పూర్తిగా వికటించిన మాట ఇది
స్మృతి పొరల్లోంచి వచ్చినదైనా
పదార్థంతో గర్భం దాల్చింది
మీరు వచ్చికూడా రాకను ఖూనీ చేసి
ఒక శూన్యంలో ఫ్రీజ్ చేసారు
మాట వినటానికున్న ఉత్సుకతను
ఏ రహదారి చెప్పలేదు
ఏ వ్యోమనౌక కనరాలేదు
రాత్రంతా ఒక్కటే పడిగాపులు
ఎప్పుడు పెల్లుబికుతుందోనని
అసహనంతో సహజీవనం చేసిన జాతి నాది
కిమ్మనక ఒక్కో ఆకును రెమ్మల్ని
లెక్కపెట్టొచ్చా కొన్నేళ్ళపాటు!
నిన్నా ఇవ్వాళ వచ్చిన మీరే సాధారణీకరణం చేస్తే
కొన్నేళ్ళు పరిశోధన చేసిన తీక్షణీకులు మరి
భావాలను ఒళ్ళంతా రోమాల్లా నిక్కబొడుచుకున్నా
భౌతికాన్ని కౌగిలించుకుని గాఢంగా
ఏదీ నాది కాదు నాకు రాదు మీరెన్ని చెప్పు
నలుగురి కళ్ళల్లో నాలుకల్లో చేతుల్లో
పరిమితమైన ప్రపంచం కాదు ఇది
చాపకింద నీరు…
తగలంగానే మొహాలు బుద్ధి విప్పారుతాయి
ఒప్పుకోలు విమర్శల ఆవలి పొరల్లో
అది అర్థమయినవారు నవ్వుతూ
తల నేలకేసి తన్మయత్వం చెందుతారు
చెప్పడం కలవడం ఇవన్నీ నెట్టివేయబడతాయ్
పరిచయాలు వెలివేయబడతాయ్
ఎదో అలా వచ్చి కలకలం రేపి పోయేది కాదు
అజరామరంగా తలకింద దిండై నిద్దురపుచ్చుతుంది
ఏ ఉన్నత శిఖర లోయల్లోనో తీసుకెళ్ళి వదిలేస్తుంది
ఇక పరిణామం చెందడమే మన వంతు
మరి ఆ మాట..!!?
– రఘు వగ్గు : 9603245215,మహబూబ్ నగర్, తెలంగాణ-509382