రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి

రాష్ట్రంలోరాజకీయ పార్టీల హడావుడి పెరిగింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజా క్షేత్రంలోకి పరుగులు పెడుతున్నాయి. ఒక విధంగా ముందస్తు ఎన్నికలకు ఈ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయా అనిపిస్తున్నది. రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలకు అవకాశంలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించినప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్నట్లుగానే ఉంది. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తాజాగా బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు భారీ కేటాయింపులు, కెసిఆర్‌, ‌కెటిఆర్‌) ‌సుడిగాలి పర్యటనలు ఆ దిశగా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిశోర్‌తో చర్చలు, మరో పక్క బిజెపిపై ఒక విధంగా యుద్ధం ప్రకటించడం లాంటి పరిణామాలు నిర్ణీత సమయంకన్నా ముందస్తుగా ఎన్నికలు జరుగవచ్చన్న అనుమానాలకు తావేర్పడుతున్నది. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందన్న వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ప్రశాంత్‌కిశోర్‌తో చేయించిన సర్వేలు అనుకూలంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదికాకుండా ప్రైవేటు సర్వేలుకూడా మరోసారి ప్రజలు టిఆర్‌ఎస్‌కే పట్టం కడుతాయని చెప్పినట్లు సాక్షాత్తు సిఎం కెసిఆరే చెప్పడం గమనార్హం. గతంలో కూడా 2019లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా 2018లో ముందస్తుగా ఎన్నికలకు పోవడం వల్ల టిఆర్‌ఎస్‌ ‌మంచి మెజార్టీని సాధించిన విషయం తెలియందికాదు,  ఇప్పుడు 2023లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగాల్సి ఉంది. కాని ముందస్తుగానే ఎన్నికలకు వెళ్ళడంద్వారా గత ఎన్నికల ఫలితాలే పునరావృతం కావచ్చన్ననమ్మకం పార్టీవర్గాల్లో ఉంది. అంతేకాకుండా కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లు ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు విధానం అమలుజరిపితే కేంద్ర రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగిన పక్షంలో ఫలితాలు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఉంటా యన్న అభిప్రాయం టిఆర్‌ఎస్‌ ‌వర్గాల్లో ఉంది.

ఇదిలా ఉంటే పిసిసి మాజీ ప్రసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకావాలున్నాయని గంటాపథంగా చెబుతున్నారు. ఇదిలాఉంటే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిఆర్‌ఎస్‌ ‌కేంద్రంపైన దూకుడుగానే వ్యవహరిస్తోంది. కేంద్రం తప్పిదాలపై నిలదీస్తే తప్ప రాష్ట్రంలో బిజెపి దూకుడు దగ్గదన్న భావనతోనే ఇటీవల కాలంలో కేంద్రంపై కాలుదువ్వుతున్నట్లు కనిపిస్తున్నది.  వరి ధాన్యం సేకరణ అంశంపై గల్లీ నుండి ఢిల్లీ వరకు కార్యక్రమాలను చేపట్టడంద్వారా ప్రజలముందు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నంచేశారు కెసిఆర్‌. అయితే కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తామన్న కెసిఆర్‌ ‌ఢిల్లీ దీక్షలో తామే కొంటామని ప్రకటించడం బిజెపిదే పై చెయ్యి అయినట్లు అయింది. కాగా, రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ ఏప్రిల్‌ 14 ‌నుండి చేపట్టిన రెండవ విడుత ప్రజా సంగ్రామ యాత్రలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తాము ముందుగా ప్రకటించినట్లే రాష్ట్ర ప్రభుత్వంతోనే ధాన్యాన్ని కొనిపించడంలో విజయం సాధించామని ప్రచారం చేస్తున్నారు.

అంతేగాక కెసిఆర్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాకముందునుండి ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని పూర్తి చేయలేక పోవడాన్ని కూడా ప్రజల ముందు ఏకరువు పెడుతూ తమ పార్టీకి ప్రజా మద్దతను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌కూడా ఇప్పటినుండే ఎన్నికల సంగ్రామానికి సమాయత్త మవుతున్నది. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు ఖమ్మంలో పాదయాత్రలు చేపట్టగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు.  ఈ సందర్భంగా  ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని ఏకరువు పెడుతూ, సుపరిపాలను కాంగ్రెస్‌ ఒక్కటే ప్రత్యమ్నాయం అని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. బిజెపి, టిఆర్‌ఎస్‌లు పరస్పరం తిట్టుకుంటున్న ఎన్నికలనాటికి ఈ రెండు పార్టీలు ఒకటవుతాయంటూకూడా ప్రచారం చేస్తోంది కాంగ్రెస్‌.  ‌కాగా వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల గత రెండు నెలలుగా తెలంగాణ అంతటా పర్యటిస్తూ కెసిఆర్‌ ‌తప్పులను ఎత్తి చూపుతోంది.

ఏ సమస్యకైనా కుర్చీ వేసుకుని కూర్చుని పరిష్కరిస్తానని చెప్పే కెసిఆర్‌ ఇం‌త వరకు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదంటూ ఆమె పాదయాత్ర సందర్భంగా స్థానిక సమస్యలపై ఎలుగెత్తుతోంది. కేంద్రంతో వరి కొనుగోలు చేయిస్తానంటాడు, వరి వేసుకోవద్దంటాడు, మరోసారి తానే వరి కొంటానంటాడు. ఇలా పూటకు ఒకరకంగా మాట మారుస్తున్న వ్యక్తిని ఎలా నమ్మాలంటూ కెసిఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది షర్మిల. ఈసారి ఎన్నికలకు తాను సిద్దమే అని తెలిపుతున్నట్లుగా జనసేన పార్టీకూడా రాష్ట్రాన్ని చుట్టుముట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లానుండి ఆ పార్టీ అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌పర్యటించే కార్యక్రమాన్ని  రూపొందిస్తున్నారు.

గత ఎన్నికల్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం వల్ల అభ్యర్ధులను గెలిపించుకోలేక పోయామని, అందుకే ఈసారి ముందస్తుగానే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ పార్టీ వర్గాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ ప్రాంతమన్నా, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలన్నా పార్టీ అధినేత చాలా ఇష్టపడుతాడని, ఈ ప్రాంత పోరాట యోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పవన్‌ ‌కళ్యాణ్‌ ‌పార్టీ వర్గాలకు పిలుపునివ్వడం చూస్తుంటే ఈసారి తెలంగాణలో రాజకీయ రంగంలో రసవత్తరమైన పోటీ ఉండేట్లు కనిపిస్తున్నది.

Manduva-Ravinder-Rao
గెస్ట్ ఎడిట్
మండువ రవీందర్ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page