విమోచనం, విలీనం, సమైక్యం ..

‘‘ ‌తెలంగాణ విమోచనతో భారత్‌ ‌లో  విలీనం, విలీనంతో జాతి సమైక్యత సుసాధ్యం కావడం జరిగి పోయాయని గమనిస్తే తెలంగాణ జాతికి మంచిది. చరిత్రను మరిచి, వక్రీకరించే వక్ర బుద్ధులను  కర్రుతో వాత పెట్టాల్సిందే, వారి దుర్నీతిని బట్టబయలు  చేయాల్సిందే. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడిన యువ తెలంగాణ రాష్ట్రం భారతంలో దేదీప్యమానంగా, సస్యశ్యామలంగా, శాంతియుతం సహజీవనంతో వెలగాలని కోరుకుందాం. ’’

17 సెప్టెంబర్‌ 1948 ‌రోజున తెలంగాణ స్వాతంత్య్ర పొంది, నిజామ్‌ ‌పాలనకు చర్మ గీతం పాడి, రజాకార్ల కబంధ హస్తాల్లోంచి విముక్తమై, భారతంలో విలీనమై, సువిశాల దేశంలో కలిసి సమైక్య భారతంలో భాగంగా స్వేచ్ఛను అనుభవిస్తున్నది మన నవ యువ తెలంగాణ రాష్ట్రం. వాస్తవ చరిత్రను మరిచిన రాజకీయ నాయకులు చరిత్రకు వక్రభాష్యం చెపుతూ విమోచనం కాదు, విలీనం, సమైక్యం అంటూ పార్టీలు తమ తమ భవితవ్యాలను రచించుకునే కుయుక్తులు పన్నుతున్న వేళ అచ్చ తెలంగాణ అభిమానులు నివ్వెరపోతున్న సందర్భమిది. నాటి నిజామ్‌ ‌పాలనలో నలిగిన పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర ప్రాంతం ‘మరట్వాడా విముక్త దినం’, కర్నాటక ప్రాంతం ‘హైదరాబాద్‌-‌కర్నాటక విముక్త దినం’ పాటిస్తుండగా మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం విలీనమని, సమైక్యమని జపం పాడడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ విముక్త పోరులో అనేక తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా 1948 సెప్టెంబర్‌ 13-17 ‌మధ్య జరిగిన ‘పోలీస్‌ ఆక్షన్‌’‌లో 10 మంది భారత సైనికులు, 807 మంది నిజామ్‌  ‌సైనికులు, 1,373 మంది రాక్షస రజాకార్లు మరణించారు. ఈ పోరాటంలో 1,647 పౌరులు/సైనికులు, దాదాపు 2,000 మంది రజాకార్లు గాయపడడం జరిగింది. నాటి విమోచన ఉద్యమంలో దాదాపు 40,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆనాడు నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సుందర్లాల్‌ ‌కమిటీ’ నివేదిక 2013లో విడుదలై వాస్తవ విషయాలను తెలుపుతున్నది. ఈ తెలంగాణ విమోచన పోరులో 2 లక్షల ప్రాణాలు కోల్పోయి ఉంటారని అభిప్రాయపడే వారు కూడా ఉన్నారు.
భారతదేశం 15 ఆగస్ట్ 1947‌న స్వాతంత్య్ర పొందగా, నాటి నిజామ్‌ ‌పాలనలో తెలంగాణ ప్రాంతం మానభంగాలు, సామూహిక హత్యలు, దోపిడీలు, దుర్మార్గాల మధ్య నలుగుతూనే ఉన్నది. నాటి నిజామ్‌ ‌పాలిత ‘హైదరాబాద్‌ ‌స్టేట్‌ (‌ప్రిన్స్లీ స్టేట్‌)’ ‌మాత్రం ఇండియాలో విలీనం చేయడానికి నిజామ్‌ అం‌గీకరించకుండా స్వతంత్ర దేశంగా ఉండడానికి నిజామ్‌ ‌పాలకులు నిర్ణయించారు. నాటి స్వతంత్ర భారతంలో 584 ప్రిన్స్లీ స్టేట్స్ ఉం‌డగా, వాటిని ఇండియా లేదా పాకిస్థాన్లో విలీనం కావడానికి బ్రిటీష్‌ ‌పాలకులు స్వేచ్ఛను ఇవ్వడం జరుగగా వీటిలో అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ‌విలీనాలకు అంగీకరించగా ఒక్క నిజామ్‌ ‌పాలిత హైదరాబాదు స్టేట్‌ ‌మాత్రం భారత్లో స్వచ్ఛందంగా విలీనం కావడానికి అంగీకరించ లేదు. దీని కారణంగా తెలంగాణ ప్రజలు భీకర సాయుధ పోరాటం చేయడం చూసాం. నాటి తెలంగాణ సమాజం నిజామ్‌ ‌నిరంకుశ పాలనకు, రజాకార్ల రాక్షస అరాచకాలకు, భూస్వాముల (43 శాతం భూముల యజమానులైన జమీందార్లు, దేశ్ముఖ్లు) ఆగడాలకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేస్తూ తిరగబడ్డ ఘన చరిత్ర మరిచిపోలేనిది. నాటి స్వతంత్ర భారత హోంశాఖ మంత్రి సర్దార్‌ ‌వల్లాబ్‌ ‌భాయ్‌  ‌పటేల్‌ ‌చొరవతో 13 – 17 సెప్టెంబర్‌ 1948 ‌మధ్య 30,00 మంది భారత సైన్యం (పోలీస్‌ ఆక్షన్‌) ‘ఆపరేషన్‌ ‌పోలో’ను ప్రయోగించి దండయాత్ర చేయడంతో నిజామ్‌ (‌పాలనలోని 20,000 నిజామ్‌ ‌సైన్యం, దాదాపు 2 లక్షల రజాకార్లు/అరబ్స్/‌రోహిల్లాస్‌/‌పఠాన్స్/ఉత్తర భారత ముస్లిమ్స్) ‌పాలకులు ఓటమిని అంగీకరించడం, 17 సెప్టెంబర్‌ 1948‌న నిజామ్‌ ‌దుర్మార్గ పాలనకు చర్మ గీతం పాడడం, నిజామ్‌ ‌మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌నేతృత్వ పాలకులు తోక ముడవడం చకచక జరిగి పోయాయి. 1941 గణాంకాల ప్రకారం నిజామ్‌ ఆర్మీలో 53 శాతం ముస్లిం సైనికులు ఉండగా, 1,765 మంది ఆర్మీ అధికారుల్లో 1,268 మంది వరకు ముస్లిమ్లు ఉండేవారు.
నాటి నిజామ్‌ ‌పాలనలో ఉన్న 9 తెలుగు మాట్లాడే తెలంగాణ జిల్లాలు, కర్నాటకకు చెందిన గుల్బర్గా ప్రాంతపు 4 కన్నడ జిల్లాలు, మరాటీ మాట్లాడే మహారాష్ట్రకు చెందిన ఔరంగాబాదు ప్రాంత 4 జిల్లాలు తీవ్రమైన హింసాయుత నిజామ్‌ ‌పాలనను అనుభవించాయి. 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడడంతో తెలంగాణలో 10 జిల్లాలు అయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత నేడు 33 జిల్లాలతో పాలన సాగుతోంది. నాటి బహుభాషల హైదరాబాదు స్టేట్లో 48 శాతం తెలుగు ప్రజలు, 26 శాతం మరాఠీలు, 12 శాతం కన్నడీలు, 10 శాతం ఉర్దూ మాట్లాడే వారు ఉండే వారు. హైదరాబాదు స్టేట్‌ ‌భారత్లో విలీనం కానట్లయితే ఈ ప్రాంతం పెద్ద శాశ్విత సమస్యగా మారుతుందని సర్దార్‌ ‌పటేల్‌ ‌తో పాటు నాటి న్యాయశాఖ మంత్రి బి ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌కూడా అభిప్రాయపడడం జరిగింది. హైదరాబాదు స్టేట్‌ ‌నిజామ్‌ ‌పాలకుల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ బలవంతంగా లొంగదీసుకునే చర్యలు తీసుకున్నట్లయితే ముస్లిం సమాజం నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని మహమ్మద్‌ అలీ జిన్నా హెచ్చరించడం జరిగినట్లు చారిత్రక రుజువులు ఉన్నాయి. నాటి నిజామ్‌ ‌పాలకులు స్వతంత్ర దేశంగా ఉంటామని బ్రిటీష్‌ ‌పాలకులతో పాటు ఐరాస సహాయాన్ని కూడా అర్థించడానికి విఫలయత్నం చేశారు. దీనికి లార్డ్ ‌మౌంట్‌ ‌బాటెన్‌ అం‌గీకరించక పోవడం, భారత ప్రభుత్వం హైదరాబాదు స్టేట్‌ ‌సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించడంతో జరిగింది.
