విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే అకృత్యాలు

“తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు. ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.”

విమర్శలకు కూడా ఓ హద్దు ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా ఏదిపడితే అది విమర్శలు చేయడం సరికాదు. అత్యాచార ఘటనలపై సహజంగానే విపక్షాలు విమర్శలు సంధిస్తాయి. ఎందుకంటే వారికి ఉన్న వాయిస్‌ అది. అత్యాచారం చేసేవాడికి ప్రభుత్వం ఏది ఉందన్నది అసవరం లేదు. కన్నూమిన్ను గానక వాడుచేసేది చేస్తాడు. అయితే ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. కానీ విపక్ష టిడిపి వాళ్ల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. బాధ్యతాయుతమైన హోంమంత్రి పదవిలో ఉన్న తానేటి వనిత వ్యాఖ్యానించడం సరికాదు. అత్యాచారాలు చేసేవాడికి టిడిపి, వైసిపి అన్నది ఉండదు. కానీ మంత్రిగా అందునా ఓ మహిళగా జాగ్రత్తగా మాట్లాడాల్సిఉంటుంది.

రాజకీయ విమర్శలకు కూడా ఓ హద్దు ఉండాలి. అధికార పక్షం, విపక్షం అన్న తేడా లేకుండా ఏదిపడితే అది విమర్శలుచేసుకోవడం ద్వారా సమస్యలను పక్కదారి పట్టించరాదు. రేపిస్టులకు కఠిన శిక్షలు పడితే ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవు. ప్రభుత్వం తాము కఠినంగా ఉన్నామని అనుకుంటే సరిపోదు. కఠినంగా ఉంటున్నారన్న సందేశం ప్రజల్లోకి వెళ్లాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగవు. అలా చేయాలనుకున్న వారు కూడా జంకుతారు. అక్రమాలు, అకృత్యాలపై ప్రభుత్వాలు ఉదాసీనం గా ఉండడం వల్లనే దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. అవి ఒక్క ఎపిలోనే జరుగుతున్నాయని చెప్పడానికి లేదు. తెలంగాణతో పాటు ఘనత వహించిన యూపిలో కూడా జరుగుతూనే ఉన్నాయి.

గొప్పలుచెప్పుకుంటున్న కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న కేరళలోనూ జరుగుతున్నాయి. రాక్షసులకు ప్రాంతం ఏదన్నది ముఖ్యం కాదు. రాక్షస ప్రవృత్తి ఉన్నవారు ప్రపంచమంతా నిండి ఉన్నారు. వారికి కఠిన శిక్షలు అమలు చేయాల్సి ఉంది. విపక్షలు కూడా అధికార పక్షాన్ని విమర్శిం చడం, రాజకీయ లబ్దికోసం నానాయాగీ చేయడం సరికాదు. ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టి సంఘటన జరిగినప్పుడు ఉమ్మడిగా ఎలా ముందుకు వెళ్లాలన్న ఆలోచనచేయాలి. ఇకపోతే ఇటీవల ఎపిలో చోటు చేసుకుంటున్న సామూహిక అత్యాచార ఘటనలను చూస్తే సామాన్యలకు కూడా భయమేస్తోంది. బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలన్నింటికి మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకం అన్నది ప్రధాన కారణమవుతోంది. ఆయా ఘటనల్లో నిందితులు పూటుగా మద్యం సేవించి.. ఆ మైకంలో ఉచ్ఛనీచాలు మరచి దుశ్చర్యలకు తెగబడుతున్నారు.

మద్యం, గంజాయి విచ్చల విడిగా లభిస్తుం డటంతో ఆ మైకంలో పైశాచికత్వానికి ఒడిగడుతున్నారు. అత్యాచార ఘటనల్లో అరెస్టవుతున్న నిందితుల్లో 60 శాతం మంది వరకూ మద్యం మత్తులో ఉన్నప్పుడే ఆ పైశాచిక చర్యకు పాల్పడుతున్నట్లు వెల్లడవుతోంది. మద్యం విచ్చలవిడిగా అమ్మడం,మాదక ద్రవ్యాల విషయంలో కఠిన చర్యలు తీసుకోక పోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో పాలకులు గుర్తించాలి. మత్తులో పేట్రేగుతున్న ఉన్మాదులు.. వరుసగా సామూహిక అత్యాచార ఘటనలకు పాల్పడుతున్న తీరును ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచన చేయాలి.  ఆంధప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనల నిరోధానికి ఉమ్మడిగా పోరాడాలి. పరస్పర విమర్శలకు దిగడం సరికాదు. మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే.. తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు.

ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి ఫలానా వారు ప్రభుత్వంలో ఉన్నారు కనుక వారే బాధ్యులని నిందించలేం. ఎందుకంటే వారు చేసే అకృత్యాలకు అధికారపార్టీ వారు లైసెన్స్ ఇవ్వలేదు. వారు మద్యం మత్తులో చేసే ఘటనలు కనుక మద్యం అమ్మకాలపై ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు వేయాలి. మత్తులో ఉన్నవారికి విచక్షణ ఉండదు. తమ చర్యలపై నియంత్రణ ఉండదు. పశువాంఛ బయటపడే  క్రమంలో అమానుష చర్యలకు తెగబడుతుంటారు. అలాంటి సందర్భాల్లో బాధితులు ఎవరైనా వారిని ఎదిరించినా, వారి నుంచి తప్పించు కోవటానికి ప్రయత్నించినా మరింత రెచ్చిపోతారు. హింసాత్మక చర్యలకు దిగుతారు. వీటిని  మానసిక నిపుణులు కూడా అంగీకరిస్తు న్నారు. మద్యం మత్తులో ఉండే వ్యక్తికి అదే మైకంలో ఉన్న మరో ఇద్దరు, ముగ్గురు తోడైతే వారి పశుత్వా నికి అడ్డూ అదుపు ఉండదు.

అలాంటి సందర్భాల్లో వారికి నిస్సహాయంగా, ఎదురించలేని స్థితిలో మహిళలు ఎవరైనా కనిపిస్తే అఘాయిత్యానికి తెగబడతారు. తాను ఒక్కడినే కాదని.. తనతో పాటు మరి కొందరు ఉన్నారన్న భరోసాతో మరింతగా రెచ్చిపోతారు. తమవల్ల వారికి ఏమవుతుందో అన్న భయం కానీ..తరవాత తామేవుతామో అన్న ఆలోచనకానీ ఆ సమయంలో ఉండదు. మత్తులో ఉన్న వారిలో దూకుడు స్వభావం, విపరీత ధోరణి ఉంటుంది. ఇదే నేరాలకు దారి తీస్తోంది.విపరీత ప్రవర్తన, సమాజంపై ద్వేష భావం ఉండేవారికి మద్యం మత్తు తోడైతే అది తీవ్రమైన నేరాలకు కారణమవుతుంది. వరుస ఘటనల నేపథ్యంలో పాలకులు కూడా కారణాలు ఆరా తీయాలి. అరికట్టే మార్గాలు ఆలోచించాలి. అకృత్యాల కట్టడికి ఏం చేయాలన్నది చర్చించాలి. విపక్షాలు కూడా తమకు మంచివని భావించిన సలహాలను ఇవ్వాలి. ఇలాంటి ఘటనలు మళ్లీమళ్లీ జరక్కుండా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి కఠిన చర్యలకు దిగాలి. మహిళలపై లైంగిక నేరాలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో మద్యం మత్తులో ఉన్నవారెందరన్నది గణాంకాలు తీయాలి. అలాగే ఎక్కడపడితే అక్కడ మద్యం లభిస్తోంది. దీనికి తోడు  గంజాయి లభ్యత కూడా పెరిగింది. చెడు సావాసాలతో మత్తులో మునిగి నేరాలకు పాల్పడుతున్నారు. దీనికంతటకీ నిరుద్యోగం, పనులు లేకపోవడం కూడా కారణంగా చూడాలి. ఇవన్నీ అరికట్టేందుకు ఏం చూయాలో ఆలోచించి ముందుకు కదిలితేనే నేరాలను అరికట్టగలం.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *