మట్కానా…..మజాకా…?

  • చాపకింద నీరులా విస్తరిస్తున్న మట్కా జూదం
  • భారీగా చేతులు మారుతున్న కరెన్సీ
  • బానిసలై వీధిన పడుతున్న పేద కుటుంబాలు
  • మట్కా జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు : తాండూరు పట్టణ సీఐ రాజేంద్ర రెడ్డి

తాండూరు, ఏప్రిల్‌ 13( ‌ప్రజాతంత్ర విలేఖరి) : మట్కా జూదం మహామ్మారిలా తాండూరు ప్రాంతాన్ని పట్టిపీడిస్తుందని అక్కడి పలు పేద కుటుంబాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూదానికి బానిసలైన కొందరు విచ్చలవిడిగా డబ్బులు పెట్టి తమ కుటుంబాలను వీధిన పడేసిన పరిస్థితులున్నాయని వారు వాపోతున్నారు. నిత్యం రేక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు జూదానికి అలవాటు పడి తాము బలయి, తమ కుటుంబాలను కూడా బలి చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జూదాన్ని అరికట్టాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మట్కా జూదం నిర్వహణతో రోజుకు లక్షల రూపాయల చేతులు మారుతున్నట్లు సమాచారం.

జూదం నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే వారి కుటుంబాలు వీధిన పడకుండా కాపాడిన వారవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మట్కా జూదం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగడానికి నిర్వాహకులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు పరోక్షంగా సంబంధాలే కారణమని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు  మట్కా మహమ్మారి దృష్టి సారించి దానికి బలవుతున్న పేద కుటుంబాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ దిశగా ఉన్నత అధికారులు చర్యలు తీసుకుని నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.

మట్కా జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు : తాండూరు పట్టణ సీఐ రాజేంద్ర రెడ్డి
తాండూరు పట్టణ ప్రాంతంలో మట్కా జూదం నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సిఐ రాజేందర్రెడ్డి హెచ్చరించారు. ఇదే విషయమై ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే కొంతమంది మట్కా జూదం నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎక్కడైనా పట్టణ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *