యువభారతంలో నిరుద్యోగ సమస్య !

(‘సియంఐఈ’ తాజా నివేదిక ఆధారంగా)

దేశ జనాభా 1.38 బిలియన్లు దాటుతోంది. అధిక జనాభాతో నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, ప్రజారోగ్యం సమస్య, అసమానతలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే యువత అత్యధికంగా ఉన్న దేశంగా భారత్‌ ‌దూసుకుపోతున్నది. యువభారతంలో ప్రజల సగటు వయస్సు 29గా నమోదు కావడం సంతోషదాయకం. ప్రపంచ యువతలో 5వ భాగం భారతంలోనే ఉన్నది. డిజిటల్‌ ‌యుగపు ఆధునిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడం, వినియోగదారులు పెరగడం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, అసమానతల తగ్గింపు లాంటి అంశాలతో నిరుద్యోగం ముడిపడి ఉంటున్నది. యువశక్తి అధికంగా ఉన్న భారతం రాబోయే రోజుల్లో ప్రపంచానికే గొప్ప వరంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ జనాభాలో 18-29 ఏండ్ల వయస్సు కలిగిన యువ జనాభా 22 శాతం (26.1 కోట్లు) దాటిందని గణాంకాలు వివరిస్తున్నాయి.

02 మే 2022 సియంఐఈ నివేదిక:

కొరోనా అలల సునామీకి దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాల్లో నిరుద్యోగం పెరగడం, వలసజీవుల బతుకులు పెనెంలోంచి పొయ్యిలో పడడం చూసాం. కొరోనా విపత్తు మబ్బులు తొలగిపోతున్న వేళ నిరుద్యోగ రేటు కొంత తగ్గిందని ‘సెంటర్‌ ‌ఫర్‌ ‌మానిటరింగ్‌ ఇం‌డియన్‌ ఎకానమీ, సియంఐఈ’ తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తున్నది. దేశంలో పట్టణ నిరుద్యోగ రేటు 9.22 శాతం ఉండగా, గ్రామీణ నిరుద్యోగ రేటు 8.28 శాతంగా ఉందని నివేదిక వివరిస్తున్నది. కోవిడ్‌-19 ‌ప్రమాదం తగ్గుతున్న వేళ గ్రామీణ నిరుద్యోగ రేటు మార్చి-2022లో 7.29 శాతం నమోదు కాగా ఏప్రిల్‌లో 7.18 శాతానికి చేరడం గమనించారు. 02 మే 2022న దేశ నిరుద్యోగ రేటు 7.88 శాతం నమోదు కాగా, పట్టణ నిరుద్యోగ రేటు 9.13 శాతం, గ్రామీణ రేటు 7.30 శాతంగా వర్ణించబడింది.

రాష్ట్రాల కనిష్ట, గరిష్ట నిరుద్యోగ రేటు :

దేశంలోనే ఏప్రిల్‌-22‌లో అత్యధిక నిరుద్యోగ రేటు కలిగిన రాష్ట్రాల్లో 34.5 శాతంతో హర్యానా, 28.8 శాతంతో రాజస్థాన్‌, 21.1 ‌శాతంతో బీహార్‌, 15.6 ‌శాతంతో జె అండ్‌ ‌కె, 15.5 శాతంతో గోవా నిలిచాయి. ఏప్రిల్‌-22‌లో నిరుద్యోగ రేటు కనిష్టంగా హిమాచల్‌ (0.2 ‌శాతం), ఛత్తీస్‌ఘడ్‌ (0.6 ‌శాతం), అస్సాం (1.2 శాతం)లు నమోదు చేసుకున్నాయి. ఏప్రిల్‌-22‌లో ఉద్యోగ రేటు 36.46 శాతం నుంచి 37.05 శాతానికి చేరడం సంతోష కారణం అవుతున్నది. ప్రస్తుతం శ్రామికవర్గాల ఉపాధి, ఉద్యోగ రేటు క్రమంగా పెరగడం కొంత ఊరట నిస్తున్నదని సియంఐఈ నిపుణులు వివరిస్తున్నారు. మార్చి-19లో 43.7 శాతంగా ఉన్న ఉద్యోగ రేటు మార్చి-22లో 39.5 శాతానికి పడిపోవడానికి కారణం కొరోనా విజృంభణ యే అని నిర్థారించారు. నిరుద్యోగ రేటు కొంతమేరకు తగ్గినా, అధిక జనాభా కలిగిన పేద దేశంలో నిరుద్యోగ రేటు పలు సమస్యలకు ఊపిరి పోస్తున్నదని తెలుసుకోవాలి.

తెలుగు రాష్ట్రాలు :

జనవరి-22లో నిరుద్యోగ రేటు తెలంగాణ కనిష్టంగా 0.7 శాతంగా నమోదు కాగా గుజరాత్‌లో 1.2 శాతం, మేఘాలయాలో 1.5 శాతం, ఒడిషాలో 1.8 శాతం, కర్నాటకలో 2.9 శాతంగా గమనించారు. ఏప్రిల్‌-2022‌లో 30 రోజుల సగటు నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్‌లో 5.3 శాతం, తెలంగాణలో 9.9 శాతంగా నమోదైంది.

కార్మిక భాగస్వామ్య రేటు (యల్‌పిఆర్‌) :

‌మార్చి-22లో కార్మిక భాగస్వామ్య రేటు (లేబర్‌ ‌పార్టిసిపేషన్‌ ‌రేటు, యల్‌పిఆర్‌) 39.5 ‌శాతం ఉండగా, ఫిబ్రవరి-22లో 39.9 శాతం ఉంది. కొరోనా అనంతరం కార్మిక వర్గానికి పని దొరక్కపోవడం, పని కోసం ప్రయత్నాలను మానుకోవడం గమనించారు. కొరోనా తీవ్రత తగ్గినప్పటికీ మిలియన్ల మహిళలు పనికి దూరంగా ఉండడం, ఉపాధి దొరక్క నీరస పడిపోవడం, ఉద్యోగాలు లభించక పోవడంతో కార్మిక భాగస్వామ్య రేటు తగ్గడం, ఆర్థిక మందగమనం జరిగాయి. 2017లో యల్‌పిఆర్‌ 46 ‌శాతం ఉండగా, 2022లో 40 శాతానికి పడిపోవడం ఆర్థిక సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నది. ప్రతి ఏట 5 మిలియన్ల విద్యాధికులు కొత్తగా ఉద్యోగ వేటల జాబితాలో చేరుతున్నారు. విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు దొరక్కపోవడంతో యువతలో నిరాశ నిస్పృహలు పెరగడం, సాధారణ ఉపాధులకు దూరంగా ఉండడం గమనించారు. 2016-17లో మహిళల యల్‌పిఆర్‌ 15 ‌శాతం ఉండగా, 2021-22లో 9.2 శాతానికి తగ్గడం విచారకరం. మహిళావివక్ష, రవాణా, భద్రత, గౌరవం లాంటి సమస్యలతో మహిళాలోకం ఉద్యోగ ఉపాధులకు ఉత్సాహం చూపడంలేదని నిర్థారణకు వచ్చారు. యువ విద్యాధిక మహిళల్లో 50 శాతం ఉపాధులకు దూరంగా, ఉద్యోగాన్వేషణకు అఇష్టంగా ఉన్నారని తెలుస్తున్నది.

కొరోనా రుద్దిన ఆర్థిక మందగమనానికి పెట్టుబడుల కందెనలద్ది, నైపుణ్య యువతకు ఉద్యోగ ఉపాధుల ఇంధనాలను అందించి పురోగమన దిశగా దేశాభివృద్ధి జరగాలని సర్వదా కోరుకుందాం. దేశవాసులు తమ తమ వృత్తి, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో అత్యున్నత సేవలందించి దేశ సుస్థిరాభివృద్ధికి ఊతం ఇవ్యాలని ఆశిద్దాం. 

– డా : బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి 

కరీంనగర్‌ – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page