రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వార్ నడుస్తోంది. ధర్నాలు, ర్యాలీలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది. విచిత్రమేమంటే అధికారపక్షం, ప్రతిపక్ష పార్టీలు ఏకకాలంలో ఉద్యమిస్తుండడంతో ఎవరు ఎవరిమీద దండయాత్ర చేస్తున్నారన్నది అయోమయంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు బర్నింగ్ టాపిక్స్‌పైన తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏ టివి చానల్ తిప్పినా, ఏ రాజకీయ వేదికపైన విన్నా ఈ రెండే ప్రధానాంశాలుగా వినిపిస్తున్నాయి. అందులో గవర్నర్ అధికారాలు, రాజ్యాంగం తదితర అంశాలపై ఒక పక్క చర్చ జరుగుతుండగా, గత సంవత్సరంనుండి కొనసాగుతున్న వరి కొనుగోలు అంశం మరో పక్క రణరంగంగా మారింది. విచిత్రమేమంటే ఈ రెండు అంశాలుకూడా కేంద్ర ప్రభుత్వంతో ముడివడి ఉన్నవేకావటం.
మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి సంబందించి గవర్నర్‌ను ప్రథమ పౌరుడిగా పరిగణిస్తాం. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా జరిగే ఏ కార్యకలాపాలైనా గవర్నర్ ఫర్మానాతో మొదలు కావాల్సిందే. గవర్నర్ ఆమోద ముద్ర పడిన తర్వాతే ఏ పథకమైనా ప్రజల ముందుకు చేరుతుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమోధ్య ఉన్నంతవరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాలు సాఫీగా జరుగుతుంటాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఏ గొడవ ఉండదు. వొచ్చిన చిక్కల్లా కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరోపార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో విపరీత ధోరణులు మొదలవుతున్నాయి. ఆయా పార్టీల ఆధిపత్య పోరులో గవర్నర్‌లు పావులుగా మారుతున్నారు. తమకు అనుకూలంగాలేని రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లద్వారా అదుపుచేసేందుకు ప్రయత్నిస్తుందనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తోక జాడించినప్పుడు వారితోక కట్ చేసేందుకు కేంద్రానికి గవర్నర్ వ్యవస్థ బ్రహ్మాస్త్రంగా మారుతున్నది. ఏడు దశాబ్ధాల స్వతంత్ర భారత్ లో ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా పాలన సాగించిన కాంగ్రెస్‌ను కాదని, కేవలం తొమ్మిది నెలల కాలంలోనే కొత్త పార్టీ (తెలుగుదేశం)తో అధికారం చేపట్టిన ఎన్‌టి రామారావు రాజకీయ పతనం ఎలా జరిగిందో తెలియందికాదు. మన రాష్ట్రానికే చెందిన రాజకీయ ఉద్దండుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తమిళనాడు గవర్నర్‌గా తీసుకున్న నిర్ణయాలతో ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నది తెలిసిందే. అంతెందుకు తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఈ రెండు వ్యవస్థల మధ్య కొనసాగుతున్న విభేదాలు తెలియందికాదు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వొచ్చిన తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాల గవర్నర్లు మారారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాత్రం రెండు రాష్ట్రాలు విడిపోయినా ఉమ్మడి గవర్నర్‌గా కొంతకాలం కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కేంద్రానికి తప్పుడు సమాచారం అందిస్తున్నాడన్న అపకీర్తిని ఆయనపై ఉండింది. కేవలం తెలంగాణ రాష్ట్రానికే గవర్నర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు అయనతో సత్‌సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రతీ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకుపోవడం, ఆయన సలహాలు, సూచనలను తీసుకోవడం జరుగుతూ ఉండింది. ఒక విధంగా అరమరికలు లేకుండా వారి సంబంధాలు సాగాయి. ఇప్పుడు అదే విషయాన్ని తెరాస నేతలు గుర్తు చేస్తున్నారు. తాము గవర్నర్‌కు ఎలాంటి మర్యాద ఇవ్వాలో ఇస్తున్నామని అంటున్నారు. కాని గవర్నర్ తమిళ సై మాత్రం తాను ఇటీవల అనేక అవమానాలపాలైనట్లు చెబుతోంది.
గత గవర్నర్‌తో వ్యవహరించినంత సన్నిహితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంలేదని, కనీస సమాచారం కూడా అమెకు లేకుండా పోయిందని ప్రతిపక్షాలు నిత్యం గోల చేస్తూనే ఉన్నాయి. తమిళి• సై తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ళలో రాష్ట్రంతో సంబంధాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే కేంద్రంపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కాలుదువ్వడం మొదలయిందో అటు కేంద్ర, రాష్ట్ర సంబంధాల మాదిరిగానే ప్రగతి భవన్, రాష్ట్రపతి భవన్ సంబంధాలు చెడుతూ వచ్చాయి. ఎంఎల్సీ అభ్యర్థి సిఫారసు విషయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వొచ్చాయని చెబుతున్నప్పటికీ, అంతర్ఘతంగా మరేవో విషయాలు దాగి ఉండవొ చ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కొంతవరకు గవర్నర్ తనకు జరిగిన అవమానాన్ని కేంద్రానికి ఏకరువు పెట్టినప్పటికీ, కెసిఆర్ నోరు విప్పేంతవరకు గవర్నర్‌తో వొచ్చిన వివాదానికి అసలు కారణమేంటన్నది బహిర్ఘతం కాదు.
తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా కొనసాగిన తమిళి సై సౌందరాజన్‌కు పాత వాసనలు ఉన్నాయని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కెటిఆర్ ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో దశాబ్దాలుగా పనిచేసి, గవర్నర్‌లుగా బాధ్యతలు చేపట్టినా వారిలో పార్టీ అభిమానం ఉండక •పోదంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా. ఏదిఏమైనా మనం రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరముంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాల్సిందే. కేవలం గవర్నర్‌గానే కాకుండా మానవత్వంతో తప్పనిసరి పరిస్థితుల్లో, తప్పనిసరి అవసరాలకు రవణాతోపాటు ఇతర సదుపాయాలను కల్పించాల్సిన కనీస బాధ్యతను రాష్ట్రప్రభుత్వం మరువరాదు.