హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్న సమయానికే చేరుకున్నారు. ప్లీనరీ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, హరీశ్‌రావు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గువ్వల బాలరాజు, బాల్క సుమన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
తెలంగాణభవన్‌లో జెండా ఆవిష్కరించిన కెటిఆర్…ఊరూరా పార్టీ జెండా ఆవిష్కరణలు
టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్ జెండాలు రెపరెపలాడాయి. ఈ మేరకు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటా జెండా పండగ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు వారి వారి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ జెండాలను ఎగురవేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 40 అడుగుల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ 21వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, సభ్యులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి మన నాయకుడు కేసీఆర్ రెండు దశాబ్దాల క్రితం టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. ఉద్యమం నుంచి పాలన వరకు ఈ స్ఫూర్తిదాయక ప్రయాణంలో భాగస్వామ్యం కావడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రాణాలను పణంగాపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్.. ఇప్పుడు రాష్టాన్ని్ర దేశానికే ఆదర్శంగా నిలిపారని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధిలో ముందంజలో నిలిపారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. 80 వేల ఉద్యోగాలు ఒకేసారి ప్రకటించడం దేశ చరిత్రలో మొదటిసారి అని పేర్కొన్నారు. . టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరం గులాబీమయంగా తయారైంది. రోడ్డుపొడవునా స్వాగత తోరణాలు, ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. 60 లక్షలకు పైగా కార్యకర్తలున్న టీఆర్‌ఎస్ పార్టీ కేవలం మూడు వేల మంది ముఖ్యులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటల కల్లా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్లీనరీకి చేరుకున్నారు. మొత్తంగా 6 వేల మందికి సరిపడా ఏర్పాట్లతో ఇప్పటికే హైటెక్స్ ప్రాణంగం సిద్ధమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్లీనరీ కొనసాగనుండటంతో వేసవి దృష్ట్యా 50 వేల వాటార్ బాటిళ్లతో పాటు ఈసారి ప్రత్యేకంగా అంబలిని అందరికీ అందించేలా టీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. ప్లీనరికీ వచ్చేవారికి ఇబ్బంది లేకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. ముందుగానే అందరికీ పాసులు ఇవ్వడంతో పాస్ ఉన్నవారినే లోపలకు అనుమతించారు.