తెలంగాణ నిజామ్‌ ‌పాలన నుంచి విముక్తమైన భారత్‌ ‌లో విలీనమైన తరువాత తొలి ప్రభుత్వంగా ఉన్నత అధికారి యం. కె. వెల్లోడి తొలి ముఖ్యమంత్రిగా 26 జనవరి 1950న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. 1952లో ప్రజాస్వామ్యయుతంగా డా: బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా 1952లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితెలంగాణ స్వతంత్ర వాయువులను పీల్చడం జరిగింది. 1952లో తెలుగు మాట్లాడే 22 జిల్లాల్లో 9 నిజామ్‌ ‌పాలిత హైదరాబాదు ప్రాంతంలో ఉండగా 12 జిల్లాలు మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ లేదా నేటి ఆంధ్ర ప్రాంతంలో ఉండగా, మరొక జిల్లా ఫ్రెంచ్‌ ‌పాలిత యానాంగా ఉండేవి. పొట్టి శ్రీరాములు కృషితో మద్రాస్‌ ‌స్టేట్‌ ‌నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం 1953లో కర్నూల్‌ ‌కేంద్రంగా ఏర్పడింది. భాషాప్రయుక్త రాష్ట్రాల భావనతో ఆంధ్ర, తెలంగాణను కలిపి ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్రం ఏర్పడడం, ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రుల అన్యాయ పాలనకు గురైన తెలంగాణ వాసులు ‘నాన్‌ ‌ముల్కీ’, ‘గోంగూర గో బ్యాక్‌’ అం‌టూ నినదిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలుసు.
సుదీర్ఘ పోరాట నేపథ్యంలో 15 ఆగస్టట్‌న భారతమాతకు స్వాతంత్య్రం సిద్ధించగా , తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 17 సెప్టెంబర్‌ ‌న  పోలీస్‌ ఆక్షన్‌తో  విమోచన లభించడం జరిగిందని చెప్పుకోవడానికి వెనుకంజ వేస్తున్న వర్గాల స్వార్థ రాజకీయాలను సామాన్య జనం గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ విమోచనతో భారత్‌ ‌లో  విలీనం, విలీనంతో జాతి సమైక్యత సుసాధ్యం కావడం జరిగి పోయాయని గమనిస్తే తెలంగాణ జాతికి మంచిది. చరిత్రను మరిచి, వక్రీకరించే వక్ర బుద్ధులను  కర్రుతో వాత పెట్టాల్సిందే, వారి దుర్నీతిని బట్టబయలు  చేయాల్సిందే. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడిన యువ తెలంగాణ రాష్ట్రం భారతంలో దేదీప్యమానంగా, సస్యశ్యామలంగా, శాంతియుతం సహజీవనంతో వెలగాలని కోరుకుందాం.
image.png
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page