Take a fresh look at your lifestyle.

వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

  • పూలు..విద్యుత్‌ ‌దీపాలతో అంలంకరించిన బాలాలయం
  • 21వతేదీ వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణ

‌యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్స వాలను స్వామి వారి బాలాలయంలో విశ్వక్సేనారాధనతో అర్చకులు, పారాయణికులు అత్యంత వైభవంగా ప్రారంభించారు. మొదటగా బ్రహ్మోత్సవాలు నిర్వహణకు స్వామి వారి ప్రధానాలయంలో స్వయం భూ స్వామివారి అనుమతిని అర్చకులు, అధికారులు, రుత్వికులు, పారాయణికులు స్వీకరించారు. కాగా, ఈ బ్రహ్మోత్సవాలు 21 వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం స్వస్తివాచనం, అంకురార్పణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో ప్రారంభం అయ్యాయి. 11 రోజులపాటు జరిగే ఉత్సవాలను స్వామివారి బాలాలయంలోనే నిర్వహించనున్నారు. ప్రధాన ఆలయం ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఈ యేడు కూడా బాలాలయంలోనే నిర్వహిస్తున్నారు. స్వామివారి ఉత్సవాలను సంప్రదాయం ప్రకారం జరుపనున్నారు. మంగళవారం ధ్వజారోహణం, వేదపారాయణం, భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు.

21న ఎదుర్కోలు, 22న స్వామివారి తిరు కల్యాణోత్సవం, 23న దివ్య విమాన రథోత్సవం, 25న శతఘటాభిషేకంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు. ఈ వేడుకల్లో 60 నుంచి 70 మంది పారాయణందార్లు, రుత్వికులు, ఆచార్యులు పాల్గొంటారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి బాలాలయాన్ని రంగురంగుల విద్యుత్‌ ‌దీపాలతో అలంకరించారు. స్వామివారి సేవలకు వినియోగించే వాహనాలను సిబ్బంది సిద్ధం చేశారు. బాలాలయాన్ని పూర్తిగా పూలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ పూజా కైంకర్యాలు నిర్వహించేందుకు బాలాలయంలో యాగశాలను ఏర్పాటు చేశారు. వేసవికాలం ప్రారంభం కావటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చలవ పందిళ్లు, తాగునీటి వసతులను కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో అలంకార సేవలకు విశిష్టత ఉంది.

స్వామి వారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్వామివారి అలంకార సేవలను చూసి తరిస్తారు. ఈ నేపథ్యం లో స్వామివారి అలంకార సేవలో వినియోగించే వాహనాలను సిబ్బంది ముస్తాబు చేశారు. మత్స్యవతారం, శేషావతారం, శ్రీకృష్ణాలంకారం(మురళీకృష్ణుడు), హంసవాహన, వటపత్రశాయి, పొన్నవాహన, సింహవాహనం, అశ్వవాహనం, హనుమంత వాహనం, గజవాహనం, గురుడ వాహనాలను రంగులతో ముస్తాబు చేశారు. ఈ నెల 16న నిర్వహించే ధ్వజారోహణ కార్యక్రమానికి ధ్వజస్తంభం, బలిపీఠాలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాలను పుర్కసరించుకుని ఈ నెల 16, 17, 18 తేదీల్లో పలువురు వైద్యుల సహకారంతో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహించనున్నారు. కొండకింద గల తులసీకాటేజీ, నృసింహ సదనంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply