాదాపు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాయి. పార్లమెంటులో కూడా మారిటల్ రేప్‌ను నేరం చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పాయి కూడా.అయితే కాలం చెల్లిన ఈ చట్టాలను మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఖండించడమే కాకుండా వైవాహిక అత్యాచారం అనే దానికి మినహాయింపును కూడా తొలగించాయి ప్రపంచంలో భర్త బలాత్కారాన్ని నేరంగా పరిగణించిన తొలిదేశం పోలండ్. 1932లో పోలండ్ ఈమేరకు చట్టం కూడా చేసింది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో ఈ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తున్నారు. 1991లో బ్రిటన్ కూడా దీనిని నేరంగా పరిగణించింది.. మన పొరుగునే ఉన్న చిన్నదేశమైన నేపాల్ కూడా 2002లో దీనిని నేరంగా ప్రకటించింది.
లింగ వివక్షకు ఇకనైనా చరమగీతం పాడాలని వైవాహిక అత్యాచారాన్ని రేప్ కిందనే పరిగణించాలని, అందుకు సరైన శిక్ష విధించాల్సిందేనని ఐక్యరాజ్యసమితి భారత్‌కు సూచించడం జరిగింది. పెళ్లాడిన భర్త అయినా మరొకరైనా మహిళ సమ్మతి లేకుండా సంభోగంలో పాల్గొంటే దాన్ని అత్యాచారంగా పరిగణించాలని ఐక్యరాజ్యసమితి కోరింది
మహిళలపై జరిపే హింసల్లో మారిటల్ రేప్‌ను కూడా చేరుస్తూ 1993లో ఐక్యరాజ్య సమితి ‘ఎలిమినేషన్ ఆఫ్ వాయలెన్స్ అగనెస్ట్ వుమెన్’ డిక్లరేషన్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఐరోపా మానవ హక్కుల సంఘం కూడా మారిటల్ రేప్‌ను హింసగా పరిగణించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. మరొక పక్క
2012లో మనదేశంలో నిర్భయ ఉదంతం అనంతరం క్రిమినల్ చట్టాలను సమీక్షించేందుకు నియమించిన జస్టిస్ జే.ఎస్.వర్మ త్రిసభ్య కమిటీ వైవాహిక అత్యాచారానికి గల మినహాయింపు తొలగించాలి అని ప్రభుత్వానికి సిఫారసు చేసింది అయినా ప్రభుత్వం నుంచి స్పందనలేదు.అయినా కూడా వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ న్యాయస్ధానాల్లో ఇంకా అనేక పిటిషన్లు న్యాయస్ధానాలు లో దాఖలు అవుతూనే ఉన్నాయి.
భర్తలు తమ భార్యలపై తమ అధికారాన్ని ఉపయోగించుకునే ఒప్పందంలో భాగంగా ఆ చట్టాలు పుట్టుకొచ్చాయి. కానీ, స్వాతంత్ర్యం వచ్చాక మనం రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం. అందులో సమానత్వం అనేది ఒకటి ఉంది.అది గుర్తించక పోతే ఎలా? మనిషంటే మనిషి. చట్టం అంటే చట్టం.అలాగే అత్యాచారం అంటే అత్యాచారమే, అది స్త్రీ పై అయినా భార్యపై పు భర్త చేసినా అత్యాచారమే అవుతుంది. ముఖ్యంగా అర్ధాంగిగా స్వీకరించిన మహిళ శరీరంపై ఆలోచనలపై భర్తలకు సంపూర్ణ హక్కులు దఖలు పడ్డాయనే భావన.. కచ్చితంగా తిరోగమన ఆలోచనే అవుతుంది.
ఏ శారీరక సంబంధానికైనా పరస్పర సమ్మతి అనేది మాతృక అని గుర్తెరిగిన నాడు మహిళపై ఈ తరహా వివక్షతలు కొనసాగవు.సంప్రదాయం పేరుచెప్పి సమాజంలో సగభాగంగా ఉన్నవారి హక్కులను గుర్తించ బోమనడం, వారిని బాధితులుగానే మిగల్చడం అనాగరికం అనిపించుకుంటుంది.
జనాభాలో సగంగా ఉన్న ఆడవాళ్లపై వివిధ రూపాల్లో అమలవుతున్న వివక్షను అంతమొందించడంపై దృష్టి పెట్టాల్సిన తరుణంలో చట్టపరంగా ఉన్న వివక్షను తొలగించడానికే ప్రభుత్వాలు సిద్ధం కాకపోవడం విచారకరం.న్యాయస్థానాలు చట్టానికి భాష్యం మాత్రమే చెబుతాయి… చట్టాలను చేయలేవు. ఆ పని చేయాల్సింది చట్టసభలు.అందుకే కర్ణాటక హై కోర్టు వివాహిత మహిళల మౌన రోధనను విని మినాహాయింపు రద్దు దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించమని ఆదేశాలు ఇచ్చింది.. ఈ సమయంలో మరలా వైవాహిక అత్యాచారంపై తిరిగి చర్చ ప్రారంభం అయ్యింది.
శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాల ద్వారా వివాహంతో మహిళల శరీరం, మనసు, ఆత్మలపై వారి భర్తలకు సర్వాధికారాన్ని ఇచ్చే ఈ మినహాయింపును న్యాయస్ధానాలు
తప్పు పట్టినపుడు దానికి పరిష్కారం వెతకాల్సిన బాధ్యత… అందుకవసరమైన మార్గాన్వేషణ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదే అవుతుంది. నా శరీరంపై సర్వహక్కులు నావే’ అనే నారీ నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతున్న నేటి ఆధునిక యుగంలో మారిటల్ రేప్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించడంలో భారత ప్రభుత్వం సంప్రదాయాలను ముడిపెట్టి తాత్సార్యం చేయడం సమంజసం కాదు. అయితేభర్తలకు ఇస్తున్న మినహాయింపు తొలగించడం ద్వారానే ఈ వైవాహిక రేప్‌లు సమసిపోవు. నైతిక, సామాజిక అవగాహన ఇక్కడ చాలా ముఖ్యం.దానికి ప్రభుత్వ చట్టాలే కాదు ప్రజల దృక్పధాలలో కూడా మార్పు రావాలి.
రుద్రరాజు శ్రీనివాసరాజు..9441239578.
లెక్చరర్..ఐ.పోలవరం..