Take a fresh look at your lifestyle.

బిజెపీలోనూ అసంతృప్తి

ఒకనాడు క్రమశిక్షణకు పెట్టిందే పేరుగా చెప్పుకునే భారతీయ జనతాపార్టీలోనూ అసంతృప్తి రాగం మొదలైనట్లు కనిపస్తున్నది. ఇంతవరకు కాంగ్రెస్‌ ‌పార్టీయే ఇలాంటి అసంతృప్తులకు నిలయంగా చెప్పుకోవటం విన్నాం. ఒక వేళ బీజేపీలో విభేదాలున్నా ఏనాడు బహిరంగంగా విమర్శించుకోవడంగాని, మీడియాకు ఎక్కడం కాని ఉండేది కాదు. ఏవైనా ఆరోపణలు వొస్తే నేరుగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే చీవాట్లు పెట్టడమో, అనునయించడమో చేసేది. కాని, కొంతకాలంగా అంతర్గతంగా నలుగుతున్న విభేదాలు ఇటీవల పార్టీ గడప దాటుతున్నాయి. ఒకరు ఇద్దరు ఇలా ఒకరి వెనుక ఒకరు స్వీయ పార్టీ నేతలే ఒకరిపైన ఒకరు బహిరంగంగానే ఆరోపించుకోవడం ఆ పార్టీని మొదటి నుంచి చూసినవారికి ఒకింత ఆశ్చర్యకరంగానే కనిపిస్తున్నది.

బిజెపి పార్టీలో మొదటినుండి పార్టీలో క్రీయాశీల సభ్యులు, లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నుండి వొచ్చిన వారు మాత్రమే ఎక్కువగా మనగలిగేవారు. అయితే దేశం మొత్తం కాషాయ మయం చేయాలన్న ఆ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడాలంటే గిరిగీసుకుంటే కుదరదన్నట్లు ఆ పార్టీ ఇతర పార్టీల్లోని అసంతృప్తి నాయకులను ఆహ్వానిస్తోంది. అలా తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీలనుండి బిజెపిలో ఇటీవల కాలంలో చాలా మందే చేరిపోయారు. అయితే కొంతమంది ఆ పార్టీ తీరుకు లేదా పార్టీ నాయకత్వంతో ఇమడలేక మళ్ళీ మాతృ సంస్థలో చేరిపోయినవారూ లేకపోలేదు. కాగా, ఆ పార్టీలో ఇప్పుడు పాత, కొత్త నాయకులన్న తేడా కనిపిస్తున్నట్లుగా కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే విచిత్రకర విషయమేమంటే మొదటినుండీ ఆ పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నవారి మధ్య కూడా దూరం పెరుగుతున్న వార్తలు వొస్తున్నాయి.

ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ‌పదవి చేపట్టినప్పటినుండి సీనియర్లు కొంత అసంతృప్తిగా ఉన్న విషయాన్ని అనేకసార్లు మీడియాలో చోటుచేసుకున్నది తెలియందికాదు. అయితే ముందుగానే చెప్పుకున్నట్లు మొదటినుండి క్రమశిక్షణ కలిగిన పార్టీ కావటంవల్ల ఇంతకాలంగా వారి మధ్య ఉన్న అభిప్రాయభేదాలు బహిరంగం కాలేదు. కానీ, ఇటీవల ఒకరికి ఇద్దరు ముగ్గురు విమర్శ ప్రతివిమర్శ చేసుకోవడంద్వారా ఇతర పార్టీలో మాదిరిగానే బిజెపిలోకూడా లుకలుకలు చోటు చేసుకుంటున్నాయన్నది బహిర్గతమైంది. దీనికంతకూ దిల్లీ లిక్కర్‌ ‌స్కాం విషయంలో కల్వకుంట్ల కవిత అరెస్టుపై బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ‌చేసిన వ్యాఖ్య కారణమైంది. ఆయన తన సహజ ధోరణిలో లిక్కర్‌ ‌స్కాంలో కవితను అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అనడం పెద్ద వివాదస్పదంగా మారింది. వాస్తవంగా ఆయన ఆ మాట అన్న మూడు రోజులకు గాని ఆ విషయం బయటికి రాలేదు. దీన్ని భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. భారత జాగృతి కార్యకర్తలు, కవిత అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర నిరసన ప్రదర్శనలతో హంగామా సృష్టించారు. ఒక మహిళా నాయకురాలిని అనవలసిన మాటలేనా అని మహిళా సంఘాలు కూడా ధ్వజమెత్తారు. ఈ విషయంలో బిజెపి కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని బండి సంజయ్‌ను అ పదవినుండి వెంటనే తొలగించాలని వారంతా డిమాండ్‌ ‌చేయడం ప్రారంభించారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ ‌దీన్ని సుమోటోగా తీసుకుని, వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరై సంజాయిశీ చెప్పుకోవాల్సిందిగా బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేసింది కూడా. కమిషన్‌ ‌ముందు హాజరు అయ్యేందుకు తనకు కొంత వ్యవధి ఇవ్యాల్సిందిగా ఆయన కోరడం కూడా జరిగిపోయింది. అయితే ఆయన ఏం సమాధానం చెబుతాడన్నది పక్కకు పెడితే, ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిందికాదని ఆయన సొంత పార్టీ నేతలనడం ఆ పార్టీలో అంతర్గతంగా ఇంతకాలం దాగి ఉన్న విభేదాలు వెలుగుచూసినట్లు అయింది. ప్రధానంగా నిజామాబాద్‌ ఎం‌పి ధర్మపురి అరవింద్‌ ‌వ్యాఖ్యలు బండి సంజయ్‌ను పూర్తిగా టార్గెట్‌ ‌చేసేవిగా ఉన్నాయి. బండి సంజయ్‌ ‌మాటలను తాను ఏమాత్రం సమర్థించనని చెప్పిన అరవింద్‌ ‌తన మాటలను వెనక్కు తీసుకోవాలనికూడా సూచన చేశారు. చిత్రమేమంటే వీరిద్దరు కూడా ఆ పార్టీ ఎంపీలుగా కొనసాగుతున్న వారే . బండి సంజయ్‌ ‌మాత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అదనపు బాద్యతలను నిర్వహిస్తున్నారు. అయితే ఇక జాతీయపార్టీకి రాష్ట్ర అధ్యక్షుడంటే అది పవర్‌ ‌సెంటర్‌కాదు, కో ఆర్డినేట్‌ ‌సెంటర్‌ అన్న విషయాన్ని సంజయ్‌కి ఆయన గుర్తు చేయడంతోపాటు, ఆయన వ్యాఖ్యలు పార్టీకి సంబంధంలేదని పేర్కొనడం ఆ పార్టీలో సంచలనాన్ని లేపింది. సమస్య అంతటితోనే ఆగలేదు, ఆ పార్టీ మరో సీనియర్‌ ‌నేత, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కరుడుగట్టిన నేతగా పేరున్న పేరాల శేఖర్‌రావు కూడా సంజయ్‌ ‌మాటలను తప్పుపట్టడం సంజయ్‌పట్ల ఉన్న వ్యతిరేకతను ఎత్తిచూపుతున్నాయి.

సంజయ్‌ ‌నాయకత్వంలో పార్టీ ఎదుర్కుంటున్న తీరును ఆయన బహిరంగంగానే విమర్శించడం చూస్తుంటే ఆ పార్టీలో విబేధాలు తారస్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా పార్టీలో సమన్వయ లోపం కారణంగా కార్యకర్తలు అనేక అవమానాలకు లోనవుతున్నారని, నాయకత్వం వ్యక్తిగత స్వార్థమే చూసుకుంటోందని, నాయకులను , కార్యకర్తలను వాడుకుని వదిలేసే ధోరణిలో ఉందంటూ చాలా ఘాటైన విమర్శచేయడంతో కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి తెలంగాణ పైన కాషాయ జండాను ఎగురవేయాలన్న పట్టుదలతో పార్టీ బీజెపీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బీఎల్‌ ‌సంతోష్‌తోపాటు, పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా ఈ వివాదం మరింత ముదరకుండానే పరిస్థితిని చక్కబెట్టే పనిలో పడ్డట్లు తెలుస్తున్నది. బండిని బహాటంగా విమర్శించిన వీరిద్దరితోపాటు పార్టీలో ప్రాధాన్యత లేదంటూ గతంలో ఎంఎల్‌ఏ ‌రఘునందన్‌రావు ఆరోపించడం, ఇటీవల చేర్పుల కమిటీకీ ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వొస్తున్న నేపథ్యంలో అందరినీ సమన్వయపర్చే కార్యక్రమంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply