మంటలను ఆర్పే యోధులు – అగ్నిమాపక దళ ధీరులు

తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ధైర్యమనే ఉష్ణబంధక కవచం తొడుక్కొని మంటలను ఆర్పుతూ ప్రజలనే కాకుండా వారి ఆస్తిపాస్తులను కాపాడే మహత్తర విధులను నిర్వహించే అగ్నిమాపకదళ సైనికులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలనే సంకల్పంతో జె జె ఎడ్మండ్‌సన్‌ ‌స్థాపించిన ‘అంతర్జాతీయ అగ్నిమాపకదళ దినోత్సవాన్ని’ ప్రతి ఏటా 04 మే రోజున ప్రపంచదేశాలు నిర్వహిస్తున్నాయి. 04 జనవరి 1999న ఆస్ట్రేలియాలోని విక్టోరియా అడవుల్లో మంటలను ఆర్పే క్రమంలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోవడంతో వారి అద్వితీయ సేవలకు గుర్తుగా 04 మే రోజున ఈ దినోత్సవం పాటిస్తున్నారు. ప్రపంచ తొలి రోమన్‌ ‌బటాలియన్‌ అగ్నిమాపకదళ కమాండర్‌గా సేవలు అందించిన సేయింట్‌ ‌ఫ్లోరియన్‌ ‌స్మారకార్థం ఈ రోజున ‘సేయింట్‌ ‌ఫ్లోరియన్స్ ‌డే’గా కూడా పాటించబడుతున్నది. పట్టణ, గ్రామ, పర్యావరణ, రక్షణరంగ, పారిశ్రామిక, ఏవియేషన్‌, ‌మోటార్‌ ‌స్పోర్టస్ ‌రంగాల్లో అగ్నిమాపకదళం ఎల్లవేళల సిద్ధంగా ఉంటూ ఎనలేని మానవీయ సేవలను చేస్తూ మానవాళి మనసులు దోచుకుంటున్నారు. మంటలను ఏకైక శత్రువులుగా భావించి ఆవాసాలు, అడవులు, పరిశ్రమలు, కార్యాలయాలు, సంస్థలను మంటల నుంచి కాపాడటమే లక్ష్యంగా నిస్వార్థ సేవలను అందించే అగ్నిమాపక దళానికి మనందరం రుణపడి ఉండాలి.
మంటల్ని ఆర్పే మహాయజ్ఞంలో క్షతగాత్రులకు సంఘీభావాన్ని తెలపడం, అమరుల వీరులకు నివాళులు అర్పించడం మన కనీస కర్తవ్యం. దేశ మానవ వనరులను, ఆస్తులను దగ్ధం కాకుండా కాపాడేందుకు మంటల్లోకి దూకి, మంటలతో పోరాడి, మంటలను మట్టి కరిపించి, సమాజహితానికి పాటుపడే దేశభక్తులుగా అగ్నిమాపకదళ సిబ్బంది మన ముందు ఆదర్శంగా నిలుస్తున్నారు. అగ్నికి సమయం, సందర్భం, విచక్షణ ఉండదు. సుశిక్షితులైన అగ్నిమాపకదళం మాత్రం ఎల్లవేళల సిద్ధంగా ఉంటూ, ఒక్క ఫోన్‌ ‌కాల్‌తో నిమిషాల్లో అగ్ని ప్రమాద స్థలానికి కావలసిన అగ్నిమాపక పరికరాలతో చేరుతుంది. అంతర్జాతీయ అగ్నిమాపకదళ దినం రోజున సిబ్బంది, సామాన్య జనం నీలి (జల సంకేతం), ఎరుపు రంగు (మంటలకు సంకేతం) రిబ్బన్లను ధరించి అగ్నితో పోరులో అమరులకు శ్రద్ధాంజలి, కుటుంబ సభ్యులకు సంఘీభావం, క్షతగాత్రులకు ప్రగాఢ సానుభూతి ప్రదర్శించాలి. సాధారణంగా మే మాసపు తొలి ఆదివారం రోజున మద్యాహ్నం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన సిబ్బంది మనశ్శాంతికి కొన్ని నిమిషాలు నిశ్రబ్దం పాటించే ఆచారం కూడా పాటించడం జరుగుతుంది.
భారతదేశ జనాభా ఆధారంగా 8,559 అగ్నిమాపక కేంద్రాల అవసరం ఉండగా, ప్రస్తుతం 2,987 కేంద్రాలు మాత్రమే సేవలు అందిస్తున్నాయి.సాధారణ ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి నేషనల్‌ ఎమర్జెన్సీ ఫోన్‌ ‌నెంబర్‌ 112, ‌ఫైర్‌ 101, ‌పోలీస్‌ 100, అం‌బులెన్స్ 102, ‌ప్రకృతి విపత్తులు 108 టోల్‌ ‌ఫ్రీ నెంబర్లు ప్రతి క్షణం అందుబాటులో ఉన్నాయి. అగ్నిమాపకదళంలో ప్రమాదకర పదార్థాల నిపుణులు, మంటలను ఆర్పే విభాగం, తాత్కాలిక అగ్నిమాపక సభ్యులు, స్వచ్ఛంధ కార్యకర్తలు, కార్చిచ్చు ఆర్పే విభాగం, భారీ పరికరాల నియంత్రణ చేసే విభాగం, అత్యవసర వైద్య విభాగం లాంటి పలు విభాగాల సభ్యులు ఉంటారు. దేశం, ప్రాంతం, వర్గం, మతం, కులం, భాష లాంటి భేదాలు లేకుండా అగ్నిమాపకదళం అనితరసాధ్య సేవలను అంకితభావం, త్యాగం, నిబద్ధత వంటి సూత్రాలను శ్వాసిస్తూ, మానవాళికి అనన్య సామాన్య సేవలు అందిస్తున్నారు. నేటి ఆధునిక యుగంలో అమెజాన్‌ అడవులు, ఆస్ట్రేలియా అడవుల్లో తరుచుగా సంభవించే కార్చిచ్చులు అగ్నిమాపకదళానికే కాకుండా ప్రభుత్వాలకు కూడా పెను సవాళుగా నిలుస్తూ, పర్యావరణానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయి. అడవుల్లో చెలరేగే కార్చిచ్చులో మానవాళి, ఆవాసాలు, ఆస్తులతో పాటు వణ్యప్రాణులు, హరితవనాలు, వన సంపదలను కూడా కాపాడటంలో అగ్నిమాపక యోధుల పాత్ర అనిర్యచనీయం. అగ్నిమాపకదళ సభ్యుల అద్వితీయ సేవలను మానవ సమాజం మరువకుండా, సర్వదా కృతజ్ఞతా పూర్వకంగా అభినందనలు తెలియజేద్దాం.
– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page