రాష్ట్రంపై కేంద్రం కక్షపూరిత వైఖరి
మూడు సార్లు ప్రధానిని కలిసి నిధులివ్వాలని కోరా
నిష్పక్షపాతంగా పెద్దన్నలా వ్యవహరించాలని చెప్పా
వికసిత్ భారత్ బడ్జెట్ కాదు, కుర్చీ బచావో బడ్జెట్
కాంగ్రెస్‌తో కలిసి పార్లమెంటులో నిరసన తెలపాలి
నేడు కేంద్ర బడ్జెట్‌లో అన్యాయంపై అసెంబ్లీ చర్చ
బడ్జెట్‌పై సిఎం రేవంత్ తీవ్ర అసంతృప్తి…కేంద్రం వైఖరిపై మండిపాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : కేంద్ర బడ్జెట్‌లో మొత్తంగా తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అనే పదాన్ని పలకడానికే కేంద్రం ఇష్టపడటంలేదని, వారి మనసులో ఇంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదని, కుర్చీ బచావో బడ్జెట్ అని రేవంత్ విమర్శించారు. మంగళవారం 2024-25 సంవత్సరానికి పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సిఎం రేవంత్ స్పందిస్తూ…పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం నిధులు కేటాయించిందని, మరి అదే పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదంటూ ప్రశ్నించారు. వికసిత్ భారత్ 2047 బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. స్వయంగా తానే మూడుసార్లు ప్రధానిని కలిసి తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరానని, వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలు ఉండాలని, అభివృద్ధికి సహకరించాలని కోరామని తెలిపారు.
రాష్ట్రానికి వొచ్చినప్పుడు కూడా అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి చెప్పానని, వివక్షను తొలగించి నిధులు కేటాయించాలని కోరానని సిఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి, రీజనల్ రింగ్ రోడ్డుకు… ఏ విషయంలోనూ తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించలేదని, ఐటీఐఆర్ గురించి ప్రస్తావించలేదని, సబ్ కా సాత్…సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మార్చారని సిఎం రేవంత్ దుయ్యబట్టారు. వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారని అన్నారు. బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదని, బీజేపీకి తెలంగాణ నుంచి వోట్లు సీట్లు మాత్రమే కావాలి..కానీ అభివృద్ధి పట్టదా..అంటూ దుయ్యబట్టారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డి బాధ్యత వహించాలని, కేంద్ర వైఖరికి నిరసనగా మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు రావాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వమని కేంద్రం చెప్పినా… కిషన్ రెడ్డి ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలన్నారు. ప్రధానిని తాము పెద్దన్నగా భావిస్తే…ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, కేవలం క్విడ్ ప్రోకో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చారని రేవంత్ విమర్శించారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్‌లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుందని అన్నారు.
విభజన చట్టం కేవలం ఏపీకి మాత్రమే కాదని, తెలంగాణకూ వర్తిస్తుందన్నారు. బడ్జెట్‌ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని, లేకపోతే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లేనని సిఎం అన్నారు. కిషన్ రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొద్దని సిఎం హితవు పలికారు. పోలవరంకు నిధులు ఇచ్చినప్పుడు..తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు నిధులు ఇవ్వరో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
పార్లమెంట్‌లో నిరసనకు బీజేపీ ఎంపీలూ కలిసి రావాలని, తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందని, ఇది ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నేడు శాసనసభలో చర్చకు పెడతానని తెలిపారు. ఎవరు విలీనాల ప్రక్రియలో ఉన్నారో…ఎవరు చీకటి ఒప్పందాలు చేసుకున్నారో రేపు బయటపడుతుందన్నారు. తెలంగాణ హక్కులపై, నిధులపై శాసనసభలో చర్చలో కేసీఆర్ పాల్గొనాలని సూచన చేస్తున్నానని, లేకపోతే కేసీఆర్ కూడా మోదీకి మోకరిల్లినట్లే భావించాల్సి వొస్తుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.