నేడు ‘ప్రపంచ రక్తపోటు దినం’
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.13 బిలియన్ల ప్రజలు అధిక రక్త పోటు (హైపర్‌టెన్షన్ లేదా బ్లడ్ ప్రెజర్) రుగ్మతతో బాధ పడుతున్నారని గమనించిన ‘వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్’ చోరవతో 2005లో ప్రారంభమై ప్రతి ఏటా 17 మే రోజున ‘ప్రపంచ రక్త పోటు దినం’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రపంచ రక్త పోటు దినం – 2022 నినాదంగా ‘రక్త పోటును కొలుచుకో, నియంత్రించు, దీర్ఘకాలం జీవించు’ అనే అంశం తీసుకోబడింది. రక్త పోటు పెరగడానికి గల కారణాలు, నియంత్రణకు మార్గాలు, రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను చర్చించడానికి ఈ వేదిక ఉపయోగిస్తారు. విశ్వవ్యాప్తంగా మూడింట రెండు వంతుల అల్ప, మధ్యస్థ ఆదాయ దేశాల ప్రజలు రక్త పోటుతో సతమతం అవుతున్నారు. దాదాపు 10 శాతం ప్రజలు బిపి సమస్యతో బాధ పడుతున్నారని, 2025 నాటికి 25 శాతం ప్రజలకు బిపి తగ్గించే/నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నామని ఐరాస అంటున్నది. ప్రపంచ బిపి దినం సందర్భంగా ఉచిత రక్త పోటు నిర్థారణ పరీక్షలు చేస్తూ, రుగ్మత పట్ల అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి. సాధారణంగా 140/90 వరకు బిపి ఉన్నపుడు నియంత్రించ వచ్చు. ఆరోగ్యవంతుల బిపి 120/80 ఉండాలని మనకు తెలుసు. రక్త పోటు అధికమైనపుడు తీవ్ర గుండె సమస్యలతో కూడిన అనారోగ్యం కలుగుతుంది. ప్రపంచ మరణాల్లో 12.8 శాతం బిపి సంబంధ సమస్యలతో జరిగినవే అని తేలింది.
రక్త పోటు దుష్ప్రభావాలు:
ప్రపంచ రక్త పోటు దినం అవగాహనా వేదికలు భయపెట్టి, మానసిక ఒత్తిడి పెంచేవి కాదని, ఈ రోజున బిపి సమస్యకు సంబంధించిన లోతైన విజ్ఞానం అందించడం జరుగుతుందని నమ్మాలి. బిపీని నిర్లక్ష్యం చేసినపుడు గుండె పోటు, కిడ్నీ సమస్యలు, హార్ట్ ఫేయుల్యూర్, చూపు మందగించడం, స్ట్రోక్‌లు లాంటి ప్రాణాపాయ స్థితి కూడా రావచ్చని తెలుసుకోవాలి. నేడు భారతదేశంలో మూడింట ఒక వంతు ప్రజలకు బిపి సమస్య ఉందని, పురుషుల కన్న మహిళల్లో అధికంగా ఉండడం గమనించారు. పట్టణ ప్రజల్లో 40 శాతం వరకు, గ్రామీణుల్లో 17 శాతం వరకు నిర్థారించబడింది. 2016 గణాంకాల ప్రకారం రక్త పోటు కారణంగా 1.63 మిలియన్ల మరణాలు నమోదైనాయని తేలింది. 18 – 25 మధ్య వయస్కుల్లో కూడా 10 శాతం మందికి బిపి సమస్య ఉండడం విచారకరం. హృదయనాళ సంబంధ రుగ్మతగా బిపిని ‘సైలెంట్ కిల్లర్’గా పిలుస్తారు. వయస్సు 60 దాటిన వయోజనులకు బిపి సమస్య అధికంగా కనిపిస్తుంది. భారత్‌లో రక్త పోటు రుగ్మతతో 80 మిలియన్ల ప్రజలు, అనగా ప్రతి ఐదుగురిలో ఒక వయోజనుడు (19 శాతం) బిపితో బాధ పడుతున్నాడు. వీరిలో 15 శాతం చికిత్స తీసుకోవడం, 49 శాతం నియంత్రించలేని బిపి రోగులు ఉన్నారని తేలింది.
రక్త పోటు కారణాలు/లక్షణాలు:
రక్త పోటుకు కారణాలుగా పొగాకు ఉత్పత్తుల వాడకం, మధు మేహం ఉండడం, కొలెస్టరాల్ అధికమవడం, స్థూలకాయం, లవణ అధిక వినియోగం, ఆల్కహాల్ సేవనం, అధిక మానసిక ఒత్తిడి, అనువంశిక కారణం లాంటివి చెప్పవచ్చు. అధిక బిపీకి లక్షణాలుగా తల నొప్పి, దృష్టి దోషం, శ్వాస మందగించడం, ముక్కుల నుండి రక్తం కారడం, ఫాటిగ్యు, న్యూసియా లాంటివి గమనించారు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
బిపిని నియంత్రించడం, రాకముందే జాగ్రత్తగా ఆకుకూరలు, బెర్రీస్, పాలు/పెరుగు, ఓట్‌మీల్, అరటి పండ్లు, చేపలు, టమాటో, గోధుమలు, జోన్నలు, గ్రీన్ పీస్, ఉల్లి, పొప్పడి పండు, ఉసిరి, మజ్జిగ, ఓట్స్ లాంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. లవణం, చక్కర, జంక్ ఫుడ్ మరియు కొవ్వులను తగ్గించాలి. పొగాకు, ఆల్కహాల్, ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. వ్యాయామం, నడక, యోగా, ధ్యానం, 6 – 7 గంటల నిద్ర ఉండాలి. ఇంటి భోజనాన్ని మాత్రమే తీసుకోవాలి. లిఫ్టుకు బదులు మెట్ల మార్గాన్ని ఆశ్రయించాలి.
ప్రతి ఏటా ఇండియాలో దాదాపు 10 మిలియన్ల మరణాలు బిపి సంబంధ కారణాలతో జరుగుతున్నాయి. బిపి అంటువ్యాధి కాదని, మన అలవాట్లతో నివారణ, నియంత్రణ చేయవచ్చని తెలుసుకోవాలి. పరిపూర్ణమైన జీవనశైలిని పాటిస్తూ, రక్త పోటు సమస్య లేని భారతాన్ని నిర్మించుటలో మనందరం సహకరిద్దాం, జాగ్రత్త పడదాం.