యంత్రాంగాల పని తీరు ..కొన్ని ఉదాహరణలు

మనం మన రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఇది ఒక బహుమత, బహుకులాల వ్యవస్థ అనీ అందువల్ల దీనితో వ్యవహరించేటప్పుడు విశాల దృక్పథం అవసరమనీ గుర్తించలేకపోయాం. అసలు మన సమాజంలో ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయని, ప్రత్యేకించి దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయని మనం సరిగా అర్థం చేసుకోలేదు. మనకు ఆ సమస్యే సరిగా అర్థం కానప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరించాలో కూడా తెలియదు.

ఒకసారి రాజ్యాంగ బద్ధమైన పదవిలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం చెప్పినట్టు నడుచుకోవలసిందే తప్ప, మన దృక్పథానికి అనుకూలంగా రాజ్యాంగాన్ని అటూ ఇటూ తిప్పడం కుదరదు. కాని 1950 నుంచీ కూడా ఈ దేశంలో జరుగుతున్నది అదే. అధికారంలోకి వచ్చిన వారు, రాజ్యాంగం ప్రకారం పని చేయలేదు. ఇవాళ చాలా తీవ్రంగా ఆలోచించవలసిన సమస్య ఇది. వెంటనే పరిష్కరించవలసిన సమస్య ఇది. ఇది కేవలం ఒక బూర్జువా వ్యవస్థ మంచిదా కాదా అనే చర్చ కాదు. చాలా చోట్ల బూర్జువా వ్యవస్థలు కూడా బాగానే పని చేశాం­. ఇక్కడ ఆ బూర్జువా వ్యవస్థను కూడా పద్ధతి ప్రకారం పని చేయనివ్వడం లేదు. క్రమశిక్షణ అనేది నేర్పితే వచ్చేది కాదు. అది అవగాహనవల్ల రావలసిందే. ఆ అవగాహన కల్పించడంలో ముఖ్యంగా  రాజ్యాంగబద్ధమైన పదవులను అధిష్టించేవారిలో, కల్పించడంలో మన సమాజం ఘోరంగా విఫలమైంది.

  కొన్ని ఉదాహరణలు
మన యంత్రాంగాలు ఎట్లా పని చేస్తున్నాయో చూడడానికి వళ్లీ ఒకసారి బీదర్‌ హత్యాకాండ  సంగతే చూద్దాం. ఆ కేసులో పోలీసులు రాసిన ఎఫ్‌ఐఆర్‌ ఏమి చెబుతుందంటే, ‘‘విద్యాసాగర్‌ ప్రాంతంలో ఉంటున్న సిక్కు విద్యార్థులకూ, ఆ ప్రాంత  నివాసులకూ అంతకుముందు నుంచే తగాదాలు ఉన్నాయి.. సిక్కు విద్యార్థులు స్థానిక ప్రజలతో అనుచితంగా ప్రవర్తించేవారు. సిక్కు మతస్తులు తమ ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్‌ కాలేజి తెరిచారనీ, మరొక మెడికల్‌ కాలేజి కొరకు ప్రయత్నిస్తున్నారని సాధారణంగా బీదర్‌ ప్రజలు సిక్కు మతస్తుల మీద కోపంతో ఉన్నారు’’.
ఈ ప్రకటనలోని అనుచిత ప్రవర్తన అనే దానికి సాక్ష్యాధారాలు ఏమీ లేవని ఇది వరకే చెప్పాను. అట్లాగే అసలు ఘర్షణ ఎట్లా ప్రారంభమైందో , ఒక పోలీసు అధికారి పంపిన టెలిప్రింటర్‌ మెసేజి ఏమి చెప్పిందో ఇది వరకే చెప్పాను. స్థానికులే దుర్భాషలాడడం వె­దలు పెట్టారని ఆ మెసేజిలో సాక్ష్యం ఉంది.
ఇక ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మామూలుగా పౌరహక్కుల, ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలు న్యాయ విచారణ కమిషన్‌ నియమించమని అడుగుతాం­. మళ్లీ బీదర్‌ సంగతే చూద్దాం. ఆ కమిషన్‌ 1990 జనవరిలో తన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో, పాలనా యంత్రాంగం విఫలమైందని, ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ తన బాధ్యతలు నిర్వర్తించలేదని రాశారు. అయినా  ఏమి జరగలేదు. ఎవరి మీదా ఏ చర్చలూ తీసుకోలేదు. కమిషన్‌ గురించి అడగడంలోగాని, ఆ తర్వాత కమిషన్‌ నివేదిక మీద ఏ చర్చలు తీసుకున్నారని వెంటపడక పోవడంలో గాని కొంత వరకు ఈ ఉద్యమాల వైఫల్యం, బహుశా కొంత అజ్ఞానం కూడా ఉన్నదనుకుంటాను.

ఇక వామపక్ష విశ్లేషణ చూస్తే, ఇదే బీహర్‌ సంఘటనకు సంబంధించి, అశోక్‌ జైట్లీ అనే ఐఎఎస్‌ అధికారి ఒక వైపు, సుమంతో బెనర్జీ మరొక వైపు విశ్లేషణలు చేశారు. వాళ్లిద్దరూ కూడా ఎ క్లాస్‌ కంట్రాక్టర్‌  జోగాసింగ్‌కు వామపక్ష దృక్పథం ఉండాలని, ఆశించినట్టున్నారు. ఆ అవగాహన లేనందుకు ఆయనను తప్పుబట్టారు. జోగాసింగ్‌ ఒక వ్యాపారవేత్త, ఎ క్లాస్‌ కాంట్రాక్టర్‌ అంటేనే పెద్ద గుణవంతుడు కాడని చెప్పవచ్చు. కాంట్రాక్టులు పొందేందుకు ప్రభుత్వాధికారులకు, అధికారంలో ఉన్నవారికి లంచాలు ఇస్తూనే ఉన్నాడు. అట్లా లంచాలు ఇస్తూనే మెడికల్‌ కాలేజి అనుమతి తెచ్చుకుని ఉంటాడు. తన ఆవరణలో ఖాళీ భవనాలు ఉన్నాం­ గనుక కాలేజి పెట్టాడు. వె­త్తం మీద అది హిందూ,మైనారిటీ విద్యా వ్యాపార సంస్థల మధ్యఉన్న తగాదా. దానికి విద్యార్థుల అనుచిత ప్రవర్తన, స్త్రీలపట్ల వేధింపులు లాంటి రంగు అంతా పూయడం జరిగింది.

 అనుచిత ప్రవర్తన రంగు
ఇది అన్ని చోట్లా ఉన్నదే. అసలు విషయాన్ని పక్కనపెట్టి, స్త్రీలపట్ల అనుచిత ప్రవర్తన అన్న దాన్ని తీసుకురావడం. మైనారిటీలకు సహజంగానే స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఒక రకమైన స్వభావం ఉంటుందన్నట్టు వ్యాఖ్యానించడం. దళితుల విషయలో కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాం­. జస్టిస్‌ గంగాధరరావు కమిషన్‌  విచారణలో చుండూరు ఘటన విషయంలో కూడా దళిత యువకుల  అనుచిత ప్రవర్తన గురించి రాశారు. దళితులనగానే అనుచితంగా ప్రవర్తిస్తారన్న మాట. రెడ్లు అనుచితంగా ప్రవర్తించారా , బ్రాహ్మణులు అనుచితంగా ప్రవర్తించార, కమ్మలు అనుచితంగా ప్రవర్తించారా ?
సరే, వె­త్తం మీద ఇటువంటి సామూహిక అత్యాకాండలు జరిగినప్పుడు ప్రభుత్వం ప్రవర్తించవలసినట్టుగా ప్రవర్తించలేదు. అం­తే మొదటి నుంచీ కూడా చట్టబద్ద పాలన గురించీ, రాజ్యాంగ బద్ధమైన ప్రవర్తన గురించీ మన సమాజం సక్రమంగా ఆలోచించడం లేదు.

