రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరం ‘భారత్ జోడో యాత్ర’కు పిలుపు నిచ్చింది. మహత్మాగాంధీ జన్మదినమైన ఆక్టోబర్ రెండు నుండి దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. మతపరమైన ఘర్షణలతో దేశం చిన్నాభిన్నం అవుతున్నదని, హింస పెట్రేగి పోతున్నదని దాన్ని నివారించాల్సిన అవసరమున్నదని పార్టీ అభిప్రాయ పడింది. ముఖ్యంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌పైనే నేతలు విమర్షనాస్త్రాలను గుప్పించారు. ఆ రెండింటి భావాజాలం దేశానికి ముప్పుగా మారిందని చెప్పుకొచ్చారు. అందుకే భారత్ జోడోకు పిలుపు నిస్తున్నామని, దేశంలో మతసామరస్యాన్ని కాపాడేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే ఇదే సమయంలో ప్రజలతో తమ పార్టీ సంబంధాల విషయంలో పార్టీ అధినాయకులు సోనియాగాంధి, రాహుల్‌గాంధీ విచారం వ్యక్తంచేసిన తీరు గమనార్హం. గత ఎనిమిదేళ్ళ కాలంలో అనేక ఎదురు దెబ్బలు తాకిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లుగా వారి మాటల వల్ల తెలుస్తున్నది. కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ దినదినం క్షీణిస్తూ వొస్తున్నవిషయం తెలియందికాదు.
జాతీయ స్థాయి పార్టీ కాస్తా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారుతూ వొచ్చింది. పార్టీలో అంతర్ఘత విబేదాలు ఎప్పటిలాగానే కొనసాగుతూ ఉండడం, యువ నాయకత్వాన్ని ఎదగకుండా వృద్ద నాయకులు అడ్డుపడుతుండంతో విసిగిన యువ నాయకులు పార్టీని వీడి పోవడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటూ వొచ్చింది. పార్టీ పటిష్టతకోసం తమ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని ఇరవై ముగ్గురు సీనియర్లు అధిష్ఠానానికి• లేఖ రాసి అందరిని ఆశ్చర్యపర్చిన విషయం తెలిసిందే. అంటే అంతమంది సీనియర్లు పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇలాంటి సన్నివేశాలు వివిధ రాష్ట్రాల్లోకూడా వెలుగు చూస్తున్నాయి. తెలంగాణలో ఇతర పార్టీనుండి వొచ్చిన రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంపట్ల ఇప్పటికీ ఇంకా వ్యతిరేక భావంతో నాయకులున్న విషయం తెలియందికాదు.
బయటికి అంతా కలిసి ఉన్నట్లు కనిపించినా లోపలమాత్రం ఎవరి ఇగో వారిదన్నట్లే ఉంది. కేంద్ర నాయకత్వం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపడంలో కూడా కాంగ్రెస్‌పార్టీ ఒక విధంగా విఫలం అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయిలో పెద్ద ఆందోళనకరంగా మారిన రైతు ఉద్యమాన్ని కాంగ్రెస్ అందుకుని విసృత్తం చేయడంలో విఫలమైందన్న వాదన కూడా ఉంది. వారికి మద్దతుగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టలేకపోయిందన్న అపవాద ఉంది. అంతేగాక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలవల్ల పెరిగుతున్న ధరలు, సామాన్యుల ఇబ్బందిపై లోతైన అధ్యయనంచేసి ప్రజల పక్షాన నిలబడి సుదీర్ఘ పోరాటాలు చేయకపోవడంవల్లే ఆ పార్టీ ప్రజలకు దూరమైందన్నది వాస్తవం. అందుకే దేశంలో ఇప్పుడు రెండు, మూడు రాష్ట్రాల్లో తప్ప కాంగ్రెస్ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయింది.
చేతులు కాలినతర్వాత ఆకులు పట్టుకున్నట్లు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజలకు దూరమైనట్లు ఆ పార్టీకి అర్థమైనట్లుంది. అందుకే పార్టీ చింతన సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఆ విషయం గుర్తుకు వొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు తెగిపోయాయన్న విషయాన్ని వారు ఒప్పుకున్నారు. అందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రజల దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వారు ఈ సమావేశం చివరి రోజున గుర్తుచేసిన విషయం గమనార్హం. ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణకు వొచ్చిన సందర్భంగా విమానం దిగగానే తమ పార్టీ నాయకులతో ‘ ఆజ్‌కా క్యా థీమ్ హై – క్యా బోల్నా హై’ అన్న మాటలు వైరల్ అయ్యాయి. రాష్ట్రానికి వొస్తున్నప్పుడు ఆయనకు రాష్ట్ర పరిస్థితిపైన ఏమాత్రం అవగాహన లేదన్న విషయం దీని వల్ల బోధ పడుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలతో సంబంధాలు లేక పోవడం వల్లే ఇలాంటి గ్యాప్స్ ఏర్పడుతాయంటున్నారు. అందుకే భారత్ జోడో కన్నా ముందు జనతాసే జోడో అని పార్టీకి పిలువునివ్వడమే సరైందంటున్నారు.