మనం మాట్లాడుకుందాం
మనసుల్ని రంజింపజేసే
వసుధైక సుగంధాల మధ్య
మనం మాట్లాడుకుందాం
యుగయుగాల సంకుచిత హద్దుల్ని చెరుపుకొని
సౌహార్ద్ర రాగాల సంగతుల్ని నింపుకొని
మనం మాట్లాడుకుందాం
చెట్లతో గాలి మాట్లాడుకున్నట్టు
కడలి గట్లతో అలలు మాట్లాడుకున్నట్టు
రాత్రితో వెన్నెల మాట్లాడుకున్నట్టు
పగటితో సూర్యరశ్మి మాట్లాడుకున్నట్టు
బాధలన్నీ విడనాడి
బాధ్యతలన్నీ గుర్తెరిగి
మళ్లీ మళ్లీ మాట్లాడుకుందాం
మన మాటల జల్లులు
బీటలు వారిన బతుకుల్ని
సస్యశ్యామలం చేయవచ్చు
మన మాటల కిరణాలు
వేదనల చీకటిని
కూకటి వేళ్లతో పెకళించవచ్చు
కావాలి మన మాటలు
హృదయాల సెలయేళ్లపై
తేలియాడే ఆత్మీయతా తేటలు
మనం మాట్లాడుకుందాం
మనసులతో మాట్లాడుకుందాం
మనసుల వెలుగులతో
మమతల దీపాల్ని వెలిగిద్దాం!
మన మాటలకు
మానవత్వపు రూపాల్ని తొడిగేద్దాం!
– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, 9177732414 )
తిరుపతి (ఆ.ప్ర).