మనం మన రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఇది ఒక బహుమత, బహుకులాల వ్యవస్థ అనీ అందువల్ల దీనితో వ్యవహరించేటప్పుడు విశాల దృక్పథం అవసరమనీ గుర్తించలేకపోయాం. అసలు మన సమాజంలో  ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయని, ప్రత్యేకించి దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయని మనం సరిగా అర్థం చేసుకోలేదు. మనకు ఆ సమస్యే సరిగా అర్థం కానప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరించాలో కూడా తెలియదు.

దళితుల మీద దాడులు
ఆంధ్రప్రదేశ్‌లో దళితుల మీద దాడుల గురించే చూడండి. వాళ్ల మీద దాడులు ఎప్పటి నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటే, వాళ్లు ప్రశ్నలు అడగడం వె­దలు పెట్టినప్పటి నుంచి, దళితుల ఉద్యమం పెరిగి, వాళ్లు అధికారం కావాలనీ, నిర్ణయాధికారంలో తమకూ న్యాయమైన భాగస్వామ్యం కావాలని అడగడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ల మీద దాడులు పెరిగిపోయాయి . వాళ్లు సమాజంలో ఇతరుల నుంచి సానుభూతి, సంఫీుభావం పొందడం మొ­దలయ్యాక వాళ్ల ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అదంతా ఒక కుప్పగా, వోట్‌బ్యాంకుగా పనికి వస్తుందని అన్ని రాజకీయ పక్షాలు ఆలోచించడం మొ­దలుపెట్టాం­. దళితుల వోటు హక్కు అనేది కాంగ్రెస్‌ పార్టీ గుత్తసొమ్ముగా, సొంత ఆస్తిగా మారిపోయింది . అందువల్ల కాంగ్రెస్‌ దళితులలో యజమానిలాగా ప్రవర్తించడం మొ­దలుపెట్టింది. ఇతర పార్టీలు కూడా ఆ ఆస్తి కోసం తగాదా పడం మొదలుపెట్టారు . దళితుల అస్తిత్వం, దళితుల వోటుహక్కు అనేవి రాజకీయ పక్షాలు కాట్లాడుకునే ఆస్తులుగా మారిపోయాయి ­.

అందులో భాగమే 1983 పదిరికుప్పం దాడి. అక్కడ ఎంత ఘోరంగా జరిగిందంటే, దళితులకు చెందిన గేదెలను కూడా పెట్రోలు పోసి తగులబెట్టారు. తర్వాత ఏమైంది? ఏమీ కాలేదు. నేరస్తులెవరికీ శిక్షలు పడలేదు. ఏకసభ్య విచారణ కమిషన్‌ వేశారు గాని ఆ నివేదికను పట్టించుకున్న వారేలేరు .

ఆ తర్వాత కారంచేడు జరిగింది. అక్కడ దళితులు చేసిననేరమల్లా, ఒక దళిత స్త్రీ ధైర్యంగా, మేం మంచినీళ్లు తాగే చెరువులో గేదెలు కడగబాకండయ్యా అని అనడమే. ఆ ము­రికి నీళ్లు తాగి, అవి తాగనిచ్చినందుకు కృతజ్ఞత చూపడం కాకుండా, ఎదురు మాట్లాడే ధైర్యం చేస్తావా అని కమ్మ భూస్వాము­లకు కోపం వచ్చింది. ప్రతీకారంగా దళితులను తెగనరికారు. ఆ తర్వాత ఒక కమిషన్‌ విచారణ జరిగింది.

కె.జి. కన్నబిరాన్‌

ఆత్మకథాత్మక సామాజిక చిత్రం

అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *