మనుషుల కడుపు నింపే అన్నం తెలంగాణా లో ప్రధానంగా వరి ధాన్యం నుండే వస్తుంది. కానీ గత రెండేళ్ళు గా తెలంగాణా లో ధాన్యం పండించే రైతులు మాత్రం ఆనందం గా లేరు. ఒక వైపు వరి సాగు ఉత్పత్తి ఖర్చులు పెరిగి పోతున్నాయి. మరో వైపు భారీ వర్షాలు, వడగాండ్ల వానలు లాంటి ప్రకృతి వైపరీత్యాలతో సగటు దిగుబడులు పడిపోతున్నాయి. అన్నిటికీ మించి పండించిన వరి ధాన్యం మార్కెట్ లో అమ్ముకోవడం అత్యంత కష్టమైన వ్యవహారంగా మారింది. ప్రభుత్వం ధాన్యం సేకరించని సమయంలో రైతులు పండించిన ధాన్యానికి మార్కెట్ లో ప్రైవేట్ వ్యాపారులు కనీస మద్ధతు ధర ( ఎంఎస్‌పి ) కూడా చెల్లించడం లేదు. ప్రభుత్వం సేకరించిన సమయంలో కూడా నాణ్యత పేరుతో, రైస్ మిల్లర్లు ప్రతి సీజన్ లో క్వింటాలుకు 8-10 కిలోల ధాన్యం ( కనీసం క్వింటాలుకు 200 రూపాయలు) రైతుల నుండి దోచుకుంటున్నారు.
తెలంగాణా లో ఖరీఫ్ (వానాకాలం), రబీ ( యాసంగి) సీజన్ లలో రైతులు వరి ధాన్యం పండిస్తున్నారు. 2014-2015 లో వానా కాలంలో స్థూల సాగు భూమిలో 22 శాతం లో మాత్రమే వరి పండించిన రైతులు 2020-2021 సంవత్సరం వచ్చే సరికి 37.1 శాతం భూమిలో వరి పండిస్తున్నారు. యాసంగిలో 2014-2015 లో స్థూల సాగు భూమిలో 43.4 శాతం భూమిలో వరి సాగు కాగా, 2020-2021 వచ్చే సరికి 76 శాతం భూమిలో వరి సాగు విస్తరించింది.ఫలితంగా మన రాష్ట్ర అవసరాలకు మించి వరి ఉత్పత్తి అవుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా యాసంగిలో వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగిన తరువాత , మార్కెటింగ్ సమస్యలు పెరిగాయి.
ఖరీఫ్ లో జూన్ -అక్టోబర్ మధ్య సాగయ్యే వరి తో ఇబ్బంది లేదు .
ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. సన్నరకాలు ఎక్కువగా పండుతాయి. స్థానిక మార్కెట్ ఉంటుంది. మిల్లింగ్ లో కూడా సమస్యలు ఉండవు. నూకల శాతం అదుపులో ఉంటుంది. ఈ సీజన్లో ప్రతి సంవత్సరం 40 నుండీ 50 లక్షల టన్నుల బియ్యం( 60 నుండీ 80 లక్షల టన్నుల ధాన్యం) ఎఫ్‌సిఐ సేకరిస్తుంది కనుక , మార్కెట్ పరంగా ఇబ్బంది కూడా తక్కువ.యాసంగికి వచ్చే సరికే వరి సాగుకు ఇబ్బంది ఎక్కువ, డిసెంబర్ నుండీ మే వరకూ ఈ సీజన్ విస్తరించి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏప్రిల్- మే నెలలలో ధాన్యం కోతకు వచ్చే సమయానికి ఉష్ణోగ్రతలు 40-44 డిగ్రీలు దాటతాయి. రైతులు కూడా ఎక్కువ దిగుబడులు ఆశించి,తెగుళ్లు తక్కువ వచ్చే దొడ్డు రకాలను పండిస్తారు. ఖరీఫ్ లాగే రబీ లో కూడా సన్న రకాలను పండించే రైతులు కొందరున్నా, ఆ స్థితి కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉంటుంది. చాలా కాలంగా ఎఫ్‌సిఐ పార్ బాయిల్డ్ బియ్యం సేకరిస్తూ వచ్చింది కనుక, మిల్లర్లు కూడా ధాన్యాన్ని పార్ బాయిల్డ్ చేసి, ఎఫ్‌సిఐ కి లెవీ బియ్యం ఇస్తున్నారు. ఇలాగే కొనసాగితే కథ బాగానే ఉండేది.
గత రెండేళ్లుగా ఎఫ్‌సిఐ ‘‘తాను తెలంగాణా నుండి పార్ బాయిల్డ్ బియ్యం సేకరించలేననీ, పార్ బాయిల్డ్ బియ్యం వినియోగించే రాష్ట్రాలు , ఎఫ్‌సిఐ నుండీ గతం లో లాగా తీసుకోవడం లేదనీ, కాబట్టి పార్ బాయిల్డ్ కాకుండా తెలంగాణా ప్రభుత్వం కూడా ముడి బియ్యం( రా రైస్) ఎఫ్‌సిఐ కి ఇవ్వాలనీ చెబుతూ వస్తున్నది. మొదట్లో తాము పార్ బాయిల్డ్ బియ్యం మాత్రమే ఇస్తామని గట్టిగా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, 2020-21 చివరిలో, కారణమేదైనా తాము ఇకపై ఎఫ్‌సిఐ కి పార్ బాయిల్డ్ బియ్యం సరఫరా చేయబోమని లేఖ ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణ లో పడడానికి, కేంద్రం మొండిగా ఉండడానికి ఈ లేఖే ప్రధాన కారణం.
ప్రపంచ వాణిజ్య సంస్థ షరతులు ఉన్నాయనే సాకులు చెప్పి , ఎఫ్‌సిఐ పూర్తిగా తప్పించుకోకుండా, ఒక మనిషికి నెలకు 12 కిలోల ఆహార ధాన్యాలు అవసరం అనే ఎన్‌ఐఎన్ సంస్థ సిఫారసుల మేరకు, దేశ ఆహార భద్రతా చట్టం ప్రకారమే, అన్ని రాష్ట్రాల నుండి బియ్యం, గోధుమలు, చిరు ధాన్యాలు మరింతగా సేకరించి పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టాలి. ఇప్పుడున్న నాణ్యతా ప్రమాణాలను సవరించి, రెగ్యులర్ గా మనుషులు తినగలిగిన బియ్యాన్ని,ఆయా రాష్ట్రాల ప్రజలు ఆహారంగా వినియోగించే వరి రకాలను మాత్రమే రైస్ మిల్లుల నుండి బియ్యంగా సేకరించి పంపిణీ చేయాలి. అప్పుడే రేషన్ వ్యవస్థలో నెలకొన్న అవినీతి కూడా మాయమవుతుంది. దొడ్డు,సన్నం వరి రకాల మధ్య ఎంఎస్‌పి కూడా పెద్ద తేడా ఏమీ లేదు. దిగుబడుల్లో తేడా ఉంటుందని అనుకుంటే, రైతులు నష్టపోకుండా సన్న రకాలకు , ఎంఎస్‌పి పెంచి ధాన్యం సేకరించాలి.
తెలంగాణాలో కేవలం పార్ బాయిల్డ్ బియ్యమే పండుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా , మంత్రులు, ప్రజా ప్రతినిధులు చేస్తున్న ప్రచారం కూడా సరైంది కాదు. అది పూర్తి అబద్దం. పార్ బాయిల్డ్ అనేది వరి రకం కాదు. అది మిల్లింగ్ ప్రక్రియలో లో ఒక భాగం మాత్రమే. యాసంగి లో ఉష్ణోగ్రతల రీత్యా, మిల్లర్లు పార్ బాయిల్డ్ ( వేడి నీళ్ళ టాంకర్లలో ధాన్యం ఉడక బెట్టడం) చేయకపోతే మిల్లింగ్ లో నూకలు ఎక్కువ, ముడి బియ్యం తక్కువ వస్తాయి. నిజానికి ఏ పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో అయినా, ముడి బియ్యం పట్టవచ్చు.రాష్ట్రంలో సరైన పంటల ప్రణాళిక చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రజల, పశువుల ఆహార అవసరాలు, స్థానిక వ్యవసాయాధారిత పరిశ్రమల ముడి సరుకుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళిక చేసుకోవాలి. లేదా ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలు చేసుకునే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ముందస్తు ఒప్పందాలను కూడా ఈ ప్రణాళిక సమయంలో దృష్టిలో పెట్టుకోవచ్చు.
ఈ నేపధ్యంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, బిజేపి, టిఆర్‌ఎస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం, ధాన్యం రైతులతో బంతాట ఆడడం మానేసి, తక్షణమే చర్చలకు పూనుకోవాలి. వాస్తవ పరిస్థితులను గుర్తించి, ప్రజలకు నిజాలు మాత్రమే చెప్పాలి. ధాన్యం సేకరణ సమస్యను ఈ సీజన్ కు సంభంధించి తక్షణమే పరిష్కరించాలి. నెపం ఒకరి మీద ఒకరు నెట్టుకుని వీధి పోరాటాల ద్వారా, ఈ రెండు పార్టీలూ, చివరికి ధాన్యం సేకరణ చేయడం మానేస్తే, రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరలకు వ్యాపారులకు అమ్ముకుని నష్ట పోతారు. మరింత అప్పుల ఊబిలో కూరుకు పోతారు.
తెలంగాణా రాష్ట్రంలో ఈ యాసంగిలో రైతులు పండించి, తెచ్చే మొత్తం ధాన్యాన్ని ఎంఎస్‌పి తో కొనుగోలు చేయడానికి ఏప్రిల్ 10 నాటికి వరి పండించిన అన్ని గ్రామ పంచాయితీలలో ఐకేపి లేదా రైతు సహకార సంఘాలు, ఎఫ్‌పిఓల ఆధ్వర్యంలో సేకరణ కేంద్రాలను ప్రారంభించాలి.ముడి బియ్యం పట్టినప్పుడువచ్చే నూకలకు ఎలాగూ కొంత విలువ ఉంటుంది. (కిలో 17 రూపాయలు). క్వింటాలుకు 50 కిలోలే ముడి బియ్యం వచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఎఫ్‌సిఐ మార్గదర్శకాలను సవరించుకుని, ఆ మేరకే ప్రతి క్వింటాలు ధాన్యం నుండీ ముడి బియ్యం ఈ సంవత్సరం ప్రత్యేక సందర్భంగా పరిగణించి తీసుకోవచ్చు. లేదా యాసంగిలో అదనపు నూకలు రావడం వల్ల రైస్ మిల్లు యజమానులకు జరిగే నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించవచ్చు. నష్టం అంచనాలను మిల్లర్లతో కలసి, ఉమ్మడిగా, శాస్త్రీయంగా లెక్కించి ఫైనల్ చేయవచ్చు.
కేంద్రం నష్టం భరించడానికి ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే నష్టం మొత్తాన్ని భరించాలి. ధాన్యం కొనుగోలు చేయాలి. కేవలం రాష్ట్ర మార్కెట్ యార్డులలో ప్రైవేట్ వ్యాపారులకు కొనుగోలు సౌకర్యాలు కల్పించి చేతులు దులుపుకుంటే రైతులకు ఎంఎస్‌పి అందె అవకాశం లేదు.ఎఫ్‌సిఐ ప్రతి సంవత్సరం ధాన్యం, గోధుమలు సేకరిస్తూ, నిలవ సౌకర్యాలు సరిగా కల్పించకుండా ఎలుకలకు, తడవడానికి వదిలేస్తూ, చేస్తున్న వేల కోట్ల నష్టం కంటే ,రైస్ మిల్లర్లకు జరిగే ఈ నష్టం భరించడం చాలా తేలిక. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డగోలుగా వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు పంపిణీ చేస్తూ , వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్న దానితో పోల్చినప్పుడు, రైస్ మిల్లర్లకు జరిగే ఈ నష్టాన్నిపూడ్చడం పెద్ద భారం కాదు.
తెలంగాణాలో యాసంగి లో వచ్చే సంవత్సరం వరి విస్తీర్ణాన్ని మరింత తగ్గించాలి. ఖరీఫ్ లో కూడా వరి,పత్తి విస్తీర్ణాన్నితగ్గించడం కోసం ప్రయత్నం చేయగలిగితే మాత్రమే, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సకాలంలో సాగు చేయవచ్చు.పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు లాంటి ప్రత్యామ్నాయ పంటలు కూడా ఎంఎస్‌పి తో సేకరించడానికి కేంద్ర నాఫెడ్ సంస్థ, రాష్ట్ర మార్క్ ఫెడ్ సంస్థ ముందుకు రావాలి. రైతులకు ఈ పంటలకు ఎంఎస్‌పి అందినప్పుడు మాత్రమే వచ్చే సీజన్ లో మళ్ళీ వాటిని సాగు చేస్తారు. రాష్ట్రానికి ఈ వానాకాలం సీజన్ నుండే పంటల బీమా పథకాలు మళ్ళీ ప్రవేశ పెట్టి రైతులకు భరోసా కల్పించాలి.
2018-2019, 2019-2020 సంవత్సరాల పంటల బీమా పరిహారాలను వెంటనే చెల్లించాలి. రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు 2020 సంవత్సర పంట నష్ట పరిహారాన్ని వెంటనే రైతులకు చెల్లించాలి. హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో వేసిన అప్పీల్ ను ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర రైతుల ఋణ మాఫీ హామీ ని ఒకే విడతలో అమలు చేసి రైతులను ఋణ విముక్తులను చేయాలి. కౌలు,పోడు రైతులతో సహా వాస్తవ సాగు దారులకే రైతు బంధు సహాయాన్ని అందించాలి.
– కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక,
9912928422