బీజేపీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం

వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీకి మద్దతివ్వండి
 కాంగ్రెస్‌ ప్రభుత్వం రాహుల్‌ గాంధీకి ట్యాక్స్‌ కడుతుంది
 కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అవినీతి, కుంభకోణాలు
 బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మక్తల్‌ రోడ్‌ షోలో కేంద్ర మంత్రి జి కిషన్‌ రెడ్డి  
 తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిందని విమర్శ

నారాయణపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : దేశ ప్రజల సంక్షేమం కోసం అలుపెరగుకుండా కృషి చేస్తున్న నరేంద్ర మోదీకి వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మద్దతివ్వాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం చేపట్టిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మక్తల్‌లో జరిగిన రోడ్‌లో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ…2013లో తెలంగాణ  సాధన కోసం ఇక్కడ నుండే ప్రారంభించిన పోరుయాత్ర తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిందని, అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణలో కూడా మార్పు రావడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామని తెలిపారు. నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని, దేశంలోని అనేక  సమస్యలను ఆయన పరిష్కరించారన్నారు.

ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, అందుకే ప్రతీ ఒక్కరూ మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని కిషన్‌ రెడ్డి తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పేదవాడికి న్యాయం జరగలేదని, దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించిందని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కరికి కూడా డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లు ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. కట్టెల పొయ్యితో పొగ బారిన పడకుండా దేశంలోని పేద మహిళలకు కోట్లాది గ్యాస్‌ కనెక్షన్లు అందించారని, కేంద్రం ప్రతీ పేదవాడికి బ్యాంక్‌ అకౌంట్‌ సదుపాయం కల్పించిందని, పేదలకు, మహిళలకు మోదీ షూరిటీ పెట్టి బ్యాంకు అకౌంట్లు తెరిపించారన్నారు. ప్రతీ పేదవాడికి ఉచితంగా 5 కిలోల బియ్యం..రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి అందిస్తున్నారని, రైతుల కోసం యూరియా బస్తాపై రూ.1,300 కేంద్రం సబ్సిడీ ఇస్తుందని, పొదుపు సంఘాల మహిళలకు రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకంతో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాతీయ రహదారులు వేస్తున్నారని కిషన్‌ రెడ్డి తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలో రోడ్లు వేసిన దాఖలాలు లేవని విమర్శించారు.

తొమ్మిదేళ్లు కేసీఆర్‌ కుటుంబం రాష్ట్నాన్ని దోచుకుంటే.. ఇప్పుడు రాహుల్‌ గాంధీ తెలంగాణను దోచుకుని వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖర్చు పెట్డడానికి వాడుతున్నారని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రాహుల్‌ గాంధీకి ట్యాక్స్‌ కడుతుందని, కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అవినీతి, కుంభకోణాలని విమర్శించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. యూపీఏ పాలనలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించారని, హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు, మత కలహాలు పెరిగాయని, కానీ మోదీ ప్రభుత్వం వొచ్చాక దేశ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసిందని కిషన్‌ రెడ్డి తెలిపారు. పేద ప్రజల కష్టాల తీర్చడానికి నరేంద్ర మోదీ పని చేస్తున్నారని, పేద కుటుంబంలో మోదీ పుట్టారు కాబట్టే పేద ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నారన్నారు. గత యూపీఏ హయాంలో దేశంలో కరెంటు కొరత ఉండేదని, గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశంలో కరెంటు కోతలు లేవని, ఎరువుల కొరతలూ లేవని, మోదీ నాయకత్వంలో దేశంలో మంచి వాతావరణం ఏర్పడిరదన్నారు. వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికలు కేవలం తెలంగాణకు సంబంధించినవి కావని, దేశానికి సంబంధించిన ఎన్నికలు కనుక ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని, అండగా నిలబడాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌ పార్టీ డబ్బులకు వోట్లు కొనే ప్రయత్నం చేస్తుందని, మన పిల్లల కోసం, దేశ భవిష్యత్తు కోసం మోదీని ఎన్నుకోవాలని, ఆయన నాయకత్వంలో ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నాయని కిషన్‌ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలు
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక అలవికాని హామీలు ఇచ్చారని,  ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారని, కానీ ఇంతవరకు అతీ గతీ లేదని కిషన్‌ రెడ్డి దుయ్యబట్టారు. రైతులకు రుణమాఫీ, ఎకరానికి రూ.15,000 సాయం, మహిళలకు రూ.2500 ఆర్థికసాయం ఇస్తామని  చెప్పారని, మహాలక్ష్మీ లేదు..మహారాజు లేదు.. వాళ్లు మాత్రం కుర్చీలో కూర్చున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుటుంబ, అవినీతిమయమైన పార్టీలని అన్నారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి  గట్టి సంకల్పంతో  పని చేస్తుందని, వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని, భారీ మెజారిటీతో మోదీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కిషన్‌ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page