రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టిఆర్‌ఎస్‌ ‌నిరసనలు

  • ధాన్యం కొనేవరకు పోరు ఆగదన్న మంత్రులు
  • ఇండ్లపై నల్ల జెండాలు ఎగగురేసి నిరసన
  • గ్రామాల్లో ర్యాలీలతో ఆదోళన

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లాలవ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంపై టీఆర్‌ఎస్‌ ‌పోరాటాన్ని ఉధృతం చేసింది. పల్లె, పట్టణం, ఊరు, వాడను ఏకం చేస్తూ తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ ‌చేస్తూ పోరాటాలకు దిగింది. టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం పట్టణ, గ్రామాల్లో రైతులు, పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బైక్‌ ‌ర్యాలీలు నిర్వహించారు. మోదీ దిష్టి బొమ్మలు దహనం చేస్తూ..శవయాత్రలు నిర్వహించారు. బీజేపీ వ్యతిరేకంగా గ్రామాల్లో నల్ల జెండాలు ఎగుర వేస్తూ ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తూ టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా శుక్రవారం వేల్పూర్‌ ‌మండల కేంద్రంలోని తన ఇంటిపై మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి నల్ల జెండా ఎగరవేశారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అలాగే తన ఇంటిపై మంత్రి గంగుల కమలాకర్‌ ‌నల్ల జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీసం బీజేపీ రైతుల కోసమైనా ధాన్యం కొనాలన్నారు. బండి సంజయ్‌, ‌కిషన్‌ ‌రెడ్డి కొనుగోళ్ల బాధ్యతను తీసుకోవాలన్నారు.

ఇన్ని ఆందోళనలతో అయినా కేంద్రం కళ్లు తెరవాలన్నారు. హర్యానా, పంజాబ్‌ ‌కంటే ఇంకా తీవ్రంగా రైతు ఉద్యమం చేస్తామన్నారు. పట్టణ, గ్రామాల్లో రైతులు, పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కొన్ని చోట్ల రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో గ్రామాల్లో బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నల్ల జెండాలు రెపరెపలాడుతున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ కేంద్ర వైఖరికి నిరసనగా రైతుల పక్షానా మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి తన నివాసంపై నల్లజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణికి నిరసనగా ఈ నల్లజెండాను ఎగురవేశామన్నారు. సిఎం కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నల్లజెండాలను ఎగురవేసి రైతులకు సంఘీభావం తెలపాలని కోరారు. తెలంగాణ రైతన్నలు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్షను వీడనాడాలని డిమాండ్‌ ‌చేశారు. వడ్లు కొనేదాకా రైతుల తరపున కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఊరూరా ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేయాలని, గ్రామకూడళ్లలో కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసి దిల్లీ వరకు ఈ నిరసన సెగలు తాకేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నిరసన కార్యక్రమంలో భాగంగా నల్లగొండలోని తన నివాసంపై ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ ‌రెడ్డి ఉదయాన్నే నల్లజెండా ఎగుర వేశారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ ‌రెడ్డి నల్లజెండా ఎగురువేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఆర్మూర్‌లో టిఆర్‌ఎస్‌ ‌భారీ ర్యాలీ… నల్లజెండాలతో పార్టీ శ్రేణుల నిరసన
తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పిలుపు మేరకు.. పార్టీ శ్రేణులు, రైతులు స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా జిల్లాలోని ఆర్మూర్‌లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ ‌ర్యాలీ నిర్వహించారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో ఆర్మూర్‌ ‌పురవీధుల్లో ర్యాలీ తీశారు. నల్ల జెండాలు చేతపట్టుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కేంద్రం ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని నినదించారు. కేంద్రం వడ్లు కొనేవరకు కొట్లాడుదామని, ఇందుకు రైతులంతా సన్నద్ధం కావాలని జీవన్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.

బిజెపి నేతలు దమ్ముంటే ధాన్యం కొనిపించాలి : నిజామాబాద్‌ ‌జిల్లా నరసనలో మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వ తన వైఖరిని మార్చుకొని ప్రస్తుత యాసంగిలో రైతులు పండించిన ప్రతి వడ్లగింజను కొనుగోలు చేయాలని మంత్రి వేముల ప్రశాంత రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. కేందప్రభుత్వ తీరును రైతులు గమనిస్తున్నారని, అదనుచూసి తగిన విధంగా సమాధానం చెబుతారన్నారు. ఈనెల 11న ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. శుక్రవారం గ్రామాల్లో ప్రతి ఇంటిపై నల్లజెండా ఎగురవేసి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించి తన ఇంటిపైనా మంత్రినల్లాజెండా ఎగురేశారు. ఈ సందర్బంగా కేంద్రం వైఖరపై మండిపడ్డారు. ప్రత్యేకించి కేందరమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. ఉప్పుడు బియ్యంపై విపరీత వ్యాఖ్యలు చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు నూకలు తినడం అలవాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ అనడం ఆయన అహంకార పూరిత ధోరణికి నిదర్శనమని అన్నారు. కోటి 80లక్షల మంది రైతులు టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వెంట ఉన్నారని, రాష్ట్రంలో బీజేపీ స్థానం కోల్పోతుందన్న భయంతో రైతులపై కుట్ర రాజకీయం చేస్తోందని వివరించారు. రైతుపక్షాన జరిగే ఈ పోరాటానికి అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page