సముద్రంలో కలిసే ముందు
నది భయంతో కంపిస్తుందట
వెనక్కి చూస్తూ నది తాను
సునాయాసంగా దాటివచ్చిన
పర్వత శ్రేణులను
వంపులు తిరిగిన దారులను
అందమైన అడవులను
జీవకళతో తేజోవంతమైన గ్రామాలను
తృప్తిగా తలచుకుంటూ
ఎదురైన ఎగుడు దిగుళ్లను
తగిలిన రాతి గాయాల బాధల్ని
తనముందున్న అంతుతెలియని
అగాథమయ విశాల సాగరంలో
కలవబోతున్న దృశ్యాన్ని
దిగాలుగా చిత్రించుకుంటూ
తన ఉనికి, తన ఉరకలు
శాశ్వతంగా అదృశ్యం
కాబోవటాన్ని ఊహిస్తూ
వెనక్కి వెళ్లలేని నిజం నదికి ఎరుకే
నది నైజం ముందుకు ఉరకటమే !
నదికి సముద్రంలో కలవటం ఎంత
ప్రమాదకరమో తెలిసినా
కష్టమైనా ఇష్టం కాకున్నా
కలిసిపోక తప్పదన్న నిజంవల్ల
నది తన భయాన్ని
దూరం చేసుకోగలిగి
తన అస్తిత్వాన్ని నది
కోల్పోతున్నాననే భీతి లోలోనఉన్నా
సముద్రంగా తాను రూపాంతరం
చెందుతున్నాననే భావనతో తనలోని
దిగులును తొలగించుకొని
ప్రశాంతసాగరమై నిలుస్తుంది !
నదిలాగే సృష్టిలో మనుషులెవరూ
జీవన గమన దారిలో
వెనకకు వెళ్ళలేరనేది వాస్తవం
తిరోగమనం మనిషికి
నదిలాగే అసాధ్యమైనదని
జీవన సమర సాగరం లో
భయం వదిలి ధీరులై
పోరాడుతూ ఎదురొడ్డుతూ
నది లాగే మనిషి సాగక తప్పదని
ప్రశాంత సంద్రమై వెలుగులీన
ముందుకు కదలాలిసిందే !
( లెబనాన్ కవి, తత్వవేత్త ఖలీల్ జీబ్రాన్
ఆంగ్ల కవిత ఖీజు•= ప్రేరణతో )
– డా. కె.దివాకరా చారి
939101897